Suryaa.co.in

Andhra Pradesh

రామోజీది కండ కావురం… కళ్యాణ్‌ది అజ్ఞానం

-రుషికొండపై ఈనాడులో విష కధనం
-అది కొండ కావరం కాదు.. కండ కావరం
-విశాఖ నగరం, ఉత్తరాంధ్రపై కక్ష, అక్కసు
-మీకు ఎందుకంత కడుపుమంట?
-ప్రధాని పర్యటన, సభ గ్రాండ్‌ సక్సెస్‌
-ఉత్తరాంధ్ర వాసులు విశేషంగా తరలి వచ్చారు
-అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు
-సభలో సీఎం ప్రసంగం దేశానికే ఒక మెసేజ్‌
-తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న మాట ఘనం
-సభలో సీఎంగారు చాలా హుందాగా ప్రసంగించారు
-ప్రెస్‌మీట్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

భావి తరాలకు అదో మెసేజ్‌:
ప్రధాని బహిరంగ సభకు ఉత్తరాంధ్ర వాసులంతా తరలి వచ్చారు. సభను సక్సెస్‌ చేశారు. అందుకు ప్రతి ఒక్కరికి పార్టీ తరపున, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశాఖ నగరం, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రధాని రావడం సంతోషదాయకం. ఒక మంచి కార్యక్రమం జరిగిందని అనుకుంటున్నాం. లక్షలాది ప్రజలు సభకు వచ్చారు. సభలో సీఎం వైయస్‌ జగన్‌, ప్రభుత్వ విధానాన్ని, పెండింగ్‌ సమస్యలను స్పష్టంగా, క్లుప్తంగా వివరించారు. వాటన్నింటినీ పరిష్కరించాలని ప్రధాని గారిని కోరారు. తమకు రాజకీయాలు, పార్టీలు ముఖ్యం కాదని, రాష్ట్ర శ్రేయస్పు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇది మంచి నాయకత్వం, ఉత్తమ పరిపాలన విధానం అంటే. రాజకీయం అంటే రోజూ విమర్శించడం, దూషించడం కాదు. ఇవాళ సీఎం ప్రసంగం రాబోయే తరాలకు మెసేజ్‌ ఇచ్చినట్లుగా ఉంది. అందుకు సీఎంని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. తనకు పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎంగారు దేశానికే ఒక మెసేజ్‌ ఇచ్చారు. అందరూ అనుకున్నట్లు సభ విజయవంతమైంది.

పవన్‌ది అజ్ఞానం:
కానీ రాష్ట్రంలో దురదృష్టం ఏమిటంటే.. అటు రాజకీయ నాయకులు కానీ, కొన్ని పత్రికలు కానీ.. సాక్షాత్తూ ప్రధానిగారు వస్తున్నారంటే, ఆయనకు ఈ సమస్యలు వివరించాలి. వాటిని పరిష్కరించమని కోరాలి. రాష్ట్రానికి ఇది కావాలి అని అడగాలని సూచించాలి. నిన్న ఇక్కడికి ఒక సెలబ్రిటీ వచ్చారు. తనను ప్రధానిగారు కలవమన్నారని చెప్పారు. ఆయన ప్రధానిని కలిసి, బయటకు వచ్చి, తాను ప్రభుత్వంపై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. అంతే కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవి అడిగానని కానీ, ప్రస్తావించానని కానీ చెప్పలేదు. అలా చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ పవన్‌ ఒక ఆజ్ఞాని. అంటే ఎంతసేపూ ఆయనది, ఆయన వత్తాసు పలికే వారి ఆలోచనంతా వ్యక్తిగతం. పూర్తిగా స్వార్థపూరితం. గత రెండు రోజులుగా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు మాటలు చూస్తున్నాం.

