Suryaa.co.in

Telangana

కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది …

-తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు,ఎం.పి  బండి సంజయ్‌కుమార్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది. నిజం చెబితే అతని తల వెయ్యి ముక్కలైతదట. అందుకే ఆయన ఏనాడూ ఒక్క నిజం చెప్పరు.. నోరు విప్పితే అబద్దాలే… చేసేవన్నీ మోసాలే…తడిబట్టతో గొంతు కోసే రకం. ఎన్నికలొస్తున్నయంటే… అబద్దాలకు అంతుండదు. కేసీఆర్‌ మార్చే రంగులకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడతది. అబద్దాల ప్రచారానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన గోబెల్స్‌ బతికుంటే… తనను మించిన అబద్దాలాడేటోడు కూడా ఉన్నారా? అని ఆశ్చర్యపోయేటోడు. కేసీఆర్‌ అబద్దాలకు తాజా నిదర్శనం మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని గ్లోబల్స్‌ ప్రచారం చేయడం. మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న మాట నిజమైతే వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి లేదా లై డిటెక్టర్‌ టెస్ట్‌ కు కేసీఆర్‌ సిద్ధమా? బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా నేను సిద్ధం.

కేసీఆర్‌ తియ్యగా చెప్పే అబద్ధాలు, సామెతలతో వండివార్చే మాయ మాటలు, అహంకారంతో ముడిపెట్టే వెటకారాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం ఒక కామెడీ షోలాగా మాత్రమే చూస్తున్నరు. మునుగోడు బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాయ మాటలు, అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన గారడి మాటలన్నింటికీ తెలంగాణ ప్రజల తరఫున సమాధానం చెప్పడానికి, బహిరంగ చర్చకు బిజెపి తెలంగాణశాఖ సిద్ధంగా ఉంది.

మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదని బిజెపి తెలంగాణశాఖ నిరూపిస్తుంది. అందుకు తగ్గ ఆధారాలను చూపిస్తాం. మేం చూపెట్టే ఆధారాలను చూసినతరువాత తప్పయిందని కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతారా? ఒకవేళ టీఆర్‌ఎస్‌ మాది తప్పని నిరూపిస్తే… బిజెపి తెలంగాణశాఖ దేనికైనా సిద్ధమే? బిజెపి తెలంగాణ శాఖ సవాల్‌ కు అంగీకరించాలని కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీని డిమాండ్‌ చేస్తున్నాం.

బిజెపి వస్తే మన బాయికాడ మీటర్లు పెడ్తరని రైతులను కేసీఆర్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నరు. ఇప్పటికే దేశంలో 17 రాష్ట్రాల్లో బిజెపి -ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. అక్కడ రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు ఆధారాలు కేసీఆర్‌ చూపించగలరా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నది. మునుగోడులో ప్రజలు టీఆర్‌ఎస్‌ ఫ్యూజు పీకేస్తే, ఫామౌజ్‌ లో కేసీఆర్‌ మోటర్‌ ఆగిపోతది. నాలుగొందల ఎకరాల ఫామౌజ్‌ కు ఎంత కరెంటు వాడుకుంటున్నరు? ఎంత కరెంటు బిల్లు కడుతున్నారో తెలంగాణ ప్రజలకు లెక్క జెప్పే రోజు వస్తది.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పిందట…. మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే కేంద్రం మీటర్లు పెడుతుండట. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదు. కేంద్రం చేసిన చట్టంలో యాక్ట్‌ కాపీలో స్పష్టంగా ఉంది. అయినా గ్లోబల్స్‌కు వారసుడైన కేసీఆర్‌ అబద్దాలకు తెగబడుతున్నరు. మోటార్లకు మీటర్లు పెట్టాలనే కేసీఆర్‌ ఆలోచన వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. అసలు ఉచిత కరెంట్‌ ఇయ్యడం కేసీఆర్‌కు చేతగావడం లేదు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. ప్రభుత్వం దగ్గర పైసల్లేవు. జీతాలియ్యడానికే పైసల్లేవ్‌. ఇగ ఫ్రీ కరెంట్‌ ఎట్లా ఇచ్చేదని తల పట్టుకుంటున్నరు.

