– అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
విజయవాడ: బుడమేరుకు పూర్తిస్థాయిలో గండ్లు పూడ్చివేత ఫలితంగా లీకేజీ తగ్గింది. బుడమేరు కు వస్తున్న వరద ఉద్ధృతిపై ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతం అయ్యేలా లోకేష్ చర్యలు చేపట్టారు. దీంతో గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుండి 200 క్యూసెక్కుల కు సీపేజ్ లీకేజీ తగ్గింది.
జియో మెంబ్రేన్ షీట్ వినియోగం
సంపూర్ణంగా లీకేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు జియో మెంబ్రేన్ షీట్ వినియోగిస్తున్నారు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో లీకేజీని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. బుడమేరకు వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్టఎత్తు పెంచే పనులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే గండ్లు పడిన చోట 5.7 మీటర్ల ఎత్తు పెంచారు. మరో 0.3 మీటర్ల ఎత్తు పెంచితే ప్రస్తుత కట్ట స్థాయికి పనులు పూర్తవుతాయి. ఎప్పటికప్పుడు బుడమేరు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులతో లోకేష్ సంప్రదిస్తున్నారు. మరోపక్క వరద బాధితులకు అందుతున్న సహాయం, నష్ట పరిహార అంచనా పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇతర శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నష్టపరిహార అంచనా పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 36 మంది ప్రజాప్రతినిధులను నష్ట అంచనా పర్యవేక్షణకు నియమించారు.