Suryaa.co.in

Editorial

బీజేపీ ‘బండి’కి బ్రేకులు

– ‘బండి’పై తిరుగుబాట!
– తిరోగమనంలో తెలంగాణ బీజేపీ
– కుమ్ములాటల్లో కమలదళం
– సంజయ్‌ను తొలగించాలంటున్న సీనియర్లు
– ఇప్పటికి రెండుసార్లు అసమ్మతి నేతల భేటీ
– ఢిల్లీ నాయకత్వానికి వెల్లువెత్తిన ఫిర్యాదులు
– ఒంటెత్తుపోకడలే కారణమని విమర్శ
– సొంత ప్రచారానికే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు
– ఎవరినీ నమ్మరన్న ప్రచారం
– పాతవారికి పాతర వేశారన్న రుసరుసలు
– బూత్‌ కమిటీల భర్తీలో విఫలమయ్యారని విమర్శలు
– సమన్వయంలో విఫలమయ్యారని ధ్వజం
– ఆయన ఉంటే పార్టీలో ఎవరూ చేరరని స్పష్టీకరణ
– కొత్త వారిని పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు
– కుల సమీకరణపై దృష్టి సారించడం లేదని వ్యాఖ్యలు
– సంజయ్‌కు సంఘ్‌ సపోర్టు?
– స్వయంసేవక్‌ సంజయ్‌నే కొనసాగించాలంటున్న సంఘ నేతలు
– బండి భవితవ్యంపై తర్జనభర్జన
( మార్తి సుబ్రహ్మణ్యం)

బండి సంజయ్‌. తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. నిద్రావస్థలో ఉన్న తెలంగాణ బీజేపీని ఉరుకులు పెట్టించి, కేసీఆర్‌ సర్కారుపై ఉరుములు, పిడుగులు కురిపిస్తున్న అదే బండి సంజయ్‌, ఇప్పుడు బోలెడు చిక్కుల్లో పడ్డారు. ఆయన పనితీరు నచ్చని సీనియర్లు బండిపై తిరుగుబాటలో పయనిస్తున్నారు.

బండిని తొలగించకపోతే.. తెలంగాణలో బీజేపీ బండి నడవటం కష్టమేనని కుండబద్దలు కొడుతున్నారు. ఆయన కొందరినే ప్రొత్సహిస్తున్నారని.. పాతవారిని పక్కనపెట్టి, కొత్త వారిని పట్టించుకోవడం లేదన్నది వారి ప్రధాన ఆరోపణ. అదే ఆరోపణలను ఢిల్లీ దాకా తీసుకువెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆయనే కొనసాగితే.. కొత్తగా చేరేవారెవరూ లేకపోగా.. పార్టీలోకి వచ్చిన వారెవరూ మిగలరన్నది ఢిల్లీకి సీనియర్లు పంపిన సందేశం.

తెలంగాణలో బీజేపీకి బ్రాండ్‌నేమ్‌గా మారిన బండి సంజయ్‌.. సీనియర్ల లక్ష్యానికి గురికావడం, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జీరో స్థాయిలో ఉన్న బీజేపీని.. హీరో అనిపించుకునే దశకు తీసుకువెళుతున్న ఆయనను, అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్న గళాలు పెరగడం, సహజంగానే సంజయ్‌కు ఇబ్బందికరంగా మారింది. దానికి తోడు క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోవడం, పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.

సంజయ్‌ బాగా కష్టపడుతున్నప్పటికీ.. ఎవరినీ సమన్వయం చేసుకోవడం లేదని, తానొక్కడినే పనిచేస్తున్నానన్న సంకేతాలిచ్చేందుకే.. ఇతరులను పక్కనపెడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. కొంతమందిని ప్రోత్సహిస్తూ, వారితోనే ‘అన్ని పనులూ’ చేయిస్తున్నారన్నది మరో విమర్శ. సర్కారుపై యుద్ధంతో అనేకసార్లు జైలుకు సైతం వెళ్లొచ్చిన సంజయ్‌, ఎవరినీ విశ్వసించకపోవడం కూడా ఆయనకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆయన పార్టీ నాయకులెవరినీ నమ్మరన్నది పార్టీ వర్గాల్లో విస్తృంగా వినిపించే వ్యాఖ్య.

నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నేత ద్వారా.. ఇటీవలి కాలంలో చేయిస్తున్న కార్యక్రమాల గురించి, పలువురు సీనియర్లు ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అదేవిధంగా కరీంనగర్‌ జిల్లా ప్రముఖుడితో ఉన్న పరోక్ష సంబంధాలపై, సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలను కూడా, సంజయ్‌ వ్యతిరేక వర్గం ఢిల్లీ నాయకత్వానికి పంపినట్లు తెలుస్తోంది. పాదయాత్ర తెరవెనక వ్యవహారాలపైనా సంజయ్‌ వ్యతిరేక వర్గం ఇప్పటికే నాయకత్వానికి ఫిర్యాదులు పంపిన విషయం తెలిసిందే.

