– 15 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టని నిరుపేద బొత్స
– టీఎస్ఎస్పీడీసీఎల్ ట్వీట్‌తో బుక్కయిపోయిన బొత్స
– అసలు ఇన్నాళ్లు ఆయనను ఎలా వదిలేశారు?
– మరీ ఇంత కక్కుర్తా సత్తిబాబు?
– మళ్లీ హైదరాబాద్‌లో కరెంటు లేదని బిల్డప్పులెందుకు?
– సత్తిబాబును ఆడేసుకుంటున్న నెటిజన్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అనుకున్నదే అయింది. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ చెప్పిందే నిజమయింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. తాను వాడుకుంటున్న కరెంటుకు బిల్లు కట్టలేదు. అందుకే ఆయన ఇంటికి కరెంటు కట్ చేశారట. అసలు విషయం ఇదయితే.. అదేదో అసలు హైదరాబాద్‌లో కరెంటే ఉండటం లేదని బిల్డప్పులిచ్చిన సత్తిబాబు.. విద్యుత్ శాఖ చేసిన ట్వీట్‌తో అడ్డంగా దొరికిపోయారు. ‘‘మరీ ఇంత కుక్కుర్తి విలాస్ కాఫీ క్లబ్బా’’ అని ఇప్పుడు నెటిజన్లు సత్తిబాబును సోషల్‌మీడియాలో తెగ ఆడేసుకుంటున్నారు.
అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం. పక్క రాష్ట్రంలో కరెంటు లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ క్రెడాయ్ మీటింగులో వ్యాఖ్యానించారు. దానితో ఇంత పొడుచుకొచ్చిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ‘అసలు హైదరాబాద్‌లో కరెంటే ఉండదు.నేను హైదరాబాద్ నుంచే వస్తున్నా. కరెంట్ లేక నేను జనరేటర్ వేసుకోవలసి వచ్చింద’ని కౌంటర్ ఇచ్చారు. దానితో బయట రాష్ట్రాల ప్రజలు కూడా.. ఓహో‘ హైదరాబాద్‌లో అసలు కరెంట్ లేదే మో. కేటీఆర్వన్నీ పేకుడు మాటలే మో’నని భావించారు.
అయితే టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి మాత్రం.. ‘బహుశా సత్తిబాబు కరెంటు బిల్లు కట్టక ఆయన ఇంటికి కరెంట్ కట్ చేశారేమో’నని కౌంటర్ ఇచ్చారు. నిజానికి ఇప్పుడు హైదరాబాద్‌లో కరెంట్ లేకపోతే వార్త. ఇటీవల కేటీఆర్ కూడా ‘ఇప్పుడు హైదరాబాద్‌లో కరెంట్ లేకపోతే వార్త’ అని వ్యాఖ్యానించారు.
ఎంపీ రంజిత్ అన్నట్లుగానే… సత్తిబాబు, తన ఇంటికి వాడుకుంటున్న కరెంటుకు బిల్లు చెల్లించకపోవడం వల్లనే కరెంట్ కట్ చేశారట. విద్యుత్ శాఖ అదే విషయాన్ని ట్వీట్ చేసింది. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీరు కరెంట్ బిల్లు క్లియర్ చేసిన వెంటనే మీ ఇంటికి కరెంటు సరఫరా చేస్తాం. 15 నెలలుగా బిల్లు చెల్లించడం లేదు’’ అని టీఎస్ఎస్పీడీసీఎల్ ట్వీట్ చేసింది.
అంటే అసలు 15 నెలల నుంచీ సత్తిబాబు కరెంటు బిల్లే కట్టడం లేదన్నమాట. మరి కరెంట్ బిల్లు కట్టకుండా, ఉత్తి పుణ్యానికి కరెంటు ఇవ్వడానికి టీఎస్ఎస్పీడీసీఎల్ ఏమైనా ధర్మసత్రమా? లేకపోతే అదేమైనా చీపురుపల్లి చిన్నశీను సామ్రాజ్యమా? ఎవరో ఒకరు బిల్లు కట్టిపోవడానికి! చేసిందే సిగ్గుమాలిన పని. మళ్లీ దానికి హైదరాబాద్‌లో అసలు కరెంటే ఉండటం లేదని విమర్శలు! సోషల్‌మీడియాలో ఇలాంటి ట్రోల్స్ నడుస్తున్నాయి మరి!
అయినా సత్తిబాబు స్థాయికి, కరెంటు బిల్లు కట్టడం ఒక లెక్కా? తన సొంత ‘ఇజ్జీనగర’మంటే ఎవరో ఒకరు కట్టేసి స్వామిభక్తి ప్రదర్శించవచ్చు. ‘అల్లుడు శీను’ను చూసి స్పాన్సర్లు రావచ్చు. కానీ హైదరాబాద్‌లో అలాంటి బకరాలు ఎవరుంటారు? వాడిన కరెంటుకు సొంత సొమ్ము చెల్లించాల్సిందే మరి! అయినా సత్తిబాబు, ఇంత ‘కక్కుర్తి విలాస్ కాఫీ క్లబ్బా’.. ‘ఇంతోటిదానికి మా హైదరాబాద్‌ను బద్నాం చేయడమెందుకు’, ‘చేసిందే సిగ్గుమాలిన పని. మళ్లీ మా ప్రభుత్వంపై విమర్శలెందుకు సత్తిబాబూ’ అని నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు.
సామాన్యుడికో రూలు.. సత్తిబాబుకో రూలా?
కాగా ఏపీ మంత్రి సత్తిబాబు గత 15 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదంటూ, టీఎస్ ఎస్పీడీసీఎల్ చేసిన ట్వీట్‌పై మరొక వివాదం రాజుకుంటోంది. ‘15 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టని మంత్రిని ఎలా వదిలేశారు? అసలు ఎప్పటి నుంచి ఆయన ఇంటికి కరెంట్ కట్ చేశారు? అదే సామాన్య-మధ్య తరగతి ప్రజలు 10 రోజులు కరెంటు బిల్లు కట్టకపోతే ఇంటికి వచ్చి నానా రచ్చ చేసి, ఫ్యూజులు పీక్కువెళతారే? మరి సత్తిబాబుకు ఇన్నాళ్లు ఎందుకు మినహాయింపు ఇచ్చారు? అంటే సామాన్యుడికో రూలు, సత్తిబాబుకో రూలా?’ అని నెటిజన్లు ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు. నిజమే కదా? వారి ప్రశ్నల వర్షంలో న్యాయం ఉంది కదా?
ఇంతకూ ఆ ట్వీట్ అసలా? నకిలీనా?
కాగా సోషల్‌మీడిమాలో దుమ్మురేపుతున్న టీఎస్ ఎస్పీడీసీఎల్ ట్వీట్ అసలా? నిజమా? అన్న చర్చ జరుగుతోంది. బొత్సకు కౌంటర్ ఇవ్వాలన్న లక్ష్యంతో కొందరు ఈ విధంగా, టీఎస్ఎస్పీడీసీఎల్ పేరుతో నకిలీ అకౌంటుతో ట్వీట్ చేస్తున్నారన్నది ఆ చర్చల సారాంశం. దానిపైనే సోషల్‌మీడియాలో కామెంట్ల యుద్ధం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఈ రచ్చ శనివారం మధ్యాహ్నం నుంచి జరుగుతున్నా, టీఎస్ ఎస్పీడీసీఎల్ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం ప్రస్తావనార్హం. అంటే.. మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా? లేక ఇలాంటివి పట్టించుకోవలసిన పనిలేదని లైట్ తీసుకుంటున్నట్లు అనుకోవాలా అన్నదే ప్రశ్న.
అది మా ట్వీట్ కాదు: టీఎస్ఎస్పీడీసీఎల్
అయితే… ఆ ట్విట్టర్ సమాచారం, ఖాతా తమది కాదని టీఎస్ ఎస్పీడీసీఎల్ ఆలస్యంగా ప్రకటించింది. ‘ట్విట్టర్లో మా సంస్థ పేరిట వెలువడిన ట్వీట్ మాది కాదు. అది బోగస్. దానితో మాకు ఎలాంటి సంబంధం లేదని’ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి తన ప్రకటనలో స్పష్టం చేశారు. సంస్థ పేరుమీద ప్రచారం చేసేవారిపై, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.సో..ఈ వివాదానికి తెర పడినట్లే ఇక…