కేసీఆర్…. పిచ్చోడివై రోడ్లపై తిరిగే రోజులు రాబోతున్నయ్

-రాష్ట్ర ప్రజల ఉసరు పోసుకుంటున్నావ్
-ప్రాజెక్టు కోసం సర్వస్యం త్యాగం చేసిన వాళ్లపై ఇంత రాక్షసత్వం ప్రదర్శిస్తావా?
-మహిళల బట్టలు చింపి పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినా స్పందించవా?
-నీ పాలనలో అప్పులపాలై సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నా నోరు మెదపవా?
-సర్పంచులకు పూర్తి అధికారాలు బదలాయిస్తామన్న హామీ ఏమైంది?
-వేలమంది బ్రాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోవా?
– ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
– గవర్నర్ ను కలిసి ఆయా అంశాలపై సర్కార్ తీరును వివరించిన బీజేపీ నేతలు

‘‘ కేసీఆర్…. నువ్వు సీఎంగా ఉండేది మహా అంటే 6 నెలలు.. ఏడాదే…. రాష్ట్ర ప్రజలను రాచి రంపాన పెడుతున్నవ్… వాళ్ల ఉసురు నీకు తగలక మానదు. అత్యాచారాలు, హత్యలకు గురైన కుటుంబాలతోపాటు నీ వల్ల బాధితులైన అన్ని వర్గాల ప్రజల ఉసరు తగిలి పిచ్చోడిలా రోడ్లపై తిరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్… ఆరోజు బాధిత ప్రజలంతా… మా ఉసరు తగలడంవల్లే నువ్వు పిచ్చోడివయ్యావని మాట్లాడుకునే రోజులు రాబోతున్నయ్’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరాచకంతో సైకోలా మారితే రాష్ట్ర ప్రజలు తిరగబడటం ఖాయమని హెచ్చరించారు.

ఈరోజు ఉదయం బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎం.జయశ్రీ తదితరులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ను కలిశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుసహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి గవర్నర్ కు వినతి పత్రం అందించారు.

అదే విధంగా గౌరవెల్లి బాధితులతో కలిసి గౌరవెల్లి నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్, పరిహారం విషయంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మరో వినతి పత్రం అందజేశారు. అట్లాగే బాసర ట్రిపుల్ ఐటీలో కనీస వసతుల్లేక, అధ్యాపకుల్లేక వేలాది మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను, ఆయా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను గవర్నర్ ద్రుష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయా నేతలతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….

అధికారంలోకి వస్తే సర్పంచులకు పూర్తి అధికారాలు బదలాయిస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని 25వ పేజీలో హామీ పొందుపర్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా చట్టం తీసుకొచ్చి సర్పంచులను రాచిరంపాన పెడుతున్నారు. సర్పంచులకు అధికారాల్లేకుండా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. అడిగితే బెదిరిస్తున్నరు. ప్రశ్నిస్తే సస్పండ్ చేస్తున్నరు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.15 లక్షల ప్రోత్సహక నగదు ఇవ్వడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ తీరువల్ల సర్పంచులు కూలీలుగా మారుతున్నరు. ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు.

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రమే నిధులిస్తోంది. పల్లె ప్రక్రుతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలుసహా అన్ని పనులకు నిధులను కేంద్రమే ఇస్తోంది. ఆ నిధులను కూడా దారి మళ్లిస్తున్నరు. సర్పంచులు అభివ్రుద్ధి పనులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిల్లులు మంజూరు చేయకుండా హింసిస్తోంది. ఒక్కో సర్పంచ్ కు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల నుండి 20 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టింది.

ఒక్కో సర్పంచ్ కు మూడు రకాల అకౌంట్లున్నాయి. ఆ మూడు అకౌంట్లను కూడా ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. కేంద్ర నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటోంది. నిధులు విడుదల చేస్తున్నట్లు జీవోలిస్తూ… మరోవైపు ఆ నిధులను ఫ్రీజ్ చేయడం దారుణం.

కేసీఆర్ తీరువల్ల సర్పంచులు ఎందుకు గెలిచామా? అనే భావనలో ఉన్నారు… ఈ సమస్యలన్నీ గవర్నర్ కు వివరించాం. గ్రామ పంచాయతీలుసహా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కోరాం. కేంద్ర నిధుల మళ్లింపు అంశాన్ని వివరించాం… గవర్నర్ సానుకూలంగా విన్నారు.. ఆయా సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.

గౌరవెల్లి నిర్వాసితుల విషయానికొస్తే… ఈ ప్రాజెక్టు 2007లో 1.4 టీఎంసీ నీటితో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆనాడు భూములిచ్చినోళ్లకు పరిహారమే ఇప్పటికీ ఇవ్వలేదు. ఆ తరువాత రీడిజైన్ పేరుతో అంచనా పెంచి భూములు తీసుకున్నారు. ఆయా రైతులకూ నేటికీ పరిహారం ఇవ్వలేదు. భూ నిర్వాసితులందరినీ అన్ని విధాల ఆదుకున్నాకే ప్రాజెక్టు నిర్మిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వాళ్లపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. నీళ్లకు బదులుగా రైతుల రక్తాన్ని పారిస్తున్నరు.