మాటకు ముందు, మాటకు వెనక తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నా అంటున్నరు. వానాకాలం సాగుమొదలైనప్పటి నుండి 24 గంటల కరెంటు ఇస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం కరెంటు రాక పోక తెలియక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పవర్‌కట్‌లు, లోడ్‌ప్రాబ్లమ్‌ అంటూ కోత విధిస్తున్నారు. దీనివల్ల రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటికి కేసీఆర్‌ ప్రభుత్వం కారణం కాదా? 24 గంటలు ఫ్యాన్లు, లైట్లు వేసుకొని ఇంట్లో కూసూనే పరిస్థితి ఉన్నదా? మీరు నెల నెలా ఇస్తున్న కరెంటు బిల్లుల మోత చూసి స్విచ్చులు ఆన్‌ చేయాలంటేనే తెలంగాణ ప్రజలు వణుకుతున్నరు. కరెంటు చార్జీలు పెంచింది కేసీఆర్‌ కాదా?

పైగా కరెంట్‌ కొనుగోలు పేరుతో రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల వద్ద 50 వేల కోట్ల అప్పు చేసిన్రు. ఇప్పుడా అప్పు తీర్చకపోతే రాష్ట్రంలోని డిస్కంలన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిరది. విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. డిస్కంలను నమ్ముకుని కరెంట్‌ సరఫరా చేసిన జనరేటర్స్‌ (విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు) బ్యాంకుల నుండి వేల కోట్ల రుణాలు తెచ్చుకున్నయి. ఆ సంస్థలు కూడా చేతులెత్తేశాయి.

దీనికంతటికీ కారణం కేసీఆరే. డిస్కంలకు బాకీలు చెల్లించకపోవడం, సరైన ప్లాన్‌ లేకుండా అడ్డదిడ్డంగా పాలన చేయడం.. కనీసం అధికారులు, నిపుణుల సలహా తీసుకోకుండా ఎప్పుడు ఏది తోస్తే ఆ నిర్ణయం తీసుకోవడంవల్ల ఈ దుస్థితి దాపురించింది. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల కమీషన్లు దొబ్బడం కోసం లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. ఫలితంగా ఇయాళ కరెంట్‌ కొనడానికి కూడా డబ్బుల్లేక రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేయబోతున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఠంచన్‌గా జీతాలొచ్చేవి. కానీ కేసీఆర్‌ పుణ్యమా అని వాళ్లకు ఏ రోజు జీతాలొస్తయో తెల్వని దుస్థితి.

తెలంగాణ ప్రజలకు తన బండారమంతా బయటపడుతుందని కేసీఆర్‌ గ్రహించారు. ఆ తప్పును కేంద్రం మీద నెట్టాలనుకుంటున్నరు. అందుకే కొత్తగా మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నరని కొత్త ప్లాన్‌ తెరమీదకు తెచ్చిన్రు. రైతులను భయపెడుతున్నరు. చివరకు కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఏ స్థాయికి దిగజారారు అంటే టీఆర్‌ఎస్‌ కు ఓటేయకుంటే మీటర్లు పెట్టడం ఖాయమని రైతులను బ్లాక్‌ మెయిల్‌ చేసే స్థాయికి దిగజారిన్రు.

దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదే విధమైన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపైన గ్లోబల్స్‌ ప్రచారం చేసి రైతులను మభ్యపెట్టాలని చూశారు. విజ్ఞులైన రైతులు కేసీఆర్‌ మాయమాటలు నమ్మకుండా టీఆర్‌ఎస్‌కు తగిన రీతిలో బుద్దిచెప్పారు. నిజం చెప్పకూడదనే శాపం కారణంగా తన పంథాలోనే నడుస్తూ నిత్యం అబద్ధాలు వల్లిస్తూ తెలంగాణ ప్రజలను, రైతాంగాన్ని మోసం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు.

