పార్లమెంట్‌ను లొంగదీసుకున్న నాస్తికుడు బ్రాడ్లా

ఎవరైనా అసెంబ్లీకో, పార్లమెంట్‌కో ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చినపుడు చాలామంది దేవుడి మీద ప్రమాణం చేస్తారు. కొందరు మాత్రం మనస్సాక్షిగా అంతఃకరణ శుద్ధిగా ప్రమాణం చేస్తారు. ఇలా దేవుడి ప్రసక్తి లేకుండా ప్రమాణం చేయడమనేది అంత సులభంగా రాలేదు. దాని వెనక ఎంతో సంఘర్షణ జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్‌ పార్లమెంట్‌ను ఎదిరించి, దాని మెడలు వంచి, తన పంతం నెగ్గించుకున్న చార్లెస్‌ బ్రాడ్లా అనే లిబరల్‌ పార్టీ బ్రిటీషు పార్లమెంట్‌ సభ్యుడి విజయగాథ మనకెంతో స్ఫూర్తిదాయకం. ప్రతి విషయాన్ని దేవుడికి, మతానికీ ముడిపెట్టే చాదస్తపు రోజుల్లో వ్యవస్థతో ఒంటరిగా పోరాడడం ఎంత కష్టమో ఊహకు అందని విషయం.
‘‘దేవుడు అనే పదానికి అర్థం లేదు. ఉంటే దాని అర్థమేమిటి? ఆయన ఎవరూ? అనే విషయాలు నిరూపణ కానంతవరకూ నేను ఆ పదంతో గాని, దానికి సంబంధించిన ఇతర పదాలతో గానీ ప్రమాణ స్వీకారం చేయను’’ అని ఖరాఖండిగా చెప్పి, తొణక కుండా నిలిచిన వ్యక్తి చార్లెస్‌ బ్రాడ్లా (జష్ట్రaతీశ్రీవం దీతీaసశ్రీaబస్త్రష్ట్ర). మూడుసార్లు పార్లమెంటులో కూర్చో కుండా చేసినా, అధైర్యపడకుండా పోరాడి గెలిచి, నాలుగోసారి తను అనుకున్న విధంగా దేవుడి ప్రమేయం, మత ప్రమేయం లేకుండా ప్రమాణం చేశాడు. అంతేకాదు, తనను మూడుసార్లు తిరస్కరించిన ఆ పార్లమెంటులోనే చట్టం తీసుకురాగలిగిన మహోన్నత వ్యక్తి.
అయినా స్థిర నిశ్చయంతో, ధైర్యంతో, ఓపికతో అత్యున్నత స్థాయిలో కరుడుగట్టుకుపోయి ఉన్న ఒక సామాజిక రుగ్మతపై తిరుగుబాటు ప్రకటించిన బ్రాడ్లా ఈ తరం హేతువాదులకు, మానవ వాదులకు ఆదర్శప్రాయుడు. హేతువాద భావనల్ని నిలబెట్టుకుంటూ రాజకీయాల్లో ఎదగడం సామాన్యమైన విషయం కాదు. మన భారతదేశ రాజకీయాల్లో హేతువాదుల సంఖ్య చాలా తక్కువ. వారు కూడా అవసరాన్ని బట్టి కొంత రాజీపడుతుంటారు. కానీ సుమారు 140 సంవత్సరాల క్రితం, 1880లో బ్రిటన్‌లోని నార్తాంప్టన్‌ నుంచి ఎన్నికైన బ్రాడ్లా రాజీపడలేదు. ఆ సంవత్సరం అతను పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రమాణం చేయాల్సి ఉంది. అప్పుడున్న సంప్రదాయం ప్రకారం అందరూ బైబిల్‌ మీద ప్రమాణం చేయాల్సిందే. బ్రాడ్లా అందుకు తిరస్కరించాడు.
అంతఃకరణ శుద్ధిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తానన్నాడు. స్పీకర్‌ ఒప్పుకోలేదు. విచారణకు కమిటీ వేశాడు. చాలా తర్జన భర్జన జరిగింది. చివరికి స్పీకర్‌ బ్రాడ్లా యం.పి. పదవి రద్దు చేశాడు. 1881లో జరిగిన ఉప ఎన్నికలో మళ్ళీ బ్రాడ్లానే గెలిచాడు. కథ పునరావృతమైంది. 1882లో రెండోసారి జరిగిన ఉప ఎన్నికలోనూ బ్రాడ్లాయే గెలిచాడు. ‘‘ఏది ఏమైనా, కట్టుకథలతో నిండిన బైబిల్‌పై ప్రమాణం చేసేది లేదని’’ బ్రాడ్లా తెగేసి చెప్పాడు. తన భావజాలానికే కట్టుబడి ఉన్నాడు తప్ప, రాజీపడలేదు. స్పీకర్‌ విచక్షణారహితంగా మళ్ళీ ఆ యం.పి. సీటు రద్దు చేశాడు. అన్నేళ్ళూ నార్తాంప్టన్‌ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం లేక యం.పి. సీటు ఖాళీగా ఉంది. 1886లో బ్రాడ్లా నాలుగోసారి సాధారణ ఎన్నికల్లో ఘనంగా విజయం సాధించి పార్లమెంటు కొచ్చాడు. ఈసారి స్పీకర్‌ మారాడు. బ్రాడ్లా ప్రమాణ స్వీకారంపై చర్చోపచర్చలు జరిగాయి.