రామోజీ కండ కావరం:
ఇక వారికి వత్తాసు పలికే ఈనాడు పత్రిక అయితే, మరీ దిగజారి ఇవాళ వార్త రాసింది. ‘కొండ కావురం’ అని రిషికొండపై వార్త రాశారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రధానిగారు వస్తుంటే, ఆరోజు పత్రికలన్నీ స్థానిక సమస్యలు ప్రస్తావిస్తాయి. వాటికి ప్రధానిగారు ఏం చెబుతారో చూడాలని రాస్తాయి. కానీ ఈనాడు రాసిన కధనం.. అది కొండ కావురం కాదు. రామోజీరావుకు, ఈ పత్రికకు ఉన్న కండ కావురం. ఉత్తరాంధ్ర భాషలో ఒళ్లు బలుపు కనిపిస్తోంది. కొండ కావురం అన్న రాతను చూస్తే.. వారి కడుపులో ఉన్న మంట, బాధ, అక్కసు ఉందో తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద, సీఎంగారి పైన, ఉత్తరాంధ్రపైనా ఎంత అక్కసు, కక్ష ఉందన్న విషయం అర్థమవుతుంది. దీని గురించి అందరూ ఆలోచించాలి.

రాష్ట్ర ప్రయోజనాలే సీఎంకి ముఖ్యం:
ఇవాళ దేశంలోనే మా పార్టీ నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. అదే విధంగా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వం మాది. అయినా సరే అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సీఎంగారు చెబుతుంటారు. అందుకు తగ్గట్లే ఆయన వ్యవహరిస్తున్నారు. సీఎంగారికి రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కూడా కాంక్షిస్తున్నారు.
ఇవాళ్టి సభకు ఇన్ని లక్షల మంది ఎందుకు తరలి వచ్చారు. అభిమానం ఉండబట్టే కదా. అందుకే ఇప్పటికైనా ఆ నాయకులు, ఆ మీడియా వాస్తవాలు గుర్తించాలి. ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. జగన్‌గారికి ఉన్న చిత్తశుద్ధి గమనించాలి.

రుషికొండపై నిర్మాణాల్లో తప్పేమిటి?:
రుషికొండపై ఎందుకు వారు తప్పుడు కధనాలు రాస్తున్నారు. రుషికొండ మీద ప్రభుత్వం కొన్ని భవనాలు కడుతోంది. అందులో తప్పేముంది? విశాఖలో ఏ కొండపైనా, ఏమీ కట్టలేదా? చివరకు రామోజీ ఫిల్మ్‌ సిటీలో కూడా కొండలపై కట్టడాలు ఉన్నాయి కదా?. రుషికొండ మీద గతంలోనే గెస్ట్‌ హౌస్‌ ఉంది. ఇప్పుడు కొత్త భవనాలు కడుతుంటే ఏమిటి తప్పు? ప్రభుత్వం ఏమైనా రామోజీ ఫిల్మ్‌ సిటీ మాదిరిగా వేల ఎకరాల్లో భవనాలు కడుతోందా? మీ విమర్శలు, ఆరోపణల వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం? కనీసం ఈ ప్రాంతానికేమైనా మేలు జరుగుతోందా?

గురివింద గింజ నీతులు:
ప్రధానిగారు ఇక్కడికి రావడం, సభలో పాల్గొనడం విశేషం. రూ.15 వేల కోట్ల పనులకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఇంకా అభివృద్ధి పనులు జరగాలని ఆ రాజకీయ పార్టీలు, ఆ పత్రికలు ఆలోచించాలి. అంతే తప్ప ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం, ఛార్జ్‌షీట్‌ వేస్తామని చెప్పడం కాదు. గురివింగ గింజ మాదిరిగా నీతులు చెప్పడం కాదు. మీరు ఛార్జ్‌షీట్‌లో ఏం పెడతారు? దాంతో ఏం చేస్తారు? బీజేపీలో ఏ, బీ అని రెండు గ్రూప్‌లు ఉన్నాయి. ఒకటి బీజేపీ బ్యాచ్‌. రెండోది టీడీపీ నుంచి వచ్చిన బ్యాచ్‌. వారికి ఇంకా తమ పార్టీ బుద్ధులు పోలేదు.

