Suryaa.co.in

Telangana

70 కోట్ల నిధులను ఇఫ్తార్ కోసం ఖర్చు చేయడం అన్యాయం

– మైనారిటీ సంక్షేమ నిధుల దుర్వినియోగాన్ని తక్షణమే ఆపాలి
– బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ నిధులను దుర్వినియోగం చేస్తోందని పౌర సమాజం వ్యక్తం చేసిన ఆందోళనకు బిజెపి మద్దతు తెలిపింది.

రంజాన్ పండుగను పురస్కరించుకొని ఇఫ్తార్ విందుల నిర్వహణ కోసం ఈ నిధులను వినియోగించడం బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పౌర సమాజం అభిప్రాయాలను గౌరవించాలని, సంక్షేమ నిధులను లక్ష్యబద్ధంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సామాజిక కార్యకర్త డాక్టర్ లుబ్నా సర్వత్, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు సలీం అల్‌హిందీ, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జనరల్ సెక్రటరీ సయ్యద్ రఫీ వంటి వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు.

భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సంక్షేమ నిధుల సరైన వినియోగానికి అనుకూలమని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న వేళ రూ.70 కోట్ల నిధులను ఇఫ్తార్ కోసం ఖర్చు చేయడం అన్యాయమని సుభాష్ పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉంటే అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు చేపట్టొచ్చు. కానీ, ముఖ్యమంత్రి స్వయంగా ఆర్థిక సంక్షోభాన్ని అంగీకరించిన సమయంలో ఈ విధమైన ఖర్చులు సమంజసం కావు” అని తెలిపారు.

అలాగే, గ్రేటర్ హైదరాబాద్ మైనారిటీ కాంగ్రెస్ చైర్మన్ హర్షద్ షేక్ చేసిన వ్యాఖ్యలను బిజెపి తప్పుబట్టింది. గత 10 ఏళ్లుగా ఇలాంటి ఖర్చు జరుగుతోందని సమర్థించడం సరికాదని సుభాష్ పేర్కొన్నారు. “ఇంతకాలంగా ఒక తప్పు జరిగిందని అర్ధం, అది ఎప్పటికీ కొనసాగాలి అనే కాదని” ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ నిధులు పారదర్శకంగా, లక్ష్యబద్ధంగా వినియోగించాల్సిన అవసరాన్ని మరొక్కసారి నొక్కిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి, అసలైన సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్వీ సుభాష్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE