– సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు సంజయ్ లేఖ
నగరంలోని రైల్వేస్టేషన్లకు అప్రోచ్‌రోడ్ల కోసం స్థలం కేటాయించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి, నమస్కారం!
విషయం:-
(i) చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ వసతులు మరియు అప్రోచ్ రోడ్డు కొరకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని కేటాయించి అభివృద్ధి చేయించాలని, మరియు
(ii) నాగులపల్లి రైల్వేస్టేషన్ వద్ద టెర్మినల్, పార్కింగ్ అభివృద్ధి కోసం 300 ఎకరాలు, అప్రోచ్ రోడ్డు కోసం కూడా అవసరమైన స్థలాన్ని కేటాయించాలని అభ్యర్థన.
* * *
1. సికింద్రాబాద్, నాంపల్లి మరియు కాచిగూడ రైల్వేస్టేషన్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వీలుగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు తూర్పున ఉన్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో మార్చి 2023 నాటికి కొత్త టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకురావటానికి అవసరమైన అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ సమావేశాల అనంతరం ఇటీవలే రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ మరియు పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఉమ్మడిగా స్థల పరిశీలన చేయడం జరిగింది. అనంతరం చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు కనెక్టివిటీ గురించి క్రింది విషయాలు చర్చించబడ్డాయి.
i. ఎఫ్‌సిఐ గోడౌన్ వైపు నుండి స్టేషన్ కొత్త భవనం వైపుకు వెళ్ళే 100 అడుగుల వెడల్పుగల రోడ్డును రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి చేయుటకొరకు ప్రతిపాదించారు. ఇందునిమిత్తము, 4.61 ఎకరాల స్థలాన్ని సంబంధిత రాష్ట్రప్రభుత్వ సంస్థకు కేటాయించవలసియున్నది. (Ref: MD/HMRL Letter dated 29.05.2020)
ii. భరత్ నగర్ వైపు గల అప్రోచ్ రోడ్డు 28 అడుగులు మాత్రమే కలదు. ఈ రోడ్డును కనీసం 60 అడగుల వెడల్పు గల రోడ్డుగా చేయుటకు తగిన స్థలమును సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కేటాయించవలసియున్నది.
iii. ఈసీనగర్ వైపు అప్రోచ్ రోడ్డు ప్రస్తుతము 30 అడుగులు మాత్రమే యున్నది. ఈ రోడ్డును 100 అడుగుల రోడ్డుగా చేయుటకు తగిన స్థలమును సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కేటాయించవలసియున్నది. అంతేకాకండా, కొత్తస్టేషన్ వైపు గల అర్బన్ ఫారెస్ట్ స్థలము బస్సులు నిలుపుటకు, పార్కింగ్ కొరకు ప్రజల సౌకార్యార్థం చాలా అనుకూలమైనది. ఇందు కొరకు కూడా తగిన స్థలాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కేటాయించవలసియున్నది.
పైన ప్రతిపాదించిన అప్రోచ్ రోడ్లను సత్వరమే అభివృద్ధి చేయాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు ఆదేశాలు జారీ చేయాలని మనవి చేస్తున్నాను.
2. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు పడమర వైపు ఉన్న నాగులపల్లి రైల్వేస్టేషన్ వద్ద కూడా టెర్మినల్, పార్కింగ్ అభివృద్ధికి దాదాపు 300 ఎకరాల స్థలాన్ని రైల్వేశాఖకు కేటాయించాలని, ఈ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు అభివృద్ధి కోసం అవసరమైన స్థలాన్ని కూడా ఇవ్వాలని కోరుతున్నాను.
ఈ రెండు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు (చర్లపల్లి దగ్గర) మరియు రైల్వేశాఖకు (నాగులపల్లి దగ్గర) ఉచితంగా అందించినయెడల, రైల్వే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించటంతో పాటుగా ఆయా ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ విషయంలో వ్యక్తిగత చొరవ తీసుకొని సత్వరమే సానుకూలమైన చర్యలకు ఉపక్రమించగలరని ఆకాంక్షిస్తున్నాను.
కృతజ్ఞతలతో
ఇట్లు
భవదీయ
బండి సంజయ్ కుమార్