Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి డొక్కా గుడ్‌బై

-జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా
-దళిత నేత డొక్కాకు అడుగడుగునా అవమానాలే
-సీఎంను ఒక్కసారి చూపించాలని రెడ్లను వేడుకున్న విషాదం
-విధిలేక బయటకు వచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్
-డొక్కాను గౌరవించిన బాబు, లోకేష్
( అన్వేష్)

అమరావతి: అనుకున్నదే అయింది. చాలాకాలం నుంచి అసంతృప్తి-అవమానంతో రగిలిపోతున్న వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, దళితనేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీకి కొద్దికాలం నుంచీ దూరంగా ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు, కనీసం సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించారు.

‘నేను మిమ్మల్ని ఏమీ అడగను. ఒక్కసారి నన్ను సీఎం గారి దగ్గరకు తీసుకువెళ్లండి’’ అని జాలిగా రెడ్డినేతలను అభ్యర్ధిస్తూ.. గతంలో డొక్కా చేసిన అభ్యర్ధన, వైసీపీలో దళితుల స్థానమేమిటో చెప్పినట్టయింది. నిజానికి డొక్కా పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ మీడియాలో వచ్చినా, ఆయన దానిని ఖండించలేదు. అవరసమైనప్పుడు స్పందిస్తానన్నారు.
ఇప్పుడు ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాసిన లేఖ పార్టీని ఇరుకున పెట్టింది. డొక్కా రాజీనామాతో వైసీపీకి మాదిగల ఓట్లు మరింత దూరమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి డొక్కా వివాదరహిత నేత. హుందాతనం, విలువతో కూడిన రాజకీయాలు చేసే కొదిమందిలో ఒకరన్న పేరుంది.

‘‘డొక్కా కు టీడీపీలో చంద్రబాబునాయుడు, లోకేష్ చాలా ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో చేరగనే టికెట్, ఎమ్మెల్సీ సీటిచ్చారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆయన అభిప్రాయానికి పెద్ద పీట వేశారు. మాదిగల సమస్యలను బాబు దృష్టికి తీసుకువెళ్లడంలో బాగా కృషి చేశారు. అలాంటి ది ఆయన టీడీపీని కాదని వైసీపీలో చేరారు. డొక్కా మనస్తత్వానికి వైసీపీ సరైంది కాదని, ఆయన అక్కడ ఎక్కువకాలం ఉండలేరని మాకు ముందే తెలుసు’’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE