Suryaa.co.in

National

స్వాతంత్ర్య వీరుల గురించి యువతరానికి తెలియజేయాలి: ఉపరాష్ట్రపతి

-స్వాతంత్ర్య వీరుల గురించి యువతరానికి తెలియజేయాలి: ఉపరాష్ట్రపతి
-స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు శ్రీ హేమవతి నందన్ బహుగుణ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
-వారు పాటించిన నైతిక ప్రమాణాలు నేటికీ పార్లమెంటేరియన్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయి
పేదలు, వెనుకబడిన వర్గాలకోసం పనిచేసిన నాయకుడు శ్రీ బహుగుణ అని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

భారత స్వాతంత్ర పోరాటంలో తను, మన, ధన, ప్రాణాలను త్యాగం చేసిన వారిలో ఎంతోమంది కనీస గుర్తింపునకు కూడా నోచుకోలేదని గౌరవ భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వారికి మన చరిత్ర పుస్తకాల్లో సరైన స్థానం కల్పించడం ద్వారా వారి త్యాగాలను యువతరానికి, చిన్నారులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఇలాంటి గాథల స్ఫూర్తితో వారు జాతినిర్మాణంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు వీలుంటుందని ఆయన అన్నారు.

బుధవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతివేత్త శ్రీ హేమవతి నందన్ బహుగుణ జీవిత చరిత్ర ‘హేమవతి నందన్ బహుగుణ: ఎ పొలిటికల్ క్రుసేడర్’ పుస్తకాన్ని (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) ఉపరాష్ట్రపతి
Whats-App-Image-2022-05-04-at-7-00-56-PMఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని హేమవతి నందన్ బహుగుణ కుమార్తె, ప్రొఫెసర్ రీటా బహుగుణ జోషి, డాక్టర్ రామ్ నరేశ్ త్రిపాఠీలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ చరిత్ర ఎంతో ఘనమైనది ఎందరోమంది వీరులు స్వాతంత్ర్య సాధన అనే ఏకైక లక్ష్యంతో సర్వస్వాన్నీ త్యాగం చేశారన్నారు. అలాంటి చరిత్ర మనందరికీ గర్వకారణమన్నారు.

శ్రీ హేమవతి నందన్ బహుగుణ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశ సేవకోసం సర్వస్వాన్నీ అర్పించారన్న ఉపరాష్ట్రపతి, స్వాతంత్ర్యానంతరం కూడా విలువలతో కూడిన రాజకీయ జీవితం, చతురత కలిగిన పాలకుడిగా దేశ రాజకీయాలపై తనదైన ముద్రవేశారని గుర్తుచేశారు. వారి జీవిత చరిత్రను చదువుతుంటే మొదట రెబల్ గా ఆ తర్వాత వారి ఆలోచనలన్నీ దేశం ప్రాధాన్యతగానే ఉండేవనే విషయం సుస్పష్టం అవుతుందన్నారు.

శ్రీ బహుగుణ 17 ఏళ్లకే స్వాతంత్ర్య సంగ్రామంలో భాగస్వాములయ్యారని ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టు అయినపుడు జైల్లో బ్రిటిషర్ల చిత్రహింసలను అనుభవించారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. మాతృభూమి కోసం లాభాపేక్ష లేకుండా పనిచేశారన్నారు. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం వారి పోరాటాన్ని గుర్తించి కాస్త భూమిని కూడా ఇచ్చేందుకు ముందుకు రాగా, దాన్ని కూడా శ్రీ బహుగుణ సున్నితంగా తిరస్కరించడం, ఆ భూమిని ఇతరులెవరికైనా ఇవ్వాలని కోరడం శ్రీ బహుగుణ నిరాడంబరతకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి అన్నారు.

గాంధేయవాదిగా విలువలతో కూడిన రాజకీయాలను అలవర్చుకున్న శ్రీ బహుగుణ, దేశంలో అత్యయిక పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించారన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థి దశ నుంచే ఆయన పేదల కోసం, విద్యార్థులకు చదువు చెప్పించాల్సిన అవసరం గురించి పోరాడారన్నారు. అనంతరం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఎస్సీ, ఎస్టీలకు భూవితరణ చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. ఇందుకు మెచ్చిన శ్రీ వినోబా భావే గారు శ్రీ బహుగుణకు ‘మిట్టీ నందన్’ అని బిరుదునివ్వడం సాధారణ విషయం కాదన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రమైన తాగునీరు, మహిళలు దూరం నుంచి నీటిని తెచ్చుకోవడం తదితర అంశాలపై శ్రీ బహుగుణ ఎంతో కృషిచేశారన్నారు.

1980లో ఓ రాజకీయ పార్టీనుంచి రాజీనామా చేసిన శ్రీ బహుగుణ ఆ వెంటనే తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం వారి విలువలతో కూడిన రాజకీయ జీవితానికి ఒక ఉదాహరణ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం అమల్లో లేని రోజుల్లోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గొప్పవిషయన్నారు. యువతరం ఇలాంటి మహనీయుల జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా నైతికతను, విలువలను అలవర్చుకోవాలన్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి బహుగుణ వంటి నేతల జీవితం స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ పుస్తక రచయితలైన ప్రొఫెసర్ రీటా బహుగుణ జోషి,  రామ్ నరేశ్ త్రిపాఠీలను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి  పుష్కర్ సింగ్ ధామి,  విజయ్ బహుగుణ, పార్లమెంటు సభ్యురాలు  రీటా బహుగుణ జోషితోపాటు పలువురు రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE