సాంకేతిక పరిజ్ఞానంలో, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన ప్రతి కుటుంబంలోనూ, సంస్థలోనూ విద్యుత్ వినియోగం రోజురోజుకీ అధికమవుతున్నది. గతంలో ప్రభుత్వ రంగానికే పరిమితమైన విద్యుత్ క్రమంగా ఉత్పత్తి మొదలుకొని పంపిణీ వరకు బడా కంపెనీల పరమవుతున్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణలు, సంస్కరణల ముసుగులో అడ్డగోలు దోపిడీకి అవకాశం కల్పిస్తున్నది. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని, ఇక బాదుడు ఉండదని, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందరికి అందిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎ) తిరగ రాస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ అది జరగలేదు.
దొడ్డి దారిన జగన్ మార్కు బాదుడు
ఈ 44 నెల కాలంలో దొడ్డిదారిన విద్యుత్ భారాలు ప్రజలపై మోపారు. గత సంవత్సరం స్లాబులు మార్చి, రేట్లు పెంచి ప్రత్యక్షంగా 1400 కోట్ల రూపాయల భారం వేశారు. 2014 నుండి 19 వరకు వినియోగించుకున్న కరెంటుకు బిల్లులు కట్టినా, సరిపోలేదని చెప్పి ట్రూ అప్ చార్జీల పేరుతో అదనంగా 2820 కోట్ల రూపాయలు వడ్డించారు. ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఈ వసూళ్లు మరో 30 నెలలు కొనసాగుతాయి. మరో రూ. 896 కోట్ల ట్రూఅప్ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. అదనపు డిపాజిట్లు, పెనాల్టీలు, విద్యుత్ సుంకం, స్థిరచార్జీల పేరుతో కనపడకుండా పీక్కు తింటున్నారు. చిన్న, మధ్యతరగతి వ్యాపార సంస్థలు, చిన్న పరిశ్రమలు, స్థానిక సంస్థలను వదిలిపెట్టకుండా చార్జీలు పెంచేశారు. ఈ భారం పరోక్షంగా సాధారణ ప్రజలపైనే పడుతుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఇతరులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించే విద్యుత్తుకు తూట్లు పొడుస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వార్షిక ఆదాయ నివేదికలను విద్యుత్ నియంత్రణ మండలి (ఇఆర్‌సి) ముందు ఉంచారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో మండలి దీనిపై ఆన్‌లైన్‌లో బహిరంగ విచారణ జరుపనున్నది. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పుల వలన విద్యుత్ చౌకగా ఉత్పత్తి చేయవచ్చు. కరెంటు చార్జీలు తగ్గించవచ్చు. భారాలు వేయవలసిన అవసరమే లేదు. కానీ పాలకులు చార్జీలు పెంచుతూనే వున్నారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ భారాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎవరు కారణం? పరిశీలిద్దాం.
కార్పొరేట్లకు మేలు, ప్రజలకు కీడు
సాధారణ ప్రజలకు అర్థం కాని రీతిలో విద్యుత్ ఉత్పత్తికి అయిన ఖర్చును పూర్తిగా ప్రజల నుండే రాబట్టే పద్ధతిలో విద్యుత్ రేట్లు ప్రతిపాదించారు. భారీ పరిశ్రమలపై 697 కోట్ల రూపాయల ఛార్జీల పెంపు ప్రతిపాదించారు. ఆదాయం కంటే ఖర్చు 12,792 కోట్ల రూపాయలు అదనంగా ఉంటుందని లోటు తేల్చారు. ఈ లోటును ఎలా భర్తీ చేస్తారో చెప్పలేదు. ప్రభుత్వం ఈ లోటు భరించకపోతే, దొడ్డి దారిన ప్రజలపై ఏదో ఒక రూపంలో భారం వేసే ప్రమాదం ఉంది. ఇదే కాకుండా 2020 నుంచి 2023 వరకు ప్రతి మూడు నెలలకు అదనపు ఖర్చులు లెక్కించి మళ్లీ ట్రూ అప్ చార్జీలు జనం నెత్తిన వేస్తారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రమాదకర విద్యుత్ సంస్కరణలను ముందుకు తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాటికి దాసోహం అంటున్నది. రాష్ట్రంలోని కోటి 89 లక్షల విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి రంగం సిద్ధమైంది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల ప్రక్రియ ప్రారంభమైంది. వ్యవసాయంలో ఉచిత విద్యుత్‌కు క్రమంగా ఎసరుపెడతారు. సెల్‌ఫోన్ మాదిరిగానే ముందు డబ్బు చెల్లించి కరెంట్ బ్యాలెన్స్ వేయించుకుని విద్యుత్ వినియోగించుకునే విధానం రానున్నది. వ్యవసాయ విద్యుత్ పేరుతో అదానీ కంపెనీతో 30 సంవత్సరాలు పాటు 7 వేల మెగా వాట్ల విద్యుత్ ఒప్పందాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేసుకున్నారు.
