Suryaa.co.in

Editorial

‘ఉక్కు’పై బీఆర్‌ఎస్ వ్యూహం తుక్కు !

– బీఆర్‌ఎస్ పబ్లిసిటీ బూమెరాంగ్
– విశాఖ స్టీల్‌పై అడ్డం తిరిగిన కేసీఆర్ వ్యూహం
– ప్రైవేటీకరణ చేయడం లేదన్న కేంద్ర సహాయమంత్రి
– అంతకుముందు అది తమ ఘనతేనని ప్రచారం చేసుకున్న బీఆర్‌ఎస్
– కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చిందని మంత్రుల ప్రకటన
– హైదరాబాద్‌లో మంత్రుల సంబురాలు
– ఇంతలోనే ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్రం
– దానితో చప్పుడు చేయని బీఆర్‌ఎస్
– ఫలించని ‘మీడియా సహకారం’
– కొత్తగా తెరపైకి విశాఖ స్టీల్‌కు వ్యతిరేకంగా నాడు కేసీఆర్ చేసిన ప్రకటన
– విశాఖకు బయ్యారం గనులు వద్దని పార్లమెంటులో అడ్డుకున్న కేసీఆర్
– ఇప్పుడు బీజేపీ చేతిలో అప్పటి కేసీఆర్ మాటల అస్త్రం
– బిడ్డింగులో తెలంగాణ సర్కారుకు వచ్చే లాభమేమిటన్న సందేహం
– బిడ్డింగుకు ఐదురోజుల గడువు కోరిన సింగరేణి
– పరువు పోయిన బీఆర్‌ఎస్
– విశాఖలో మళ్లీ ప్రైవేటు ‘ఉక్కు’పోత
( మార్తి సుబ్రహ్మణ్యం)

తస్సాదియ్యా.. తుస్సుమంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ తమ దెబ్బకే నిలిచిపోయిందని, భూమి-ఆకాశాలను ఏకం చేసిన బీఆర్‌ఎస్..తర్వాత జరిగిన పరిణామాలపై చడీ చప్పుడు లేకుండా పోయింది. కేసీఆర్‌ను విశాఖకు తీసుకువచ్చి విజయోత్సవాలు నిర్వహించాలని, ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌లో ఇప్పుడు ఆ ముచ్చటనే లేదు. అధినేత చంద్రశేఖరుడిలోనూ మాట లేదు ముచ్చటా లేదు. ‘ కేసీఆర్‌తో అట్లుంటద’ని ఒకరు, ‘కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింద’ని మరొకరు చేసిన ‘ఒక్కరోజు హడావిడి’, మంత్రం వేసినట్లు మాయమయింది. బిడ్డింగ్ వేస్తామన్న సింగరేణి.. తమకు 5 రోజుల గడువు కావాలని కోరింది. ఫలితంగా విశాఖలో మళ్లీ ‘ఉక్కుపోత’ యధావిథిగా కొనసాగుతోంది. ఇదీ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉద్యమంలో ‘మెరిసి మాయమైన’ ఓ బీఆర్‌ఎస్ మెరుపు.

విశాఖ స్టీల్‌ని తెలంగాణ సర్కారు కొనేస్తుందట. తద్వారా మోదీ సర్కారుకు కేసీఆర్ సర్కారు ఝలక్ ఇచ్చిందట. కేసీఆర్ సర్కారు విశాఖ స్టీల్‌ను కొంటుందని తెలియగానే, మోదీ సర్కారు దారికొచ్చిందట. దానితో ప్రైవేటీకరణ ఆపివేసిందని కే ంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి ప్రకటించారట.

దానితో.. చూశారా.. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చిందని బీఆర్‌ఎస్ సంబురాలు. కాసేపటికే.. విశాఖ స్టీల్‌ను బరాబర్ ప్రైవేటీకరిస్తాం. అది కేంద్ర క్యాబినెట్ నిర్ణయమంటూ కేంద్ర ప్రభుత్వ ప్రకటన. దానితో బీఆర్‌ఎస్‌లో చడీ చప్పుడు లేదు. తోట నుంచి కేటీఆర్ వరకూ మాట ముచ్చటే లేదు. మునుపటి సంబురాలు లేవు. బీఆర్‌ఎస్ విజయటపాసులు లేవు. అంతా గప్‌చుప్.

అసలు విశాఖ స్టీల్‌కు ఏమైంది? బీఆర్‌ఎస్ ప్రచారం చేసినట్లు ప్రైవేటీకరణ నిలిచిందా? కేంద్ర తాజా ప్రకటనతో బీఆర్‌ఎస్ ఇమేజ్ పెరిగిందా? డామేజీ అయిందా? ఈ అమ్మకాల అంకంలో విజేతలెవరు? పరాజితులెవరు? గతంలో విశాఖ స్టీల్‌కు బయ్యారం బొగ్గు గనుల కేటాయింపును అడ్డుకున్న కేసీఆర్.. ఇప్పుడు విశాఖ స్టీల్‌లో బిడ్డింగ్ వేస్తే దానిని ఏపీ ప్రజలు నమ్ముతారా? అసలు అప్పుడే కేసీఆర్ అడ్డుపడకుండా ఉంటే, బయ్యారం గనులు విశాఖ స్టీల్‌కు కేటాయించేవారు కదా? ఇవీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని తెగనమ్ముతున్నారన్న ప్రచారం నేపథ్యంలో, ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు తెలంగాణ సర్కారు రంగంలోకి దిగి, ఏకంగా స్టీల్ ఫ్యాక్టరీనే మొత్తం కొనేస్తుందన్న విస్తృత ప్రచారానికి బీఆర్‌ఎస్ వర్గాలు తెరలేపాయి. అందులో నిజమెంత? అబద్ధమెంత? అసలు స్టీల్ ఫ్యాక్టరీ కొనుక్కుని తెలంగాణ సర్కారు ఏం చేసుకుంటుంది? దానిని కొంటుందనుకుంటున్న సింగరేణికి ఉన్న, ఆర్ధిక సత్తా ఎంత? దానికి అంత సీనుందా?.. ఇలాంటి కీలక అంశాలను చర్చించకుండా ఒక వర్గానికి చెందిన మీడియా కూడా.. బీఆర్‌ఎస్‌కు మైలేజీ తెచ్చి, ఏపీలో దానిని హీరోగా చూపే శ్రమదానానికి తెరలేపాయి.

విశాఖ వచ్చిన కేంద్ర ఉక్కు గనుల సహాయమంత్రి.. ఇప్పట్లో విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించే యోచన లేదన్న ఒక్క వ్యాఖ్య పట్టుకుని, బీఆర్‌ఎస్ వర్గాలు భూమి-ఆకాశాన్ని ఏకం చేస్తూ, సంబురాలు చేసుకున్నాయి. ఇది కేసీఆర్ ఘనతేనని కీర్తికిరీటాలు అద్దాయి. కానీ.. మరుసటి రోజునే కేంద్రం రంగంలోకి దిగి, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఖాయమని, ఆ మేరకు క్యాబినెట్ తీర్మానం కూడా అయిపోయిందని కుండబద్దలు కొట్టింది. దానితో ఎక్కడివారక్కడ గప్‌చుప్.

బీఆర్‌ఎస్‌లో ముందురోజు నాటి సంబురాలు లేవు. కేసీఆర్‌కు అద్దిన కీర్తి కిరీటాలూ లేవు. కేసీఆర్‌ను విశాఖకు తీసుకురావాలని, అక్కడి ప్రజలు అడుగుతున్నారన్న తోట చంద్రశేఖర్ అయితే పత్తా లేరు. ఆరకంగా విశాఖ విజయంతో ఉత్తరాంధ్రలో పాగా వేసి, వచ్చే ఎన్నికల్లో బోణీ కొడదామన్న బీఆర్‌ఎస్ పథకం అడ్డం తిరిగినట్టయింది.

అసలు విశాఖ స్టీల్‌ను కొనేంత ఆర్ధిక పరపతి సింగరేణికి ఉందా? అన్నది ప్రశ్న. బిడ్డింగు వెళ్లేందుకు విశాఖ స్టీల్‌ను పరిశీలించిన సింగరేణి బృందానికి ఏ అర్ధమయిందో తెలియదు గానీ.. విశాఖ స్టీల్‌ను తన సిగలో తగిలించుకోవడం వల్ల, వచ్చే లాభమేమిటన్నది మాత్రం బాగానే అర్ధమయి ఉండాలి. సింగరేణి బొగ్గు థర్మల్ పవర్ ఉత్పత్తికే సరిపోతుంది. అది విశాఖ ఉక్కు అవసరాలను 15 శాతం మాత్రమే తీరుస్తుందన్నది అధికారుల మాట. మరి అది విశాఖ ఉక్కుకు ఎలా ఉపయోగం?