క్రమశిక్షణ ఆరో ప్రాణంగా భావించే బీజేపీలో.. అదే క్రమశిక్షణ కట్టుతప్పి కుమ్మలాటలకు కేంద్రంగా మారడంపై, పార్టీ సంప్రదాయవాదుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.ట్వీట్లు- ప్రెస్‌మీట్లలో కామెంట్లతో నేతలు, ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరిని సమన్వయం చేసే ఇన్చార్జిలు, పూర్తిస్థాయిలో తెలంగాణకు సమయం కేటాయించడం లేదు. సంజయ్‌ను తొలగించాలంటూ ఇప్పటికి రెండుసార్లు.. సీనియర్లు భేటీ నిర్వహించి, ఆయనపై ఆరోపణలతో పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేయటం, పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

డాక్టర్‌ లక్ష్మణ్‌ అధ్యక్షుడిగా ఉన్న కమిటీలోని వారందరినీ తొలగించి.. వారికి కొత్త కమిటీలో స్థానం కల్పించకపోవడమే, వివాదానికి కారణంగా కనిపిస్తోంది. లక్ష్మణ్‌ సహా, అంతకుముందున్న అధ్యక్షులంతా సీనియర్లను గౌరవిస్తే, సంజయ్‌ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం, వారికి రుచించడం లేదు.

తాము రాష్ర్ట కమిటీలో పనిచేస్తున్నప్పుడు సంజయ్‌ కరీంనగర్‌ కార్పొరేటర్‌గా ఉన్నారని, అలాంటి వ్యక్తి తమను దూరం పెట్టడం ఏమిటన్నది సీనియర్‌ ఆగ్రహం. నిజానికి పార్టీ సీనియర్లు బండి సంజయ్‌ను.. రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా, ఇంకా కార్పొరేటర్‌- జిల్లా స్థాయి నేతగానే మానసికంగా పరిగణిస్తున్నారు. అటు సంజయ్‌ కూడా సీనియర్లతో సంబంధం లేకుండా, తన పని తాను చేసుకుపోతున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణకు ఇదే ప్రధాన కారణంకా కనిపిస్తోంది.

పోనీ ఇతర పార్టీల నుంచి చేరుతున్న వారిని ఏమైనా ప్రోత్సహించి, బాధ్యతలు అప్పగిస్తున్నారా అంటే అదీ లేదని స్పష్టం చేస్తున్నారు. మిగిలిన వారిని పక్కనబెట్టి.. తానొక్కడే పనిచేస్తూ, నాయకత్వానికి అదే భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నది సీనియర్ల మరో ఫిర్యాదు. రాష్ట్ర కమిటీలో ఉన్న వారికి సైతం పెద్దగా బాధ్యతలేమీ లేవని, సంజయ్‌ తాను ఎంపిక చేసుకున్న వారికే ‘అన్ని బాధ్యతలు’ అప్పగించారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మంత్రి శ్రీనివాస్‌జీ గతంలో సంఘటనా మంత్రి ఉన్నప్పుడు, పార్టీ ఆఫీసులో ఉండేవారు. పార్టీ నేతలు ఆయనకు తమ సమస్యలు వివరించేవారు. మంత్రి శ్రీనివాస్‌జీ బదిలీ అయిన తర్వాత.. ఇప్పటివరకూ సంఘటనా మంత్రి ఎవరూ లేకపోవడంతో, పార్టీ కార్యాయలంలో గందరగోళం నెలకొంది. బండి సంజయ్‌ పార్టీ ఆఫీసులో నియమించిన జిల్లాస్థాయినేతలకు, రాష్ట్ర రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదంటున్నారు. జిల్లాల్లో ఉండి పార్టీని బలోపేతం చేయకుండా, పార్టీ ఆఫీసులో కూర్చుని పెత్తనం చేస్తే, ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎలాంటి బాధ్యతలు లేవని, వారిని ఇప్పటికీ సొంతం చేసుకోలేని పరిస్థితి ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానితో వారు కూడా పార్టీలో ఉండీ లేనట్లు పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంతోనే ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి సీనియర్లు, పార్టీలో ఇమడలేకపోతున్నారని విశ్లేషిస్తున్నారు.

ఈటలకు పేరుకు చేరికల కమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినప్పటికీ, ఆయనతో సంబంధం లేకుండానే చేరికలు జరిగాయి. దీనితో ఆ పదవి నుంచి తప్పుకుంటానని ఈటల చెప్పాల్సి వచ్చింది. సంజయ్‌-ఈటలకు సరిపని నేపథ్యంలో.. బండిని వ్యతిరేకించే వారంతా ఈటలతో జతకడుతున్న పరిస్థితి. ఈటల కూడా కేసీఆర్‌పై మునుపటి విమర్శల తీవ్రత తగ్గించడం, బీజేపీ నేతల్లో వైరాగ్యం తొంగిచూస్తున్నట్లు అర్ధమవుతోంది.

