– బీజేపీకి 68-72 స్థానాలు
– కాంగ్రెస్ పార్టీకి 22-26 స్థానాలు వచ్చే అవకాశాలు
– హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వానికి 45 శాతం మద్దతు
– పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడి
అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలెయెన్స్ (ఎన్ఈడీఏ) వరుసగా మూడోసారి అధికారంలోకి రానుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎన్ఈడీఏగా పిలువబడుతుంది.
అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి 64 స్థానాలు కావాలి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 68-72 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 22-26 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.
ఎన్ఈడీఏ కూటమిలో బీజేపీ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ) 7-10, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 8-9 స్థానాల్లో గెలిచే అవకాశాలుండడంతో ఎన్డీఏ కూటమి 90 స్థానాలకు చేరుకోవచ్చు.
బీజేపీ 38.6 శాతం, కాంగ్రెస్ 36.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది.
అస్సాం ఎన్నికల్లో ఇతర పార్టీలైన ఏఐయూడీఎఫ్, రాయిజర్ దాల్, యూపీపీఎల్, ఏజేపీ, సీపీఐ(ఎం), ఇతరుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది.
బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వానికి 45 శాతం మద్దతిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగాయ్కు 35 శాతం మద్దతిస్తున్నారు.
అప్పర్ అస్సాంలో ఎన్డీఏ పటిష్టంగా ఉంది. మధ్య అస్సాంలోని నాగావ్, హూజాయ్, కర్బి అంగలాంగ్, దిమా హసావ్, దారంగ్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ కనిపించింది. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న లోయర్ అస్సాంలో ఏఐయూడీఎఫ్ గతంలో పోలిస్తే కొంత బలోపేతమయినా ఇక్కడ ఎన్డీఏ ఆధిపత్యం కనిపిస్తోంది.