దురద్రుష్టమేమిటంటే… ప్రజలను అరిగోస పెడుతూ.. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్‌ పాలనపై పోరాడాల్సిన కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు పూర్తిగా దిగజారిపోయిండ్రు. కమ్యూనిస్టులు ‘‘ఎర్రగులాబీలు’’గా మారి కేసీఆర్‌ చంకన చేరిపోయిండ్రు. బిజెపిని ఓడిస్తేనే తమకు మనుగడ ఉంటుందనే భావనతో కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌ కోవర్టుల్లా మారిపోయిండ్రు. కేంద్రం పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించికుండా ప్రజల నడ్డి విరుస్తున్నది రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు కాదా? రిజిస్ట్రేషన్‌ చార్జీలు, బస్సు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నది ఎవరు? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ పేదవాడు జానెడు జాగ కూడా కొనలేని పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? వీటి గురించి కేసీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదు?

మునుగోడులో లక్షమంది రైతులకు రైతుబంధు ఇచ్చినమంటున్నరు, మరి అదే మునుగోడులో లక్షమంది రైతులకు రుణమాఫీ కాలే, సబ్సిడీ రుణాలు రాలే. ఉచిత ఎరువు అందలే. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమలు కాలే. ఈ ముచ్చటెందుకో చెప్పరూ? చర్లగూడెం, కృష్ణారాయునిపల్లి ప్రాజెక్టులో భూ నిర్వాసితులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ల ఊసే ఎత్తలేదు. మర్రిగూడ, నాంపల్లి మండలాల రైతులు భూములు కోల్పోయి రోడ్డునపడి రోదిస్తుంటే వాళ్ల గురించి ఒక్క మాట కూడా సభలో మాట్లాడలేదు కానీ, రైతులకు తానేదో మేలు చేస్తున్నట్టుగా కేసీఆర్‌ నటించడం సిగ్గు చేటు.

2018 ఎన్నికలప్పుడు కేసీఆర్‌ మునుగోడుకు వచ్చి, ఒకటిన్నర సంవత్సరంలో డిరడి ప్రాజెక్టు పూర్తిచేస్తనని, ఆకుపచ్చ మునుగోడు చేస్తనని చెప్పి పోయిన్రు. నేటికీ మునుగోడు ప్రజల చెవుల్లో ఆ మాయ మాటలు మారుమోగుతున్నయ్‌. ఇప్పుడు ఉపఎన్నిక కోసం మళ్లీ వచ్చి, తన తప్పును బిజెపిపైకి తోస్తున్నరు. కృష్ణ నది బోర్డ్‌ సమావేశానికి పిలిస్తే, రానే రానని బహిష్కరించిన వ్యక్తి, ఈ రోజు కృష్ణా జలాల లెక్కలు తేల్చమని కేంద్రాన్ని అడుగుతున్నరు. లెక్కలు చూసుకుందాం రమ్మంటే పోనోడు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని లెక్కలు అడగటం హాస్యాస్పదం.

కాళేశ్వరమని, లిఫ్టులని, డ్యాములని, మిషన్‌ కాకతీయ అని డబ్బా కొట్టిన్రు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని నీళ్లు పారినయో, ఇయ్యాళ కూడా తెలంగాణలో అన్నే నీళ్లు పారుతున్నయ్‌. ఆంధ్రప్రదేశ్‌-63 శాతం, తెలంగాణ-37 శాతం నీళ్లు తీసుకునేందుకు అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నరు. కానీ, 2016-17 సంవత్సరంలో నీటి కోటాను తగ్గించుకోవాలనే బోర్డు ప్రతిపాదనకు కేసీఆర్‌ ప్రభుత్వం గుడ్డిగా ఒప్పుకున్నది. ఫలితంగా తెలంగాణకు 299 టీఎంసీలే వస్తున్నయ్‌. పోతిరెడ్డిపాడు విస్తరణ పేరుతో ఏపీ ప్రభుత్వం కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుపోతుందని ఎన్నోసార్లు నిరూపించినా పట్టించుకోకుండా కేసీఆర్‌ తన ఫామౌజ్‌ లో కుంభకర్ణుడిలా నిద్రపోయిన్రు. తెలంగాణ వచ్చినంక మొదలుపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిరడి ప్రాజెక్టుల పనులు ఎనిమిదేండ్లయినా పూర్తి కాలే. ఫలితంగా, ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాగునీటి సౌలత్‌లు లేక ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టే బీడిబారినయ్‌. దీనికి కారణం కేసీఆర్‌ అసమర్థ పాలన కాదా?

కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తనని, ఇంటికో ఉద్యోగమిస్తనని, ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తనని చెప్పిన మాయ మాటలకు సమాధానం ఎందుకు చెప్పలేదు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తనని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తనన్న హామీల గురించి ఎందుకో ప్రస్తావించలేదు? యాదవులకు గొర్లిచ్చినం, ముదిరాజులను రాజులను చేసినమని గొప్పలు చెప్పే ముందు వాటి లెక్కలు కూడా చెప్పాలే. చేనేతల త్యాగాలు, గౌడన్నల సాహసాల గురించి మాట్లాడేముందు వారి వృత్తికి మేరు చేసిన మేలేంటో చెప్పాలే.

కేసీఆర్‌ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం …
ప్రతిపక్ష నాయకులకు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వడానికి కూడా ఇష్టపడని కేసీఆర్‌ ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి గొంతు చించుకుంటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. 2014లో అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మింగిన చరిత్ర కేసీఆర్‌ది. 2018లో మూడొంతుల సంఖ్యా బలం ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టు కొన్న ఆయన, ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని కుట్ర చేసిన నియంతను ఓడిరచడానికి ఈ రోజు కాషాయ జెండా తెలంగాణ ప్రజల చేతిలో ఆయుధమయ్యింది. ‘ఒక పార్టీలో గెలిచినోళ్లను రాజీనామా చేయించకుండా మరో పార్టీలో ఎట్లా చేర్చుకుంటరు?’ అనడిగితే వాళ్లంతా అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌ లో చేరారని గులాబీ నాయకులు సిగ్గులేకుండా చెప్పుకోవడం ఏ ప్రజాస్వామ్యం చెప్పిన నిర్వచనం? ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాలను పట్టించుకోవద్దని కల్వకుంట్ల రాజ్యాంగం చెప్పిన నీతా? ప్రశ్నించే గొంతులను నొక్కుతూ నియంతలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్‌ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే గురివిందగింజ సామెత గుర్తుకొస్తున్నది.

ఎర్రగులాబీలు …
గుండు సూదీ పార్టీ, సూదీ పార్టీ, దబ్బనం పార్టీ, తోక పార్టీ అని కమ్యూనిస్టులను తిట్టినపోసిన కేసీఆర్‌ ఈ రోజు తేనే పూసిన కత్తిలా మారిన్రు. వారిని ప్రగతిశీల పార్టీలని పొగుడుతూ పొత్తుపెట్టుకుంటున్నరు. వాళ్లేమో మునుగోడులో టీఆర్‌ఎస్‌కి మద్దతిస్తరంట, తర్వాత డబుల్‌ బెడ్రూం ఇండ్ల మీద, రైతు రుణమాఫీ మీద కొట్లాడతరంట… ఇదీ వామపక్షాల రెండు తలకాయల ధోరణి. ఇదీ బిజెపిని బూచీగా చూపి
‘‘ఎర్ర గులాబీలు’’ గా మారిపోయిన వారి వైఖరి. కేసీఆర్‌ ని నిజాం అని అభివర్ణించిన కమ్యూనిస్టులే, ఈ రోజు ఆయనకు మద్దతిస్తూ వారి కార్యకర్తల నమ్మకాన్ని టీఆర్‌ఎస్‌ కి తాకట్టు పెట్టిన్రు. మరి వామపక్షాలకు తెలంగాణ శాసనసభలో ప్రాతినిథ్యమే లేదు కదా? వాళ్లకే టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చి తమ ప్రగతిశీలతను చాటుకోవచ్చు కదా? ప్రజల్లో ఉన్న వ్యతిరేతను చల్లార్చుకోవడానికే కేసీఆర్‌ వామపక్షాలను వాడుకోబోతున్నరు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని వారికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్‌.

