– రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, కొదురుపాక గ్రామంలో తన అమ్మమ్మ-తాతయ్య కీ.శే. జోగినిపల్లి కేశవరావు
– లక్ష్మీబాయి స్మారకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈ స్కూల్ ను ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా రాలేదు. మా అమ్మమ్మ, తాతల మనవడిగా ఇక్కడికి వచ్చాను. ఈ ఊరితో నాకు ఎంతో అనుబంధం, జ్ఞాపకాలు ఉన్నాయి.
కొదురుపాక గ్రామంలో రాజకీయాలకు అతీతంగా గుడిని కూడా పూర్తిచేశాం. మిడ్ మానేరులో కొదురుపాక గ్రామం ముంపునకు గురికావటం అందరి కన్నా ఎక్కువగా నన్ను బాధకు గురిచేసింది. మా నానమ్మ గారి ఊరు అప్పర్ మానేరు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైంది.
లోయర్ మానేరు డ్యామ్ నిర్మాణంలో మా ఇంకో అమ్మమ్మ గారి గ్రామం ముంపునకు గురైంది. మూడు డ్యామ్ లలో మా కుటుంబానికి సంబంధించిన ఊర్లు ముంపునకు గురయ్యాయి. నిర్వాసితుల బాధలు నాకు తెలుసు. మా ప్రభుత్వం దాదాపు అందరికీ న్యాయం చేసింది. ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి వారికి అండగా ఉంటాం.
మా అమ్మమ్మ, తాత గారు ఎక్కడున్న సరే ఇవాళ చాలా సంతోషంగా ఉండి ఉంటారు. కొదురుపాక మనవడిగా ఈ గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తూనే ఉంటా.