– ‘ఇరవై సూత్రాల’ చైర్మన్ లంకా దినకర్
విజయవాడ : ఇది వికసిత భారత్ మోడీ ౩.0… 50 .65 లక్షల కోట్లు బడ్జెట్.. దేశ సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే మోడీ మార్క్.. పేద, మహిళ, మధ్య తరగతి బడ్జెట్. వ్యక్తిగత ఆదాయం పన్ను 12 లక్షల వరకు మినహాయింపు, ఉద్యోగులకు 75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకొని 12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు…. వీటి వల్ల సుమారు లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వానికి నష్టమని ‘ఇరవై సూత్రాల’ చైర్మన్ లంకా దినకర్ అభిప్రాయపడ్డారు.
ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బడ్జెట్‌పై ఆయన శనివారం విలేఖర్లతో మాట్లాడారు. రెండు స్వయం నివాస గృహాలు వరకు ఆదాయపన్ను మినహాయింపు, 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన డ్యూటీ మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయమన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
మధ్యతరగతి వర్గాల వస్తు, సేవల వినియోగం వృద్ధి రేటు పెరిగే అవకాశం. ఈ బడ్జెట్ గురజాడ అప్పారావు స్ఫూర్తి. ” దేశమంటే మట్టి కాదోయ్ – దేశమంటే మనుషులోయి ” ప్రతిబింబిస్తోంది. అంత్యోదయ స్ఫూర్తితో రూపొందించిన వికసిత భారత్ బడ్జెట్. అతి ఎక్కువసార్లు వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిర్మల సీతారామన్ రికార్డ్ సృష్టించారు. భారత నారిశక్తిని చూపారు. 10.18 లక్షల కోట్ల మూలధన వ్యయంతో ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఊతం ఇస్తుంది.
రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలు 1.50 లక్షల కోట్లు కేటాయించడం శుభపరిణామం. రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని 25 లక్షల కోట్లు మూలధన వ్యయం చేసే ప్రయత్నం కనబడుతుంది. పట్టణాల సమస్యల నుండి అభివృద్ధి కోసం 1 లక్ష కోట్లు, అమృత్ 1 .0 అమృత్ 2.0 లో ఇచ్చే నిధులతో పట్టణాల మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం. గ్రామాలకు కుళాయిలు ద్వారా సురక్షిత మంచినీరు కోసం జల్ జీవన్ మిషన్ 2028 వరకు పొడిగింపు ఆహ్వానించ తగ్గ అంశం.
అమరావతి కోసం 15 వేల కోట్లు, పోలవరం నిర్మాణం కోసం 12,157 కోట్లు గత బడ్జెట్ లో ప్రకటించిన నిధులు, ఖర్చు ఆధారితంగా ఈ సంవత్సరం విడుదల జరుగుతాయి. ఈ బడ్జెట్ లో 5 ,936 కోట్లు కేటాయించడంపైన ప్రధాన మంత్రి మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి కృతఙ్ఞతలు. బడ్జెట్ రాకముందే విశాఖ ఉక్కు పరిశ్రమలు ఆదుకోవడానికి 11,400 కోట్లు ప్యాకేజి ప్రకటించడం, 2 లక్షల కోట్ల విలువైన ఎన్ టీ పీ సి సంస్థల వారి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన, విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులు ప్రారంభం జరగడం విశేషం.