Home » రేవంత్‌రెడ్డికి ‘కమ్మ’టి షాక్

రేవంత్‌రెడ్డికి ‘కమ్మ’టి షాక్

– మాకు ఒక్క ఎంపీ సీటివ్వరా?
– ఏమిటీ మీ రెడ్ల కులపిచ్చి?
– మేం ఎంపీ సీటుకు పనికిరామా?
– కమ్మలతోనే కదా మీరు ఎదిగింది?
– అన్ని పదవులూ రెడ్లకే ఇస్తారా?
– కాంగ్రెస్‌కు కమ్మల ఓట్లు అవసరం లేదా?
– తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కమ్మ సంఘనేతల బహిరంగ లేఖ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రెడ్డికుల పక్షపాతంపై తెలంగాణ కమ్మసంఘ నాయకులు విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణలో ప్రభావితమైన కమ్మ వర్గానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వరా? అన్ని పదవులూ రెడ్లకే కట్టబెడతారా? కమ్మలతో ఈ స్థాయికి వచ్చిన విషయం రేవంత్‌రెడ్డి మర్చిపోయారా? చంద్రబాబునాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ దన్నుతో ఈ స్థాయికి వచ్చిన రేవంత్‌కు, కమ్మలు ఎంపీకి పనికారన్న భావనతో ఉంటే మేం కూడా ఎన్నికల్లో సత్తా చూపిస్తామ’’ని హెచ్చరించారు. కమ్మవర్గం బలం ఉన్న ఖమ్మం సీటును కమ్మకు ఇవ్వకుండా కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మేరకు కమ్మసమాజం పేరిట విడుదల చేసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

కమ్మ సమాజం బహిరంగ లేఖ పూర్తి పాఠమిదీ..

తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కింది విషయాల పై సమాధానం ఇవ్వవలసిందిగా తెలంగాణ కమ్మ కులం డిమాండ్ చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా సామాజికంగా కమ్మలు అత్యంత ప్రభావితమైనటువంటి వర్గమని మీరు భావించట్లేదా?
మీ రాజకీయ ఉన్నత స్థితికి పునాది వేసింది కమ్మ కులస్తులు కాదా?
శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతి చలవతో మీరు కమ్మలను వాడుకొని ఈ స్థితికి వచ్చారని మరిచిపోయారా?
బీసీ బిడ్డల త్యాగాలకు బలోపేతమైన తెలుగుదేశం పార్టీకి నిన్ను అధ్యక్షుడిగా చేసింది ఎవరు?
ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇతర కమ్మ మీడియా సంస్థల దన్నుతో, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగింది వాస్తవం కాదా?
నువ్వు పీసీసీ అధ్యక్షుడైతే మొట్టమొదట అక్కున చేర్చుకుంది మా నాయకురాలు, ఎంపీ రేణుక చౌదరి కాదా?
అమాయక తెలంగాణ కమ్మవారు మీలో చంద్రబాబు నాయుడుని చూసుకున్నది వాస్తవం కాదా?

తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో 37 అసెంబ్లీ నియోజకవర్గాలను కమ్మ కులం ప్రభావితం చేస్తుందనే విషయం మీకు తెలియదా లేదా తెలిసి నటిస్తున్నారా?
గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఉన్న కమ్మలు గుండు గుత్తగా మీకు ఓట్లు వేసిన విషయం మరచిపోయారా? ఆ దన్నుతోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు అనే వాస్తవాన్ని అటకెక్కించారా?
ఎన్నికలు కాగానే నీ కులానికి మూడు మంత్రి పదవులు, 14 కార్పొరేషన్లు, 17 మంది అధికారులకు అత్యంత కీలకమైన పోస్టులు ఇచ్చింది వాస్తవం కాదా?
అన్ని కులాలకు కార్పొరేషన్లు ప్రకటించి కమ్మలను పక్కన పెడితే, మా మా సామాజిక వర్గంలో పెల్లుబికిన అసంతృప్తిని చూసి కమ్మలకు మరల కార్పొరేషన్ ముష్టిగా వేసినటువంటి చరిత్ర మీది కాదా?

తెలంగాణలోని10 ఉమ్మడి జిల్లాలలో ఖమ్మం జిల్లా కమ్మలకు అత్యంత బలమైన జిల్లా అనే విషయం మీకు తెలియదా?
పార్లమెంట్ ఎన్నికలలో నీ రెడ్డి కులానికి ఉన్న 17 సీట్లలో , ఏడు సీట్లను కేటాయించి నీ కుల పక్షపాతాన్ని నిరూపించుకున్నది వాస్తవం కాదా?
రాష్ట్రంలో ఉన్న బలమైన కమ్మ కులం ఒక్క పార్లమెంటు సీటుకు కూడా అర్హులు కాదా?
ఖమ్మం, చేవెళ్ల, మల్కాజిగిరి లాంటి ఒక్క సీట్లో కూడా పోటీకి మా కులం నుండి అభ్యర్థులు దొరకలేదా? లేదా నీ కుల పెత్తనాన్ని మా మీద రుద్దాలని నిర్ణయం తీసుకున్నావా?
నీ కులానికి చెందిన నీ శత్రువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడే కాకుండా నటుడు దగ్గుబాటి వెంకటేష్ వియ్యంకుడు అయిన రఘురాం రెడ్డి కి ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. కానీ నీకు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఔన్నత్యాన్ని ఇచ్చిన కమ్మ కులాన్ని పక్కన పెట్టడాన్ని మా కులం జీర్ణించుకోలేక పోతుంది.
రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు, ఆర్థిక పునాదులు కలిగిన మా కమ్మ కులం రాబోయే ఎన్నికలలో నీవు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ఒక్కసారి పబ్లిక్ గా చెప్పే దమ్ము నీకు ఉందా?.
మాకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే ఎన్నికల్లో, నీవు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఘోరి కట్టడం మా ఆశయం అని తెలుసుకో రేవంత్ రెడ్డి.

జై కమ్మ …. జై ఎన్టీఆర్

Leave a Reply