-తెలంగాణ పర్యాటక ప్రదేశాల పై ఆసక్తి చూపిన బ్రిటన్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ లు
-సీఎం కేసీఆర్ అదేశాల మేరకు అంతర్జాతీయ టూరిజం వేదిక పై తెలంగాణ పర్యాటక వైభవాన్ని చాటిన మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్
ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు పాల్గొని తెలంగాణ పర్యాటక వైభవాన్ని ప్రతిష్టాత్మక టూరిజం అండ్ ట్రావెల్ వేదిక వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో ఘనంగా చాటి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, ఆర్కియాలజీ శాఖల మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ ప్రాంత కీర్తి ప్రతిష్టలను లండన్ వేదికగా చాటామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం లభించిన ప్రాంతంగా తెలంగాణ రాష్ట్ర గొప్పదనం ను పర్యాటకులకు తెలియచెప్పామన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారని ఈ వేదికపై చాటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారం గా ఇతర రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థితిలో నిలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అద్భుతమైన, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాల నుండి ఇండియా కు వచ్చే పర్యాటకులు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించే విధంగా టూరిస్టులు, టూర్ ఆపరేటర్ లు, ఏజెంట్లు తమ ఆసక్తి ని చూపారన్నారు మంత్రి డా . V. శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పర్యాటక ప్రదేశాలను, చారిత్రక, వారసత్వ , ప్రకృతి సౌందర్యంగా ఏర్పడిన ఎన్నో జలపాతాలు, అడవులు, సెలయేర్లు, నదుల వెంట, రిజర్వాయర్ల వెంట ఉన్న సుందరమైన ప్రకృతి అందాలను గుర్తించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నామన్నారు మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ రాష్ట్రంలో వందల సంవత్సరాల చారిత్రక వారసత్వ సంపద కలిగిన రామప్ప దేవాలయం కు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తింపు సాధించడంలో సీఎం కేసీఆర్ చేసిన కృషి ఎనలేనిదిన్నారు . సీఎం కేసీఆర్ చేపట్టిన విధివిధానాల వల్ల యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామం ప్రపంచంలోనే బెస్ట్ టూరిజం విలేజ్ గా ఎంపికైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆది మానవుడు జీవించి ఉన్న కాలంనాటి చరిత్ర తో పాటు అద్భుతమైన చరిత్ర, చారిత్రక అవశేషాలు, నదులు రిజర్వాయర్లు, ప్రకృతి సంపద ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద జలపాతం ముత్యాల ధార తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. అలాగే గౌతమ బుద్ధుడు జీవించి ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రాంతంలో బుద్ధిజం విస్తరించి ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న బుద్ధిజం కేంద్రాలు, చరిత్ర సంరక్షణకు సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారన్నారు. నాగార్జున సాగర్ జలాశయం కు అనుబంధం గా సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఆసియా ఖండంలోని అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ వల్ల నేడు బుద్ధిజంకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మ ఉత్పత్తి , ఎగుమతి కేంద్రంగా కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ సప్లై చేయడంలో కీలకపాత్ర పోషించింది అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరం మెడికల్ టూరిజం కి హబ్ మారిందన్నారు. హైదరాబాద్ మహానగరం నేడు అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందుతూ.. ఆధ్యాత్మికంగా, సాఫ్ట్వేర్ ఎగుమతుల కేంద్రంగా , నిరంతర విద్యుత్తు సరఫరా కేంద్రంగా, దేశంలోనే పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రం కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగరం హెరిటేజ్ సిటీగా, మోడ్రన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకుల భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టామన్నారు మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్.