బ్రిటన్‌ పార్లమెంట్‌ వేడెక్కింది. ఆయన అలా ఎన్నికై వస్తున్నాడంటే, ఆయన్ని ఎన్నుకుంటున్న ప్రజల అభీష్టం కూడా గమనించాలి కదా? బ్రాడ్లా ఆత్మస్థైర్యం ముందు కొత్తగా వచ్చిన స్పీకర్‌ తలవంచక తప్పలేదు. అంతకు ముందు కమిటీలలో బ్రాడ్లాను తీవ్రంగా విమర్శించిన సభ్యులంతా తోకలు ముడిచారు. 1886లో బ్రాడ్లా మనస్సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశాడు. దేవుడి మీద ప్రమాణం చేయాల్సిన అవసరం తప్పనిసరి కాదని బ్రిటీషు పార్లమెంటు నిబంధనల్లో మార్పు చేసుకుంది. రెండేళ్ళ తర్వాత 1888లో అది చట్టమైంది. మరోవైపు అప్పుడు బలంగా ఉన్న కేథలిక్‌ ఆంగ్లికన్‌ చర్చ్‌లు బ్రాడ్లాకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. ఫలితంగా ఆయనకు పార్లమెంట్‌లో చివరి వరసలో చివరి సీటు కేటాయించారు.
సంకుచిత బుద్ధితో ఎంత వివక్ష చూపినా ఆయన మాత్రం చెదరలేదు. ఆ చివరి సీటు నుండే పదునైన తన ఉపన్యాసాలతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. మౌలిక సమస్యల్ని లేవనెత్తి విశేష ఖ్యాతినార్జించాడు. చార్లెస్‌ బ్రాడ్లా యు.కె., లండన్‌ తూర్పు ప్రాంతంలోని హక్స్‌టన్‌లో జన్మించాడు. 26 సెప్టెంబరు 1833 నుండి 30 జనవరి 1891 మధ్యకాలంలో జీవించాడు. తండ్రి క్లర్కుగా పనిచేసే ఆఫీసులోనే బాల్యంలో బ్రాడ్లా కొంతకాలం ఆఫీసు బాయ్‌గా పనిచేశాడు. తండ్రితో మతపరమైన అభిప్రాయ భేదాల వల్ల 1849లో ఇల్లు వదిలేసి వెళ్ళాడు. తర్వాత సండే స్కూలులో ఉపాధ్యాయుడయ్యాడు. చర్చ్‌లోని నిబంధనలతో విభేదించాడు. వాటిని విమర్శిస్తూ ఉంటే ఓ మతాధికారి గమనించాడు. హేతువాదం బోధిస్తున్నాడన్న నెపంతో ఉద్యోగంలోంచి తీసేసారు. తాత్కాలికంగా జైలుశిక్ష అనుభవించాడు. జరిమానా చెల్లించాడు. అయినా వెనక్కి తగ్గలేదు.
హేతువాద భావాలు ఆయన్ని నిలకడగా ఉండనివ్వలేదు. ఆయనలోని ప్రతిభను, వాదనా పటిమను ఎలిజా షార్స్‌లస్‌ కార్లెలి అనే మహిళ గుర్తించి ఆశ్రయమిచ్చింది. ఆమె విధవరాలు, ప్రఖ్యాతుడైన రిచర్డ్‌ కార్లెలి భార్య. ఇది కారణాల్ని అన్వేషించుకునే యుగం అనే భావంతో థామస్‌ పైనీ రాసిన ‘‘ద ఏజ్‌ ఆఫ్‌ రీజన్‌’’ను ప్రచురించి ఫలితంగా జైలుకు వెళ్ళి వచ్చిన మహిళ. ఆ పెద్దావిడ యువకుడైన బ్రాడ్లాను జార్జ్‌ హోలియోక్‌ అనే హేతువాద కార్యకర్తకు పరిచయం చేసింది. అతను బ్రాడ్లా పబ్లిక్‌ లెక్చర్‌ ఏర్పాటు చేశాడు. అంతే చార్లెస్‌ బ్రాడ్లా ఉపన్యాస పరంపర మహోధృతంగా సాగిపోయింది. భాష మీద మంచి పట్టు ఉండడం, విషయం సరళంగా చెపుతూనే ఆలోచింపజేయడం వల్ల, ఆనాటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆయన చెప్పేదాంట్లో ఏదో ఉంటుందని జాగ్రత్తగా వినేవారు. విభేదించేవారు సైతం వింటున్నంతసేపు తలలూపే పరిస్థితి కల్పించే వాడు బ్రాడ్లా. 17వ యేటనే ‘క్రిస్టియన్‌ మతంపై కొన్ని మాటలు’ శీర్షికతో ఒక ఘాటైన కరపత్రం ప్రచురించాడు.
