అప్పటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ది జాతీయ సమైక్యతా వాదం

-ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా ది విచ్ఛిన్నకర నాదం
-మత విద్వేష బీజాలను నాటడం బీజేపీ నాయకులు మానుకోవాలి
-బీజేపీ నాయకుల తీరు దేశ సమగ్రతకు చేటు
-ప్రతి ఒక్కరికీ విశాల దృక్పథం అవసరం
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో అప్పటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యతా వాదంతో ముందుకు సాగారని… కానీ ప్రస్తుత హోం శాఖ మంత్రి అమిత్ షా మాత్రం దేశ విచ్ఛిన్నకర నాదంతో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.మత విద్వేష బీజాలు నాటడం వంటి చర్యలను బీజేపీ నాయకులు మానుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. బీజేపీ నాయకుల వైఖరి వల్ల దేశ సమగ్రతకు చేటు వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలోని ప్రతి ఒక్కరికీ విశాల దృక్పథం ఉండాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

సంకుచిత భావంతో ఏమీ సాధించలేరు అని, ఈ వాస్తవాన్ని గ్రహించి మెలగాలని వినోద్ కుమార్ అన్నారు.అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని దాదాపు 540 సంస్థానాలను భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి విలీనం చేశారని.. అందులో భాగంగానే హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారత దేశంలో అంతర్భాగం చేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను గవర్నర్ ( రాజ్ ప్రముఖ్ ) గా వల్లభాయ్ పటేల్ నియమించారని వినోద్ కుమార్ తెలిపారు.వల్లభాయ్ పటేల్ విశాల దృక్పథం కలిగిన వ్యక్తి అని, బీజేపీ నాయకుల వలె సంకుచిత భావం ప్రదర్శించలేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.భారత రాజ్యాంగం మేరకు మత విశ్వాసం కలిగి ఉండటం ప్రజల ప్రాథమిక హక్కు అని.. అయితే మత ఛాందస వాదం మాత్రం దేశానికి పెను ప్రమాదం అని వినోద్ కుమార్ అన్నారు.భారత భూభాగం వివిధ మతాలు, వివిధ సంస్కృతుల, నానా జాతుల సమ్మేళనం అని, సర్వ మతాలకు భారత దేశం ఇలవేల్పు అని వినోద్ కుమార్ వివరించారు.

పశ్చిమ ఆసియాలోని కొన్ని దేశాలు మత ఛాందస వాదుల చేతిలోకి వెళ్లడంతో విధ్వంసకరమైన వాతావరణం నెలకొందని వినోద్ కుమార్ తెలిపారు.ఏ మతం అయినా ఛాందస వాదుల చేతిలోకి వెళితే మానవాళికి మంచిది కాదని వినోద్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశం, రాష్ట్రంలోని ప్రజలు కులాలు, మతాలు, రాజకీయ విద్వేషాలకు అతీతంగా జాతీయ సమైక్యతా భావంతో కలిసి ప్రగతి పథంలో పయనించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

Leave a Reply