చాలామంది నిర్వాసితులకు ఇంతవరకు ఇండ్లు ఇవ్వలేదు. స్థలాలివ్వలేదు. గిరిజన కుటుంబాలకు న్యాయం జరగడం లేదు. కోర్టు సైతం నిర్వాసితుల పక్షాన తీర్పు ఇచ్చినా… ఎన్జీటీ స్టే ఇచ్చినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

వాటి కోసం న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితుల ఇండ్లపై అర్ధరాత్రి వందలాది పోలీసులను పంపి ఇండ్లపై దాడులు చేయిస్తవా? మహిళలు, పిల్లలు, వ్రుద్దులని చూడకుండా విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయిస్తవా? అమ్మాయిల బట్టలు, బ్లౌజులు చింపుతూ రాక్షసానందం పొందుతవా?
ఇదేం పద్దతని ప్రశ్నిస్తూ న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న గౌరవెల్లి నిర్వాసితులపై టీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతూ దాడులు చేశారు. టీఆర్ఎస్ గూండాలకు కొమ్ముకాస్తున్న పోలీసులు లాఠీలు, కర్రలు, పైపులతో నిర్వాసితులపై విచక్షణారహితంగా చితకబాదారు. అసలు అర్ధరాత్రి ఇండ్లపై దాడి చేయడమేంది? కొట్టడమేంది? ఇదేం ప్రజాస్వామ్యం?

కష్టపడి తాత ముత్తాతలు సంపాదించిన భూములను, ఆస్తులను కోల్పోయిన వారిపై కనీసం మానవత్వం చూపాలనే కనికరం కూడా లేదా? సీఎం… నీ పిల్లలు, నీ మనువడి వయసున్న వాళ్లపై దాడులు చేయిస్తావా? ఆడవాళ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తుంటే రాక్షసానందం పొందుతున్నావ్? నీకు కుటుంబం లేదా?.. నువ్వు, నీ కుటుంబం సంతోషంగా ఉండాలె.. కోట్లు సంపాదించి జల్సాలు చేయాలే… కానీ సర్వస్వం కోల్పోయిన వాళ్లను ఆదుకోవాలని అడిగినందుకు పేదలపై లాఠీలు ఝుళిపించి రాక్షసానందం పొందుతావా?

నీ పాలనలో బాధలు పడ్డ ఆర్టీసీ కార్మికులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగులోపాటు అత్యాచారాలు, హత్యలకు గురైన కుటుంబాల ఉసరు నీకు తగులక మానదు. కేసీఆర్… నువ్వుండేది మరో 6 నెలలే… ఆ తరువాత నువ్వు అధికారం కోల్పోవడం ఖాయం… బాధితుల ఉసరు తగిలి నువ్వు పిచ్చోడిలా రోడ్లపై తిరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్… ఆరోజు బాధితులంతా… మా ఉసురు తగిలే కేసీఆర్ పిచ్చోడిలా రోడ్లపై తిరుగుతున్నాడంటూ మాట్లాడుకునే రోజులు రాబోతున్నయ్… అరాచకంతో సైకోలా మారితే ప్రజలు తిరగబడటం ఖాయం..

ఇక్కడి బాధితులను ఆదుకోవాలని కోరుతుంటే… పంజాబ్ వెళ్లి ఒక్కో రైతుకు రూ.3 లక్షలిస్తవా? ప్రజలు పన్నులు కట్టిన వందల కోట్ల రూపాయలను నీ సొంత ప్రచారం కోసం దేశవ్యాప్తంగా యాడ్స్ ఇస్తావా?
గౌరవెల్లి బాధితులకు న్యాయం జరిగే వరకు, వారిపై దాడులకు పాల్పడ్డ పోలీసులు, టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే దాకా బీజేపీ పోరాడుతుంది. అందులో భాగంగా మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తాం. చట్ట, న్యాయపరంగా పోరాడుతాం…

బాసర ట్రిపుల్ ఐటీలో 8 వేల మంది విద్యార్థులు కనీస సౌకర్యాల్లేక అల్లాడుతున్నరు. భోజనం సరిగా లేదు. పురుగుల అన్నం, నీళ్ల చారు, దొడ్డు బియ్యం పెడుతున్నరు. 8 వేల మందికి ఒకటే భోజనశాల. రేకుల షెడ్లో ఉంటున్నరు. లైబ్రరీలో చదువుకోవడానికి పుస్తకాల్లేవు.

అక్కడ చదువుకునే వాళ్లంతా పేదోళ్లే. ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆశతో వస్తే రాచి రంపాన పెట్టి విద్యార్థుల ఆశలను అడియాశలు చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. వాళ్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు బీజేపీ అండగా ఉంటూ పోరాడుతుంది.

Leave a Reply