నిధులు లేక గనుల వేలంలోనే పాల్గొనలేక చతికిలపడిన సింగరేణికి, తెలంగాణ విద్యుత్ సంస్థలు 14 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ ప్లాంట్ల విస్తరణ కోసం అప్పులవేటలో ఉన్న సింగరేణి, ఇటీవలి కాలంలో ఉద్యోగుల నెల జీతాలకే అప్పులు చేయాల్సి వస్తోంది. విశాఖకు పెట్టే మూలధనం లేదా ముడిపదార్ధాలకు బదులుగా.. విశాఖ స్టీల్ యాజమాన్యం సింగరేణికి స్టీల్ ఇస్తుంది. ఆ స్టీల్‌ను సింగరేణి ఏం చేసుకుంటుంది? మరి తనకే దిక్కులేని సింగరేణి.. విశాఖలో బిడ్ వేసి, చేసేదేమిటన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

అసలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం.. ప్రస్తుత తన ప్లాంటు నిర్వహణకు మూలధనం లేదా ముడిపదార్ధాలు సమకూర్చే సంస్థల కోసమే ఈఓఐలను ఆహ్వానించింది. ఈ క్రమంలో సింగరేణి సామర్థ్యం పరిశీలిస్తే.. అది సరఫరా చేసే బొగ్గు థర్మల్ విద్యుత్ కేందాల్లో, బాయిలర్లను మండించేందుకు మాత్రమే పనికొస్తుంది. అది విశాఖ అవసరాల వాటా 15 శాతం మాత్రమే. మరి మిగిలిన 85 శాతం సంగతేమిటి? అంటే ఆ 85 శాతం సింగరేణి, డబ్బురూపంలో సమకూర్చి పెట్టాలన్న మాట. ఈఓఐ నిబంధనలు పరిశీలిస్తే.. విశాఖ స్టీల్‌కు 5 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అవసరం. సింగరేణి ఉన్న ఆర్ధిక సంక్షోభంలో, అంత డబ్బు సమకూర్చడం సాధ్యమేనా అన్నది ప్రశ్న.

ఉద్యోగుల నెలజీతాలకే కిందామీద పడుతున్న సింగరేణి.. బొగ్గు గనుల్లో పాల్గొనే ఆర్ధిక స్తోమత కూడా లేని సింగరేణి.. 85 శాతం డబ్బును సమకూర్చడం అసాధ్యమని, ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అసలు ముందు సింగరేణి.. తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రావలసిన, ఆ 14 వేల కోట్లరూపాయలు రాబట్టుకునే పనిపై దృష్టి సారించి, ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిదన్న సూచన వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలో విశాఖ స్టీల్ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధపడటం ద్వారా… ఏపీ ప్రజల మనసు గెలవాలనుకున్న కేసీఆర్ వ్యూహం కూడా, బెడిసికొట్టే ప్రమాదం కనిపిస్తోంది. మరో వారం రోజులు బిడ్డింగ్ గడువు పెంచాలన్న సింగరేణి అభ్యర్ధనను స్టీల్ యాజమాన్యం అంగీకరించింది. ఈ నేపథ్యంలో… గతంలో ఇదే విశాఖ స్టీల్‌కు బయ్యారం గనులు కేటాయించేందుకు, పార్లమెంట్‌లో కేసీఆర్ అడ్డుపడిన వైనం, ఇప్పుడు బీజేపీ మళ్లీ చర్చల్లోకి తీసుకురావడం ప్రస్తావనార్హం. ఇది సహజంగానే కేసీఆర్‌కు నైతిక సంకటంలా పరిణమించింది.

కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కుకు బయ్యారం గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ఆ మేరకు పార్లమెంటులో బిల్లు పెట్టిన కేంద్రంపై, ఎంపీగా ఉన్న కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బొగ్గును ఆంధ్రాకు దోచిపెడతారా? మేం ఒప్పుకోమని అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

గతంలో బయ్యారం బొగ్గు గనులు విశాఖ స్టీల్‌కు కేటాయించవద్దని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు అదే విశాఖ స్టీల్‌పై ప్రేమ చూపించడం విచిత్రంగా ఉందని, ఏపీ బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు విమర్శించారు. అసలు కేసీఆర్ ఆనాడు పార్లమెంటులో అడ్డుపడకపోతే, విశాఖ స్టీల్‌కు బయ్యారం గనులు ఎప్పుడో కేటాయించేవారని గుర్తు చేశారు. ఆరకంగా విశాఖ స్టీల్‌కు ద్రోహం చేసిన కేసీఆర్, ఇప్పుడు అదే విశాఖ స్టీల్, ఆంధ్రావారిపై మొసలికన్నీరు కారిస్తే నమ్మేవారెవరూ వేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ముందు తెలంగాణలో దశాబ్దాల కింద మూతపడ్డ కంపెనీలను తెరిపించి, మీ తెలివితేటలు అక్కడ ప్రదర్శించండి’ అని రమేష్‌నాయుడు చురకలు అంటించారు.

LEAVE A RESPONSE