– బీసీలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అందలం
– ముదిరాజ్‌లకు కనీవిని ఎరుగని రీతిలో ప్రాధాన్యత
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
– సీఎం వైఎస్ జగన్‌కు బీసీలంతా అండగా ఉండాలి
– ముదిరాజ్‌లకు న్యాయం చేసింది నాడు వైఎస్సార్… నేడు వైఎస్ జగన్
– ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. బీసీలకు ఎవరూ చేయని విధంగా ఎన్నో చారిత్రక కార్యక్రమాలు చేపడుతూ జగనన్న ముందుకుసాగుతున్నారని పేర్కొన్నారు.
ముదిరాజ్ మహాసభతోపాటు రాష్ట్రంలోని ఆయా ముదిరాజ్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంత్రి విడదల రజినికి ఘన సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, ఆయా కార్పొరేషన్లకు పూర్తి స్థాయి కార్యవర్గాన్ని నియమించిన ఘనత తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారికే దక్కుతుందని చెప్పారు. కేబినెట్‌లో ఏకంగా 10 మంది బీసీలకు స్థానం కల్పించడమంటే మామూలు విషయం కాదని, ఏ రాజ్యాంగంలోనూ ఇది లేదని, కానీ జగన్ గారు బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని తన మనసులో రాసుకుని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఉపముఖ్యమంత్రి పదవి కూడా బీసీలకు ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. బీసీలకు జగనన్న ఇచ్చిన గుర్తింపు, ప్రాధాన్యతను నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆయనకు ఎప్పటికీ మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చే విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు.
బీసీలంతా జగనన్న వెన్నంటి ఉండాలి: ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ పిలుపు
బీసీలంతా ఎప్పటికీ జగనన్న వెన్నంటే ఉండాలని ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం నాడు వైఎస్సార్ కృషి చేశారని గుర్తుచేశారు. ముదిరాజ్‌లను బీసీ ఏ లోకి చేరుస్తూ వైఎస్సార్ నిర్ణయం తీసుకుంటే.. కోర్టులకు వెళ్లి కొంతమంది అడ్డుకున్నారని, సుప్రిం కోర్టు ఇప్పుడు ఈ విషయం ఉందని, త్వరలోనే తాము ఈ కేసులో విజయం సాధిస్తామని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు, ముదిరాజ్ అడబిడ్డకు మంత్రి పదవి ఇచ్చిన ఘతన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఎప్పటికీ బీసీలంతా ఆయనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మహేష్ ముదిరాజ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమానికి ఆయా జిల్లాల నుంచి ముదిరాజ్ సంఘాల నాయకులంతా హాజరయ్యారు.