స్వేచ్ఛాలోచనాపరుల అండదండలు అనూ హ్యంగా లభించాయి. మధ్యకాలంలో ఒక సొలిసిటర్‌ దగ్గర క్లర్కుగా చేరాడు. అప్పుడే న్యాయశాస్త్రంలోని మెళుకువల్ని అధ్యయనం చేశాడు. అనర్గళమైన భాషా పటిమతో న్యాయశాస్త్ర విషయాల్ని విశ్లేషిస్తూ ఉంటే, బాగా పేరున్న న్యాయ కోవిదులే ఆశ్చర్యపోయేవారు. ఒకవైపు పబ్లిక్‌ స్పీకర్‌గా మరోవైపు కరపత్ర రచ యితగా ప్రసిద్ధుడయ్యాడు. ‘ఐకనోక్లాస్ప్‌’ అనే మారు పేరుతో రచనలు ప్రకటి స్తుండేవాడు. ఈ సమాజం మతాలకు ఊడిగం చేస్తూ ఉండకుండా, ప్రజాస్వామ్య విలువ లతో ఒక కొత్త రూపు సంతరించుకోవాలని బ్రాడ్లా నిరంతరం తపన పడుతుండే వారు. ఫలితంగా ఉదారవాద, విప్లవ, సంస్కరణవాద సంఘాలకు దగ్గరయ్యాడు.
రాజకీయంగా లిబరల్‌ పార్టీకే సన్నిహితుడయ్యాడు. లండన్‌ సెక్యులర్‌ సొసయిటీకి అధ్యక్షుడయ్యాడు. సెక్యులరిస్ట్‌ వార్తాపత్రిక ‘నేషనల్‌ రిఫార్మర్‌’కు సంపాదకు డయ్యాడు. 1866లో నేషనల్‌ సెక్యులర్‌ సొసయిటిని స్థాపించాడు. అప్పుడే అనిబిసెంట్‌ ఉపాధ్యక్షురాలిగా పూర్తి సహకారం అందించింది. బ్రాడ్లా ధాటికి తట్టుకోలేక బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయన వార్తా పత్రికపై, రాజకీయ కార్యకలాపాలపై ఎన్నో ఆంక్షలు విధించింది. కోర్టుకీడ్చింది. అయినా బ్రాడ్లా సంయమనం కోల్పోలేదు. పైగా కుటుంబ నియంత్రణ తక్షణ కర్తవ్యమని కరపత్రాలు ప్రచు రించాడు. దేవుడిస్తున్న బిడ్డల్ని కాదన్నాడన్న నేరంపై బ్రాడ్లాను ప్రభుత్వం జైలుకు పంపింది. జరిమానా విధించింది. చార్లెస్‌ బ్రాడ్లా 1855 జూన్‌ 5న సుసన్నా లాంబ్‌ హూపర్‌ను పెండ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు.
అందులో కూతురు హైపాటియా బ్రాడ్లా బోనర్‌ (18581935) ఆయన రెండో సంతానం. రచయిత్రి, హేతువాది తండ్రికి నిజమైన వారసురాలనిపించుకుంది. తండ్రి డైరీల్ని, పుస్తకాల్ని భద్రపర్చి ఆయన జీవిత చరిత్ర రాసి ప్రచురించింది (ఎ ప్లీఫర్‌ ఎథీయిజం1877). తండ్రి స్థాపించిన నేషనల్‌ సెక్యులర్‌ సొసయిటీని సమర్థ వంతంగా కొనసాగించింది. ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారతీయుల పక్షాన బ్రాడ్లా బ్రిటన్‌ పార్లమెంట్‌లో అనేకసార్లు ప్రసంగించాడు! 1889లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ జాతీయ సభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
భారతీయులకు ఆత్మీయుడయ్యాడు. ఆయన మరణం భారతీయుల్ని దుఃఖంలో ముంచింది. 1900 సంవత్సరంలో ఆయన స్మారక భవనం నిర్మితమై ఒక అర్థ శతాబ్దం పాటు అనేక కార్యక్రమాలకు కేంద్రంగా విలసిల్లింది. తన హేతువాద భావాల కోసం రాజకీయాల్ని ఢీకొని, పార్లమెంట్‌ను, సమాజాన్ని, వ్యవస్థల్ని ఢీకొని సమున్నతంగా నిలబడగలగడం చార్లెస్‌ బ్రాడ్లా వ్యక్తిత్వంలోని గొప్పతనం! తమ వాదనలో నిజం, నిజాయితీ ఉన్నవారు ఎవరికీ, దేనికీ తలవంచరు!
వ్యాస రచయిత: డాక్టర్‌ దేవరాజు మహారాజు
( సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్)

Leave a Reply