Suryaa.co.in

Editorial

బొత్స, పెద్దిరెడ్డి కూడా అవుట్

– జగన్ క్యాబినెట్ పూర్తి ప్రక్షాళన
– మంత్రి బాలినేని వ్యాఖ్యలతో పూర్తి స్పష్టత
( మార్తి సుబ్రహ్మణ్యం)
క్యాబినెట్ విస్తరణపై ఏపీ సీఎం జగన్ మనోగతం ఏమిటన్నదానిపై స్పష్టత వచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత తాను మంత్రివర్గ విస్తరణ చేపడతానని, ప్రమాణస్వీకారోత్సవ సభలో జగన్ ముందస్తుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాని ప్రకారం.. కేవలం పనిచేయని వారిని మాత్రమే తొలగిస్తారని, పనిచేసే వారిని మాత్రం కొనసాగిస్తారన్న అంచనా మొన్నటివరకూ ఉండేది. ఆ ప్రకారంగా 60 శాతం మందిని తొలగిస్తారని కొందరు, 90 శాతం మందిని తొలగిస్తారని మరికొన్ని వర్గాలు వాదించాయి. తాజాగా మొత్తం క్యాబినెట్ ప్రక్షాళన చేస్తారని, తాను కూడా అందుకు సిద్ధంగానే ఉన్నానని సీఎంకు చెప్పానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో, తొలగింపు శాతంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. ఆ ప్రకారంగా.. మంత్రివర్గంలో సీనియర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణకు సైతం నిష్క్రమణ తప్పదని స్పష్టమయింది. ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
త్వరలో పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ టీం రంగంలోకి దిగబోతోందని ప్రకటించిన సీఎం జగన్, తొలగించిన మంత్రులను పార్టీ సేవలకు వినియోగించుకుంటామన్న సంకేతాలివ్వడం ద్వారా, క్యాబినెట్ విస్తరణ ఖాయమన్న సంకేతాలిచ్చారు. అయితే ఎంతమందిని తొలగిస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో, అటు మంత్రుల్లోనూ టెన్షన్ కొనసాగుతుంది. ఇప్పుడు ఉన్న మంత్రులందరినీ తొలగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించడం ద్వారా, క్యాబినెట్ కూర్పుపై స్పష్టత ఇచ్చినట్టయింది. జగన్ సమీప బంధువయిన బాలినేని స్వయంగా ముఖ్యమంత్రి మనోగతాన్ని ఆవిష్కరించడం చ ర్చనీయాంశమయింది. సీఎం జగన్‌తో ఇప్పటివరకూ తరచుగా మాట్లాడే ‘అతి కొద్దిమంది మంత్రుల్లో’ బాలినేని ఒకరు. ఆయన ఇటీవల జగన్‌తో భేటీ అయిన సందర్భంలోనే, క్యాబినెట్ పూర్తి స్థాయి ప్రక్షాళన ఉంటుందని చెప్పినట్లు సమాచారం.
బాలినేని వ్యాఖ్యల ప్రకారం.. క్యాబినెట్‌లో ఆయనతోపాటు సీనియర్లయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా నిష్క్రమించక తప్పదని స్పష్టమయింది. బొత్స వైసీపీలో ఆలస్యంగా చేరినప్పటికీ, ఆయన వైఎస్ హయాంలో మంత్రి-పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. వైఎస్ మృతి తర్వాత ముఖ్యమంత్రికి పదవికి పోటీ పడిన వారిలో ఆయనొకరన్నది తెలిసిందే. ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్న బాలినేని, పెద్దిరెడ్డి, బొత్స, పినిపె విశ్వరూప్ నలుగురూ.. దివంగత వైఎస్ హయాంలోనూ మంత్రులుగా పనిచేసిన వారే. వైఎస్ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకూ ఉత్తరాంధ్రలో బొత్స హవా విపరీతంగా ఉన్నప్పటికీ.. జగన్ జమానాలో ఆ హవా దారుణంగా పడిపోయింది. అనేక సందర్భాల్లో ఆయనపై ఆంక్షలు విధించి అవమానించారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో బహిరంగంగానే వినిపించాయి. దానితో చివరకు ఆయన తన విజయనగరం జిల్లాకే పరిమితం కావలసి వచ్చింది. త్వరలో జరగనున్న విస్తరణలో ఆయనను కూడా తొలగించడం ఖాయమయింది.
ఇక అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే కూడా అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం తొలగిస్తారన్న భావనే పార్టీలో చర్చనీయాంశమయింది. ఒకవేళ జగన్‌కు సీబీఐ కేసులో అర్టెస్టయి జైలుకు వెళితే, పెద్దిరెడ్డి సీఎం అవుతారన్న ఊహాగానాలు కూడా బహిరంగంగానే వినిపించిన విషయం తెలిసిందే. వైకాపా విపక్షంలో ఉన్న సమయంలో.. అసెంబ్లీ ఎన్నికల వరకూ పార్టీ కోసం, ఆయన దాదాపు వె య్యి కోట్లు ఖర్చు చేశారన్న ప్రచారం, పార్టీ వర్గాల్లో బహిరంగంగానే వినిపించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆంధ్రాలో అమ్ముతున్న మద్యం బ్రాండ్లన్నీ ఆయన కుటుంబానికి అప్పగించడం ద్వారా, ఎన్నికల ముందు చేసిన పెద్దిరెడ్డి త్యాగానికి, జగన్ ప్రత్యుపకారం చేస్తున్నారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో లేకపోలేదు. చిత్తూరు జిల్లాలో వైసీపీని కంటిచూపుతో శాసిస్తు, క్యాబినెట్‌లో నెంబర్‌టూగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి కూడా, జగన్ తొలగించబోయే జాబితాలో ఉన్నారని తెలియడమే వైసీపీ వర్గాలను విస్మయపరుస్తోంది.
ఇక పినిపె విశ్వరూప్ మంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచీ, ఉండీలేనట్లుగానే కొనసాగుతున్నారు కాబట్టి, ఆయన తొలగింపుపై ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కనిపించటం లేదు. బాలినేని సొంత బంధువయినప్పటికీ, విద్యుత్‌శాఖలో ఆయన ప్రమేయం-ప్రభావం మొదటినుంచీ తక్కువగానే ఉంది. ప్రకాశం జిల్లాలో పార్టీ రాజకీయాలు, మైనింగ్ వ్యవహారాలకే బాలినేని పరిమితమయ్యారు. ఏదేమైనా బాలినేని చేసిన ప్రకటన, ‘క్యాబినెట్‌లో కొత్త ముఖాలెవర’న్న ఆసక్తికరమైన చర్చకు తెరలేపినట్టయింది.

LEAVE A RESPONSE