రాష్ట్రంలో బడా కంపెనీలు 29 పంప్డు హైడ్రో స్టోరేజ్ ప్లాంట్లను పెట్టనున్నాయి. ఈ సంస్థలు 33,240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కృష్ణపట్నంలోని అధునాతన ప్రభుత్వ థర్మల్‌ప్లాంటును అదానీ వంటి బడా కంపెనీలకు కట్టబెట్టటానికి రంగం సిద్ధమయ్యింది. ఇప్పటికే విద్యుత్ మిగులు ఉందని పంపిణీ సంస్థలు ప్రకటించాయి. భవిష్యత్తులో ఈ బడా కంపెనీలు అందించే విద్యుత్ కూడా వస్తే దీన్నంతా ఎవరు వినియోగించాలి? ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లను పూర్తిగా మూత వేసి, బడా కంపెనీలకు దోచుకునే అవకాశం కల్పించే కుట్ర ఇది. అవి ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయిస్తే ఆ భారం మళ్లీ వినియోగదారులపైనే పడుతుంది.
తెర వెనుక మోడీ సర్కార్ పాపం
విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వినియోగించే బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం క్రమంగా అదానీ తదితర కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. విదేశాల్లో సైతం ఈ కంపెనీలు గనులు కొనేశాయి. బొగ్గు సరఫరా చేసే పోర్టులు వీరి చేతుల్లోకి వచ్చేసాయి. బొగ్గు కృత్రిమ కొరత సృష్టించారు. రేట్లు పెంచేశారు. దేశంలో బొగ్గు నిల్వలు ఉన్నా ఆరు శాతం బొగ్గును విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఆ భారం వేసేది ప్రజల పైనే. సహజ వాయువుతో విద్యుత్ తయారుచేస్తారు. ఆ గ్యాస్‌ను మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలకు కేంద్రం కేటాయించక పోవడంతో ఆ కంపెనీలు మూతపడ్డాయి. విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా, నిర్ణయించిన ఫిక్స్డ్ చార్జీలు డబ్బు చెల్లించాల్సిందే. ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు విద్యుత్ ఉత్పత్తికి అవకాశం వున్నా దాన్ని నిలిపివేసి, దీర్ఘకాలిక ఒప్పందాల పేరుతో ప్రైవేట్ సంస్థల నుండి అధిక రేట్లు పెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. 2022-23 తొలి 6 నెలల్లోనే 24 గంటల సరఫరా సాకుతో ప్రైవేట్ విద్యుత్ కంపెనీల నుంచి 3590 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అదనంగా రూ.1600 కోట్లు చెల్లించి కొనుగోలు చేశారు. విద్యుత్ నియంత్రణ మండలి రూ.4.31 రేటు నిర్ణయించినా, అధికంగా సగటున యూనిట్‌కు రూ.8.77 పైసలు చెల్లించారు. ఇందులో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నది.
పర్యావరణ పరిరక్షణ పేరుతో సంప్రదాయేతర విద్యుత్ సోలార్, పవన విద్యుత్ (విండ్ పవర్) తదితర విద్యుత్తును ఖచ్చితంగా కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశిస్తున్నది. దీని కోసం ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రస్తుతం రెండు రూపాయలకు దొరుకుతున్న సోలార్ విద్యుత్తును, పాత ఒప్పందాల పేరుతో యూనిట్‌కు రూ.4 నుండి రూ.18 వరకు చెల్లిస్తున్నారు. పవన విద్యుత్‌కు ఐదు రూపాయల వరకు చెల్లిస్తున్నారు. సంప్రదాయేతర విద్యుత్ వల్ల సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు నష్టపోతున్నామని ప్రభుత్వ పంపిణీ సంస్థలే ప్రకటించాయి. అంతేకాకుండా సంప్రదాయేతర విద్యుత్ వినియోగం కోసం ప్రభుత్వ ధర్మల్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నా, ఆ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి వాటికి ఫిక్స్‌డ్ చార్జీలు చెల్లిస్తున్నారు. ఈరకంగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా రాబోయే సంవత్సరంలో 1553 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించవలసి వస్తుందని పంపిణీ సంస్థలే ప్రతిపాదించాయి. ఈ భారంపడేది జనం పైనే. హిందుజా కంపెనీకి నియంత్రణ మండలి యూనిట్‌కు రూ.3.82 చెల్లించాలని నిర్ణయించింది. ఆ రేట్లు చాలవని, అదనంగా రూ.1200 కోట్లు చెల్లించాలని కంపెనీ పైరవీలు ప్రారంభించింది. ప్రభుత్వం దొడ్డి దారిన పంపిణీ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నది. భవిష్యత్తులో ఇది చెల్లిస్తే ఈ భారం ఏదో రూపంలో ప్రజలపైనే పడుతుంది.
విద్యుత్‌ను వదలని అవినీతి
దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, బడా కాంట్రాక్టర్లు కుమ్మక్కయి దోచుకుంటున్నారు. రూ.13,252 కోట్ల ఖర్చు చేసే స్మార్ట్ మీటర్లు కొనుగోలులో వేల కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుంటున్నదని పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. మెటీరియల్ మొదలు ట్రాన్స్‌ఫార్మర్ల వరకు అధిక రేట్లు పెట్టి అవసరానికి మించి ముందుగానే కొనుగోలు చేసి ప్రజల సొమ్ము మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారు, వారి జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్తు, ఇతర తరగతులకు అందించే రాయితీలకు, లోటును భర్తీ చేయటానికి సబ్సిడీ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇవ్వాలి. కానీ సబ్సిడీ సక్రమంగా, సకాలంలో చెల్లించటం లేదు. వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. పంపిణీ సంస్థలు అప్పులు తెచ్చి, వడ్డీ భారాన్ని కూడా వినియోగదారుల పైనే వేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలు, బడా కంపెనీల దోపిడి, ప్రభుత్వాల అవినీతి, అపసవ్య విధానాలు ఈ భారాలకు కారణం.
ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఇక పూర్తిగా ఉత్పత్తి, పంపిణీ మొత్తం బడా కంపెనీల చేతిలోకి వెళ్తే దొంగల దోపిడీనే. ప్రస్తుతం ప్రభుత్వ చేతుల్లో ఉంటే అడిగే అవకాశం అయినా ఉంది. కార్పొరేట్ కంపెనీల చేతిలోకి వెళితే ప్రశ్నించే అవకాశం తగ్గిపోతుంది. అందుకే ఈ విధానాల్ని ప్రశ్నించాలి. ప్రమాదకర సంస్కరణలను అడ్డుకోవాలి. 2023-24వ సంవత్సరం రూ.13 వేల కోట్ల లోటు ప్రభుత్వమే భరించాలి, తక్షణమే అటువంటి ప్రకటన చేయాలి. వ్యవసాయ మీటర్లు, ఇళ్లకు స్మార్ట్‌మీటర్లు ఆపాలి. ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి. నెలవారీగా విద్యుత్ రేట్లు పెంచే ప్రతిపాదన ఉపసంహరించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పూర్తిగా కొనసాగించాలి. ప్రభుత్వం పంపిణీ సంస్థలకు సబ్సిడీ బకాయిలు వెంటనే ఇవ్వాలి. నియంత్రణ మండలి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అందుకు ప్రజాఉద్యమం సాగించాలి.