పవన్‌.. అక్కడికెళ్లి ఏం చేస్తావు?:
రేపు పవన్‌కళ్యాణ్‌ మా జిల్లా విజయనగరంకు వెళ్తాడట. జగనన్న లేఅవుట్‌ కాలనీ చూస్తాడట. చూడనివ్వండి. ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద లేఅవుట్‌. సుమారు 400 ఎకరాల్లో, 12 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. వారిలో 10 వేల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. పనులు సాగుతున్నాయి. అది కాలనీ కాదు. ఒక ఊరు అని చెప్పాలి. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. 10 వేల ఇళ్లు అంటే దాదాపు 40 వేల జనాభా. అంటే ఒక పట్టణంగా ఉంటుంది. 2006లో నేను ఉమ్మడి రాష్ట్రంలో హౌజింగ్‌ మినిస్టర్‌గా పని చేశాను. అప్పుడు సీఎంగా ఉన్న వైయస్సార్‌గారు రాష్ట్రంలో గుడిసెలు ఉండకూడదని, 25 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. అవి ఊళ్లుగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు కడుతున్న ఇళ్లలో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా? అసలు అందుకు అవకాశం ఉందా? పనులు కాస్త ఆలస్యం కావొచ్చు. మూడు పద్ధతుల్లో పేదల ఇళ్లు కడుతున్నాం. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని ఒక్క నిరుపేద కూడా ఉండకూడదు. కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేజీ వంటి అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం.

ఆనాడెందుకు మాట్లాడలేదు?:
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు సీఎంగా పని చేశారు. 2014 నుంచి 2019 వరకు ఆయన కనీసం ఒక్క ఇళ్ల స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు? కనీసం ఆయనకు ఆ ఆలోచన కూడా రాలేదు. అయినా మీరు ఏరోజూ మాట్లాడలేదు. అదే జగన్‌గారికి సంకల్పం, చిత్తశుద్ధి ఉంది. అందుకే పట్టుదలతో పని చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. అందుకే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడబోము. అసలు మీరేం ఉద్ధరించారు? మీరు జత కట్టినప్పుడు, ఆ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ పని చేయలేకపోయింది. అప్పుడు మీరు ఆ ప్రభుత్వంతో కలిసి ఉన్నారు. అయినా మీరు ఎందుకు ఒక్క ఇంటి స్థలం కూడా ఎందుకు ఇప్పించలేకపోయారు. నాడు వైయస్సార్‌గారికి, ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌గారికి ఆ మంచి ఆశయం ఉంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. ఇవాళ్టి సభలో సీఎంగారు కొద్దిసేపే మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడారు. చెప్పాల్సిన విషయాలు సూటిగా, స్పష్టంగా చెప్పారు. ఇది ఆయన అంకితభావం, చిత్తశుద్ధికి నిదర్శనం.

మళ్లీ చెబుతున్నా..:
రుషికొండపై గతంలో ఒక టూరిజమ్‌ గెస్ట్‌ హౌస్‌ ఉంది. ఇప్పుడు అక్కడ ఆ శాఖ కొత్త భవనాలు కడుతోంది. తప్పేమిటి? కట్టకూడదా? పర్యావరణ సంబంధ అంశాలు ఉంటే, ఆ శాఖ చూసుకుంటుంది. వాటిని ప్రభుత్వమే స్వయంగా కడుతోంది. ప్రైవేటు కాంట్రాక్ట్‌కు ఇవ్వలేదు. ఆ భవనాలు ఎందుకన్నది పనులు పూర్తయ్యాక చెబుతారు కదా?

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
ఆయన్నే అడగండి:
ప్రధానిగారితో ఏం మాట్లాడారని మీరు పవన్‌కళ్యాణ్‌ను అడగండి. నేనేమైనా పరకాయ ప్రవేశం చేస్తానా? నిజంగా పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రం కోసం అడిగి ఉంటే, అది చెప్పేవారు. కానీ అవేమీ చెప్పలేదు. అందుకే ఏం మాట్లాడారన్నది ఆయన్నే మీరు (ఏబీఎన్‌) అడగాలి. మా సీఎంగారు ఇవాళ సభలో చాలా స్పష్టంగా మాట్లాడారు. అన్ని అం«శాలు ప్రస్తావించారు. వాటన్నింటినీ ప్రధానిగారికి నివేదించారు కూడా. తమకు రాజకీయాలు, పార్టీలు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. సీఎంగారు చాలా హుందాగా మాట్లాడారు. ఇదే విశాఖలో రామానాయుడు ఫిల్మ్‌ స్టుడియో, ఐటీ పార్కులు ఎక్కడున్నాయి. కొండల మీదే కదా?.. అని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

LEAVE A RESPONSE