Suryaa.co.in

Telangana

వాస్తవాలను వక్రీకరించి బీజేపీ ఎంపీలు యువతను రెచ్చగొట్ట వద్దు

-రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఉర్దూ భాషలో యూపీఎస్సీ (U.P.S.C.), పలు -రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను అభ్యర్థులు రాస్తున్నారు
-బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ రాజ్యాంగం పట్ల అవగాహనతో మాట్లాడాలి
-తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొత్తగా ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు జరగడం లేదు
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు జరిగాయి
-వాస్తవాలను వక్రీకరించి బీజేపీ ఎంపీలు యువతను రెచ్చగొట్ట వద్దు
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ 22 భాషల్లో ఏ భాషలోనైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు లేదా ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే హక్కు భారత పౌరులకు ఉంటుందని, వాస్తవాలు తెలుసుకోకుండా, రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ యువతను రెచ్చగొట్టే విధంగా, విద్వేషాలకు పెంపొందించే విధంగా మాట్లాడటం విచారకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు రాజ్యాంగం పట్ల అవగాహన లేక పోవడం విచారకరం అని ఆయన అన్నారు.బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వాస్తవాలను దాచిపెట్టి, వక్రీకరించి యువతలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం బాధాకరం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన 2014 నుంచి 2022 వరకు జారీ అయిన యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్, నోటిఫికేషన్లో కూడా ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్., ఐ.ఎఫ్.ఎస్. వంటి ఉద్యోగాల కోసం ఉర్దూలో పరీక్షలు రాస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు.

ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయడం గురించి కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ అయినా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.వాస్తవాలను తెలుసుకాకుండా యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ లకు వినోద్ కుమార్ హితవు చెప్పారు.

LEAVE A RESPONSE