తాజాగా పార్టీ నేత జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్‌.. దానిపై ఈటల రియాక్షన్‌ గమనిస్తే, కమలదళాలు క్రమశిక్షణ కట్టుతప్పుతున్నాయన్నది స్పష్టమవుతుంది. బీజేపీలో ఇలాంటి స్వతంత్ర పోకడలు, గతంలో ఎప్పుడూ లేని విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఎవరికి వారు సొంతగా ప్రకటనలిచ్చే సంస్కృతి ఇప్పుడే చూస్తున్నామని సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడిగా అందరినీ సమన్వయం చేసుకోవలసిన సంజయ్‌.. స్వయంగా సొంత గ్రూపు తయారుచేసుకోవడంపైనా, సీనియర్లు రుసరుసలాడుతున్నారు.

కాగా ఎన్నికలు సమీపిస్తున్నందున.. సంజయ్‌ను తొలగించాలని సీనియర్లు మళ్లీ గళమెత్తుతున్నారు. ఆయన ఉంటే కొత్త వారు పార్టీలో చేరేమాట అటుంచి, కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ నుంచి చేరిన వారు, వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి తీసుకురావడంలో.. సంజయ్‌ విఫలమయ్యారన్న వ్యాఖ్యలు, సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఆయన వైఫల్యమే వారిద్దరినీ, కాంగ్రెస్‌ వైపు వెళ్లేలా చేసిందని స్పష్టం చేస్తున్నారు. వారికి నిర్దిష్టమైన హామీ ఇప్పించకపోవడంతోనే, కాంగ్రెస్‌లో చేరారని చెబుతున్నారు.

అదీగాక.. బూత్‌కమిటీలను ఇప్పటివరకూ.. పూర్తి స్థాయిలో భర్తీ చేయించడంలో విఫలమయ్యారన్న ఫిర్యాదులు కూడా, సంజయ్‌ నాయకత్వంపై లేకపోలేదు. రాష్ర్టానికి ముగ్గురు ఇన్చార్జిలు వచ్చి కూడా, సంజయ్‌ నాయకత్వంతో బూత్‌ కమిటీలు పూర్తి స్థాయిలో భర్తీ చేయించలేకపోయారని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఆ ముగ్గురు అసలు రాష్ట్రంలో ఉండకుండా, చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారంటున్నారు.

రాష్ట్ర పార్టీకి ఇప్పటివరకూ సంఘటనా మంత్రి లేకపోవడం కూడా, సంజయ్‌ హవాకు మరో ప్రధాన కారణమని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. గతంలో ఆ హోదాలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌జీ, అందరినీ కాదని సొంత నిర్ణయాలు తీసుకునేవారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సంజయ్‌ నియమించిన వారే పార్టీ ఆఫీసులో పెత్తనం చేస్తున్నారంటున్నారు.

అదేవిధంగా అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌ను.. ఇప్పటిదాకా భర్తీ చేయలేకపోయారన్నది మరో విమర్శ. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అసెంబ్లీలో.. ఫ్లోర్‌ లీడర్‌ లేకపోవడం అంటే, సంజయ్‌ పార్టీపై ఏ స్థాయిలో దృష్టి సారించారో అర్ధమవుతోందని, సీనియర్లు ఎద్దేవా చేస్తున్నారు.

చివరకు ఏళ్ల పాటు, జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ను కూడా నియమించలేపోయారని గుర్తు చేస్తున్నారు. మీడియాలో విమర్శలు వచ్చిన తర్వాత ఇటీవల జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ను నియమించారని చెబుతున్నారు. సంజయ్‌ను కొనసాగిస్తే.. ఇప్పటివరకూ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉందనుకుంటున్న బీజేపీ కాస్తా, మూడవ స్థానంలోకి వెళ్లడ ం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే.. సంజయ్‌కు సంఘ్‌ దన్ను బలంగా ఉన్నట్లు కనిపిస్తొంది. స్వయంసేవక్‌ అయిన సంజయ్‌ను తొలగిస్తే, ఆయన స్థానంలో సంఘ్‌తో సంబంధం ఉన్న మరొక నేత లేరన్నది సంఘ్‌ వర్గాల వాదన. ఉన్న ఒక్క స్వయంక్‌సేవక్‌ను తొలగించవద్దన్న అభిప్రాయం, అటు పార్టీ జాతీయ సంఘటనా మహామంత్రి, బీఎల్‌ సంతోష్‌జీలోనూ ఉందంటున్నారు. అందుకే సంజయ్‌పై ఎన్ని విమర్శలు-ఆరోపణలు వచ్చినా, ఆయనను తొలగించడం కష్టమని మరికొందరు సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE