Suryaa.co.in

Editorial

బీజేపీ-జనసేన పొత్తుకు బ్రేక్?

-టీడీపీ-జనసేన పొత్తు పొడుస్తుందా?
– బీజేపీని వదిలించుకోవాలంటున్న జనసైనికులు
– స్థానిక సమరంలో టీడీపీతో కలసి పోటీ చేసిన జనసేన
– బీజేపీ తమకు గుదిబండ అంటున్న జనసైనికులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీ-జనసేన పొత్తు పుటుక్కుమనే ప్రమాదం కనిపిస్తోంది. బీజేపీ జాతీయ పార్టీ అయినా, ఏపీలో ఉప ప్రాంతీయ పార్టీ కంటే ఘోరమైన స్థాయికి దిగజారినందున.. ఇక ఆ పార్టీని మోయడం కష్టమని, జనసైనికులు కుండలుబద్దలు కొడుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీజేపీని నమ్మితే మునిగిపోయేవారమని, కింది స్థాయి నేతలు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ సహకారం లేకపోతే తమ అధినేత పవన్ కల్యాణ్ పరువు పోయేదని చెబుతున్నారు. ప్రధానంగా జనసేనకు బలం ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో.. బీజేపీకి ఎంత త్వరగా తలాక్ చెబితే తమ పార్టీకి అంత క్షేమమన్న అభిప్రాయం జనసేనలో నెలకొంది. ఈ పరిణామాలు అటు తిరిగి ఇటు టీడీపీ-జనసేన పొత్తు పొడిచే దిశగా పయనిస్తోంది.
ఇటీవల వెల్లడయిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో, రాష్ట్రంలో బీజేపీ ఇక ఎదగడం కష్టమన్న అభిప్రాయం మిత్రపక్షమైన జనసేనలో మరింత ధృడపడింది. ఆ పార్టీకి ఫోజులిచ్చే నాయకులే తప్ప, పోరాడే కార్యకర్తలు లేరన్న నిజం బయటపడింది. చానెళ్లు, పత్రికల్లో కనిపించడానికే తప్ప.. జనంలో బలం ఉన్న నేతలెవరూ లేరని, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా.. ఎవరికీ అభ్యర్ధులను నిలబెట్టి గెలిపించుకునే సత్తా లేదన్న సత్యం తేలిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత జిల్లాలోనే పార్టీ పోరాడలేక గుడ్లుతేలేయడంతో, ఇక ఆ పార్టీతో పొత్తు వల్ల తమకు నష్టమే తప్ప, ఏమాత్రం లాభం లేదని జనసైనికులు తేల్చేశారు. జాతీయ పార్టీ అయినప్పటికీ, రాష్ట్రంలో ఎంపీటీసీలను కూడా గెలిపించుకోలేని నాయకులతో, అసెంబ్లీ ఎన్నికలకు వెళితే పుట్టిమునగడం ఖాయమని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రధానంగా అధికార వైసీపీతో బీజేపీ అగ్రనేతలు కొందరు తెరచాటు స్నేహం చేస్తున్నారని, అందుకే కీలక పదవుల్లో ఉన్న వారంతా, వైసీపీపై పోరాడటం లేదన్న అనుమానం జనసేన నాయకత్వంలోనూ లేకపోలేదు. బీజేపీ కీలక నేత ఒకరికి వైసీపీ నేతలు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మైనింగ్ డంప్, ధవళేశ్వరం వద్ద ఇసుక రీచ్ ఆదాయం కట్టబెట్టడం ద్వారా, ‘ఉపాథిహామీ పథకం’ ఇచ్చారన్న ఆరోపణలను జనసైనికులు ప్రస్తావిస్తున్నారు. మరికొందరు నేతలు వైసీపీ నాయకత్వంతో, అనేక ఆర్ధిక ప్రయోజనాలు పొందుతున్నారన్న అనుమానం కూడా తమ పార్టీకి లేకపోలేదని, జనసేన కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి.. బీజేపీ నేతలు వైసీపీతో ఆర్ధిక ప్రయోజనాలు పొందడం ద్వారా, తమ పార్టీకి పోరాడే అవకాశం లేకుండా చేస్తున్నారన్న ఆగ్రహం జనసైనికుల్లో వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో 9,590 ఎంపీటీసీ 641 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి 28 ఎంపీటీసీలు, జనసేనకు 179, మరో 2 జడ్పీటీసీలు లభించాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతా తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో బీజేపీకి ఒక్కొక్క ఎంపీటీసీ స్థానమే దక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీకి వచ్చిన ఎంపీటీసీ సీట్లు రెండు మాత్రమే. అదే జనసేన పార్టీకి 93 ఎంపీటీసీ స్థానాలు రావడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీకి ముచ్చటగా మూడు దక్కగా, జనసేనకు 63 ఎంపీటీసీ స్థానాలు లభించాయి. రాష్ట్ర బీజేపీలో చక్రం తిప్పుతున్న ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, సొంత అనంతపురం జిల్లాలో బీజేపీకి దక్కిన ఎంపీటీసీ కేవలం ఒకటి మాత్రమే. ఇక జడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటీ గెలవలేని దుస్థితి జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీకి సొంతమయింది.
మున్సిపల్ ఎన్నికల నుంచే బీజేపీ అసలు బలం తెలిసిన జనసైనికులు, ఎక్కడిక్కడ టీడీపీతో స్థానికంగా సర్దుబాటు చేసుకున్నారు. అదే సంప్రదాయం జడ్పీ-ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగింది. సోము వీర్రాజు సొంత తూర్పు గోదావరి జిల్లాలో అయితే టీడీపీ-జనసేన అభ్యర్ధులు కలిసే ఎన్నికల ప్రచారం చేయడం మరో విశేషం.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం మండలం ఎంపీపీని టీడీపీ-జనసేన కలసి పంచుకున్న నేపథ్యంలో, భవిష్యత్తులో కూడా టీడీపీ-జనసేన మధ్య పొత్తు పొడుస్తుందన్న భావన ఇరు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. ఉభయగోదావరి, విజయనగరం, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని జనసేన బలం టీడీపీకి తోడయితే, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం అటు టీడీపీ వర్గాల్లోనూ కనిపిస్తోంది. బీజేపీకి రాష్ట్రంలో ఏమాత్రం బలం లేకపోయినా, జాతీయ పార్టీ అన్న భావనతో ఆ పార్టీని మోయడం తప్ప తమకు అదనంగా వచ్చే లాభమేమీ లేదని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు.
అదే…. క్యాడర్, యంత్రాంగం, పోరాడే నేతలున్న టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల, రాజకీయంగా తమకూ లాభమన్న భావన జనసేన సీనియర్లలోనూ కనిపిస్తోంది. ప్రధానంగా.. రాయలసీమలో ఎక్కువమంది ముస్లిం యువకుల్లో పవన్ అభిమానులు ఉన్నప్పటికీ, తమ పార్టీ బీజేపీతో ఉన్నందున రాజకీయంగా తాము నష్టపోతున్నామన్న ఆందోళన, జనసేన నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అదే బీజేపీతో పొత్తు లేకపోతే.. ముస్లిం, క్రైస్తవులు తమ వైపు ఉంటారన్న విశ్వాసం జనసైనికుల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి తాజా ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీకి విడాకులు ఇవ్వాలన్న భావన జనసైనికుల్లో బలపడుతోంది.

LEAVE A RESPONSE