Suryaa.co.in

Political News

టీడీపీ-వైసీపీని మింగేయటమే బీజేపీ అసలు లక్ష్యం

– జగనంటే ప్రేమ లేదు
– బాబంటే కక్ష లేదు
– ముందు టీడీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యం
– ఆ తర్వాత క్రైస్తవకార్డు చూపి వైసీపీని భూస్థాపితం చేయడమే వ్యూహం
– ఇప్పుడు జగన్‌ను వ్యతిరేకిస్తే మైనారిటీలు కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రమాదం
– అందుకే జగన్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు
– జగన్‌పై తమలపాకు యుద్ధంతోనే సరి
– బీజేపీది దేశమంతా ఇదే రాజకీయ వ్యూహం
– ఇప్పుడు ఏపీ ప్రజలది అస్థిత్వ పోరాటం
(రఘువీర్ పి.కల్లూరి)

బిజెపికి జగనంటే ప్రేమా లేదు, బాబుగారంటే కక్షా లేదు. ఉన్నదల్లా ఆంధ్రప్రదేశ్‌లో గద్దెనెక్కాలనే పన్నాగమే. వైసిపి పార్టీ పునాది కాంగ్రెస్ పార్టీలో ఉంది, క్రైస్తవ మతంలో ఉంది. తెదేపా పునాదిలో కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది. ఆ తేడా వల్లనే బిజెపి ముందు టిడిపిని ఆక్రమించి, ఆ తర్వాత క్రైస్తవ వైసిపిని బూచిగా చూపించి ఏపీలో అధికారంలోకి రావాలనే దీర్ఘకాలపు వ్యూహాన్ని అమలు చేస్తున్నది. 1982 లో తెలుగుదేశం సెంట్రిస్ట్ పార్టీగా పుట్టినప్పటికీ దాని సైద్ధాంతిక పునాదుల్లో వామపక్ష భావజాలముంది.

పేదలకు సంక్షేమ పథకాలు, అణగారినవర్గాలకు రాజ్యాధికారం, పటేల్-పట్వారీ వ్యవస్థల రద్దు వంటి పాలనావిధానాలతో, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సాంప్రదాయికంగా కాంగ్రెస్ ఓటర్లైన క్రైస్తవులు, ముస్లిముల్లో చాలామంది టిడిపి పక్షమయ్యారు. ఇంకోపక్క మండల వ్యవస్థ ఏర్పాటు వంటి అధికార వికేంద్రీకరణ చర్యలు, రూల్ ఆఫ్ లా అమలు చేయడం, రాష్ట్రంలో మతకలహాల్ని అణచివేయడం, హైదరాబాదుని తెలుగు రాజధానిగా అభివృద్ధి చేయడం, తిరుమల-తిరుపతిని ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలతో మూడు మతాల్లో ఉన్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, అర్బన్ ఓటర్లు, విద్యావంతులతోబాటు, సామాన్య హిందూ ఓటర్లలో టిడిపి బలం పెరిగింది. ఆనాటికి బిజెపి కూడా చాలా చిన్నపార్టీ. ఆ తర్వాత ఎనిమిదేళ్ళకి 1990 లో అద్వానీ రథయాత్రతో బిజెపి పూర్తిస్థాయి హిందుత్వ పార్టీగా ఎదిగింది.

1995 లో చంద్రబాబుగారు టిడిపి పగ్గాలు చేపట్టిన తరువాత, గ్లోబలైజేషన్, పీవీ ప్రభుత్వం చేపట్టిన ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో, ఉమ్మడిరాష్ట్రపు ముఖ్యమంత్రిగా తన దృష్టిని అభివృద్ధి, సంపద సృష్టి, టెక్నాలజీ, రోడ్లు, రవాణా సదుపాయాలు, ఎయిర్‌పోర్టుల వంటి మౌలిక సదుపాయాల కల్పన, మావోయిస్టు తీవ్రవాదుల అణచివేత వంటి అంశాలపై కేంద్రీకరించారు. ఈ పరిణామాలతో వామపక్షవాదులు టిడిపికి దూరమై, రైటిస్టులు దగ్గరయ్యారు. అలా గత పాతికేళ్ళలో టిడిపి లెఫ్ట్-లీనింగ్-సెంట్రిస్ట్ పార్టీనుండీ రైట్-లీనింగ్-సెంట్రిస్ట్ పార్టీగా పరిణామం చెందింది. సాంప్రదాయిక కాంగ్రెస్ ఓట్‌బ్యాంకుతో నిర్మితమైన వైసిపిని దెబ్బతీసి, పరోక్షంగా టిడిపిని బలోపేతం చేయడం కంటే, ఇప్పుడున్న టిడిపిని బలహీనపరచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక మీదనుండి కనుమరుగు చేయగలగితేనే దీర్ఘకాలంలో బిజెపికి లాభం.

అర్జెంటుగా జగన్‌రెడ్డిని జైల్లో పెట్టి మూయించేస్తే, జగన్‌రెడ్డి సాలిడ్ ఓట్‌బ్యాంక్ అయిన దళితులు, దళితక్రైస్తవులు, ముస్లిములు కాంగ్రెస్ గూటిలోకి చేరతారు తప్ప బిజెపివైపు రారు. జగన్‌రెడ్డిని, వైసిపిని తొలగించడంవలన వచ్చే పొలిటికల్ వ్యాక్యూంలోకి బిజెపి చొరబడి టిడిపికి పోటీనిచ్చే ప్రతిపక్షంగా ఎదగలేదు. పైగా ఆంధ్రప్రదేశ్‌లో కనుమరుగైన కాంగ్రెస్ మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. ఆ విషయం బిజెపికి స్పష్టంగా తెలుసు. జగన్‌రెడ్డికి కేంద్రనిధులతో సాయపడటమో, అతని అరాచకాల్ని చూసీచూడనట్లు పోవడమో, టిడిపి శ్రేణులపైన, నాయకులపైన అక్రమకేసులకు, దౌర్జన్యాలకు తెరచాటు మద్దతు ఇచ్చి పురిగొల్పడమో చేసి, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి మనలేని రాజకీయ శూన్యతని సృష్టించగలిగితే, టిడిపి మద్దతుదార్లు, కార్యకర్తల శ్రేణుల్లో అధిక సంఖ్యలో ఉన్న హిందూ బీసీలు, బీసీయేతర వర్గాలన్నీ బిజెపిలో చేరిపోతాయనేది బిజెపి అంచనా.

చీమలు పెట్టిన పుట్టని ఆక్రమించుకోవాలనే పెద్దపాము పన్నాగం ఇది. కేవలం ఈ కారణంతోనే, జగన్‌రెడ్డి ప్రభుత్వంలో పెరిగిన క్రైస్తవ మతమార్పిడులు, పాస్టర్లకు, ముల్లాలకు ప్రభుత్వనిధులతో జీతాలివ్వడం, టీటీడీ బోర్డులో క్రైస్తవుల్ని, నాస్తికుల్ని, వివాదాస్పద వ్యక్తుల్ని నియమించడం వంటి సంఘటనలు ఎన్ని జరిగినా బిజెపి చూస్తూ ఉంటుందే తప్ప విమర్శించదు. నిజానికి బిజెపి మనుగడకి, దేశవ్యాప్తంగా ఎదుగుదలకీ గతంలోనూ, ఇప్పటికీ ఇలాంటివే ఆయుధాలు. కానీ విచిత్రంగా ఆంధ్రాలో మాత్రం బిజెపి ఇవే అంశాలపైన మొక్కుబడిగా స్పందిస్తుంది. తమలపాకుతో కొట్టినట్లు జగన్‌రెడ్డి పాలనని విమర్శిస్తుంది.

ఒక్కసారి టిడిపిని బలహీనపరచి, ఆ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగానే బిజెపి ఇవే అంశాలపైన జగన్‌రెడ్డి మీద దాడి చేస్తుంది. అప్పుడు జగన్‌రెడ్డిని హిందూ వ్యతిరేకిగా విమర్శించి, తాను హిందుత్వ పరిరక్షణ కోసం పాటుబడే పార్టీగా వైసిపికి వ్యతిరేకంగా హిందువుల్ని పోలరైజ్ చేస్తుంది. అప్పటిదాకా ఈ ఆయుధాల్ని జమ్మిచెట్టు మీద దాచిపెట్టినట్లే. కాబట్టి బిజెపి కేంద్రప్రభుత్వం ఇవాళ జగన్‌రెడ్డి రాజ్యాంగవిరుద్ధ పాలనకి అడ్డుకట్ట వేస్తుందని అనుకోవడం భ్రమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలది, టిడిపిది ఇద్దరిదీ అస్థిత్వ పోరాటమే. టిడిపి దెబ్బతింటే ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా దెబ్బతిన్నట్లే. ఇన్నేళ్ళ ఆత్మగౌరవం, స్వయంసమృద్ధి, ప్రజాస్వామిక హక్కులు, రూల్ ఆఫ్ లా పోయి, ఎనభయిల్లో మనం పత్రికల్లో చదివిన బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లాగా మధ్యయుగాలకు మరలిపోతాం.

LEAVE A RESPONSE