2018 ఎన్నికల్లో సీపీఐ గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే (దేవరకొండ – రవీంద్రనాయక్‌) ఒక్కరే. గెలిచినంక ఆయన కూడా టీఆర్‌ఎస్‌ కు అమ్ముడుపోయిండు. అయినా సీపీఐ పార్టీకి కనువిప్పు కలగడం లేదు. సిపిఐ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేను ఎట్లా చేర్చుకుంటవని నిలదీసే సోయి లేకుండా చిల్లర పెంకుల కోసం కేసీఆర్‌ పంచన ఉభయకమ్యూనిస్టు పార్టీలు చేరుతున్నయి. నిజం చెప్పాలంటే కమ్యూనిస్టు కార్యకర్తలు కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్లు. కానీ ఆ పార్టీ లీడర్లంతా అమ్ముడుపోయే రకం. అందుకే ఇయాళ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలంతా ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీకి మద్దతిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక గోల్‌మాల్‌ ఎన్నికా?
‘‘ఈ గోల్‌ మాల్‌ ఉపఎన్నిక ఏం అక్కెరుండి వచ్చింది? ఇంకో ఏడాదైతే ఎలక్షన్‌ ఉండే. నడుమలో ఎవరిని ఉద్దరియ్యడానికి ఎన్నిక తీసుకొచ్చిన్రు?’’ అని కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అవాకులు చవాకులు పేల్తున్నరు. మునుగోడు అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ప్రజాసామ్య విలువలు కాపాడటం కోసం, నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీత పాడటానికి ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చింది. 2018లో ఇంకో 6 నెలల్లో ఎన్నికలు ఉన్నయనంగా కేసీఆర్‌ ఎందుకు ముందస్తు ఎన్నికలు తీసుకొచిన్రు? కేసీఆర్‌ది కేవలం అవకాశవాదం. బిజెపిది ఆశయం. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసిండు కాబట్టే, ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌ నుంచి మునుగోడుకు వచ్చిండు. ఉపఎన్నిక వచ్చింది కాబట్టే, మునుగోడుకు నిధులు వస్తున్నయ్‌.

నీళ్లు నిధులు నియామకాలు అనే తెలంగాణ సిద్ధాంతాన్ని టీఆర్‌ఎస్‌ తుంగులోకి తొక్కింది. అమరవీరుల త్యాగాన్ని బూడిదలో పోసింది. ఉద్యమద్రోహుల్ని భుజాన మోస్తున్నది. హామీలు, మోసాలతో తెలంగాణ ప్రజలను బలహీన పరిచింది. కాబట్టే, ఇయ్యాళ టీఆర్‌ఎస ని బలహీన పర్చడానికి ప్రజానీకం సిద్ధమైయింది. బిజెపికి మూడే తోకలున్నయని వెక్కిరిస్తూ, మతతత్వ ఎంఐఎంతో కలిపి 110 తోకలున్నయని విర్రవీగుతున్న కేసీఆర్‌… గులాబీ తోకలు కత్తిరించే రోజులు దగ్గరపడ్డయ్‌. మూడు తోకలే మూడు చెరువుల నీళ్లు తాగిస్తయ్‌, నాలుగు దిక్కుల నుంచి కేసీఆర్‌ గడీలను చుట్టుముడతయ్‌. ఇగ తర్వాత రాబోయేది ఉద్యమ ఆకాంక్షల ప్రజా తెలంగాణ. అది బిజెపితోటే సాధ్యం.

మునుగోడు ఎన్నిక కేవలం ఆ నియోజకవర్గానికే పరిమితమయ్యింది కాదు. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ ను నిర్ణయించేది, తెలంగాణ గతిని మార్చే ఎన్నిక కాబోతోంది. మునుగోడు తీర్పు… కేసీఆర్‌ పాలనకు ముగింపు కాబోతోంది. పేదల ఆధ్వర్యంలో ప్రజా స్వామిక తెలంగాణ నిర్మాణానికి పునాది కాబోతోంది.

LEAVE A RESPONSE