– దళిత ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన పెయిడ్ మీడియా పై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య మండిపాటు
ఏడు ఎమ్మెల్సీ సీట్ల కోసం జరిగిన ఎమ్మెల్యేల పోలింగ్ ప్రక్రియలో ప్రతి పక్ష పార్టీకి చెందిన ఏడవ అభ్యర్థి గెలుపు కొరకు ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ప్రభుత్వ పెయిడ్ మీడియా కట్టప్పలని, ద్రోహులని ప్రచారం చేయటంపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఆత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్యేలకు ఓటేసే హక్కు ఉందని, ఆ మేరకు వైకాపా నుండి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటేయటంలో తప్పేముందన్నారు. విపక్ష పార్టీ నుంచి కొనుగోలు చేసిన నలుగురు ఎమ్మెల్యేల గూర్చి ప్రశించరా? అని నిలదీశారు.
ప్రభుత్వ అరాచక పులకేసి పాలనకు, ముఖ్యమంత్రి పని తీరుకు ఆ నలుగురి ఓట్లు చెంపపెట్టు అని అభివర్ణించారు. ఒక దళిత ఎమ్మెల్యే ఓటు వేసి ఉంటుందని, వైకాపా అధికార మీడియా పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టిందని, వ్యక్తిత్వ హననం చేస్తుందని, రహస్య బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్ అంశాలను బయటపెట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయాలతో ఎమ్మెల్యేలు అందరూ పాదాల దగ్గర ఉండాలనే రాచరిక వ్యవస్థ చచ్చిపోయి దశాబ్దాలు గడిచాయి అని చెప్పారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరగబడటం ప్రజాస్వామిక లక్షణం అని స్పష్టం చేశారు. కేవలం 17 ఓట్లు ఉన్న వైకాపా ఏడవ అభ్యర్థిని ఏ నైతికతతో నిలబెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెడితే, బిసిలు వెన్నెముక అంటూ ఉపన్యాసాలు చెప్పిన ఏ ఒక్క బిసీ ఎమ్మెల్యే, బిసి మంత్రి ఓటేయ లేదని, వారు భళాల దేవుడి దగ్గర మోకరిల్లారని వ్యాఖ్యానించారు. దళిత ఎమ్మెల్యే మోకరిల్ల లేదని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు దీనిని స్వాగతించాలని కోరారు. దళితుల్లోనే ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుందని, బానిసలుగా బతికేందుకు అంబేద్కర్ వారసులులైన దళితులు ఇష్టపడరని, ఎమ్మెల్సీ ఓటింగులోనూ అదే తేలిందని తెలిపారు. నిజానికి ఈ విజయాన్ని ప్రతి పక్ష పార్టీ విజయం అనటం కంటే, ఆ ఇద్దరి ధీరుల విజయంగా పేర్కొనటం సహేతుకం అని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.