పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించేదాకా….బీజేపీ దశల వారీ ఉద్యమం

• పార్టీ రాష్ట్ర నేతలు, వివిధ మోర్చాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమావేశం
• అన్ని మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై బీజేపీ కార్యకర్తల ధర్నాలు
• డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ప్లకార్డులు, నల్లబ్యాడ్జీలతో నిరసన
• 2న మహిళా మోర్చా ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై బ్యానర్లతో నిరసన
• 3న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు
• 4న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల వద్ద ధర్నాలు
• 5న ఎస్టీ మోర్చా, 6న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డుల వద్ద నిరసన
• డిసెంబరు 7న మైనార్టీ మోర్చా కార్యకర్తల ధర్నా
పెట్రోలో, డీజిల్ పై విధించిన 35.2 శాతం వ్యాట్ ను తగ్గించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుండి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించారు.
•ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో దీపావళి సందర్భంగా ఈనెల 3న పెట్రోల్ ధరలను ఒక్కో లీటర్ పై రూ. 5లు, డీజిల్ పై రూ. 10 తగ్గించారు. ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్రాలు తమ పన్నుల వాటాను కూడా తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని పిలుపు మేరకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలుసహా దాదాపు 23 రాష్ట్రాల ప్రభుత్వాలు ధరలను తగ్గించాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోలు, డీజిల్ పై పెంచిన 4 శాతం వ్యాట్ ను తగ్గించే చర్యలు తీసుకోకుండా సమస్యను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు.’’అని పేర్కొన్నారు.
• ‘‘గత ఏడాది మే నుండి ఈ ఏడాది నవంబర్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 8.83 లు, డీజిల్‌పై 5.68 రూపాయలు వ్యాట్‌ని పెంచింది. సాధారణంగా ఇన్‌పుట్ ధర పెరుగుదల సమయంలో అదనపు పన్ను విధింపును కేంద్రం అనుమతించడం లేదు. ఇది ప్రజల పట్ల కేంద్రప్రభుత్వానికి ఉన్న నిబద్ధత’’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాత్రం తన వాక్చాతుర్యంతో అన్నీ తనకే తెలుసుననే భ్రమల్లో ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ తీరును అర్థం చేసుకున్నారని తెలిపారు.
• . కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల సంయుక్త కృషి ఫలితంగా ఇతర రాష్ట్రాల్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు, తెలంగాణ సీఎం ఈ విషయంలో మొండిగా వ్యవహరించడంపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు బాసటగా నిలుస్తూ పెట్రోల్ ధరలను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ దశల వారీగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.
• ప్రజావాణికి అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించే వరకు బీజేపీ ఆందోళన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాల నాయకులు స్ఫూర్తిదాయకంగా పోరాడాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీసహా వివిధ మోర్చాలు ఈ కింది తేదీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
• అందులో భాగంగా నవంబర్ 29, 30 తేదీల్లో బీజేపీ కార్యకర్తలు అన్ని మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు.
• డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో 33 జిల్లాల కేంద్రాల్లో ప్లకార్డులు పట్టుకుని నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. డిసెంబరు 2న మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోని చౌరస్తాల వద్ద కేసీఆర్ ప్రజావ్యతిరేక వైఖరిని చాటిచెప్పే బ్యానర్లతో భారీ నిరసనలు చేపడతారు.
• డిసెంబర్ 3న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 4న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల వద్ద ధర్నాలు కొనసాగిస్తారు.
• డిసెంబర్ 5న ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో, డిసెంబర్ 6న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డుల వద్ద చమురుపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టనున్నాయి. డిసెంబరు 7న మైనార్టీ మోర్చా ధర్నా నిర్వహించనుంది.
• అయినప్పటికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.