Suryaa.co.in

Telangana

ఎంఎంటీఎస్ బాధితురాలికి అండగా బీజేపీ

– యశోద ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు
– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పాయల శంకర్, పాల్వాయి హరీష్, రామారావుపటేల్
– బాధితురాలికి భరోసా ఇవ్వడంతోపాటు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

సికింద్రాబాద్:  ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న 22 ఏళ్ల యువతిపై దాడి చేసిన దుర్మార్గులను అరెస్ట్ చేయకపోవడం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్ మండిపడ్డారు. బాధితురాలి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సైతం వారు ఖండించారు.

సాయంత్రం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డితో కలిసి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి విచ్చేసిన ఆయా ఎమ్మెల్యేలు బాధితురాలని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడంతోపాటు ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇంత దుర్మార్గం జరిగినా నిందితులను అరెస్ట్ చేయలేదని, ఈ విషయంలో ప్రభుత్వం నుండి సరైన స్పందన కూడా లేకపోవడం శోచనీయమన్నారు.

ఆడపిల్లపై అఘాయిత్యానికి ప్రయత్నించారని తెలిసిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని స్పందించిన తీరు అభినందనీయమన్నారు. బీజేపీ పక్షాన బాధితురాలికి అన్ని విధాలా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

బండి సంజయ్, శిల్పారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బాధితురాలిపై దాడి చేసిన ఆగంతకులను పట్టుకుని శిక్షించకపోవడం, కనీసం బాధితురాలికి తగిన వైద్య, ఆర్ధిక సాయం కూడా చేయకపోవడం క్షమించలేనిదని మండిపడ్డారు. ఇకనైనా వెంటనే ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE