– ప్రజా సంక్షేమాన్ని గాలికివదలి మద్యం స్క్యామ్ లో ఇరుక్కున్న సీఎం భార్యను రక్షిస్తారా!
– పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కొమ్ముకాయడం మహిళా కమిషన్ కు మంచిదికాదని గ్రహించాలి
– తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
మహిళా ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్ పై ఎంక్వైరీ చేసే దమ్ముఉందా? అని డీజీపీని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….
‘ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డిని సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని వాళ్ల మీద చర్యలు తీసుకోమని డీజీపీకి ఫిర్యాదు ఇవ్వడం తన స్థాయిని తగ్గించుకోవడమే. ఏపీ మహిళా కమీషన్ కు సర్వాధికారాలు ఉన్నా మోకరిల్లడమేంటి? మహిళల తరపున నిలబడి పోరాటం చేయడంలో ఏపీ మహిళా కమీషన్ దిట్ట అని అనుకోవడం శుద్ధ పొరపాటు. ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిజిపిని కలుస్తున్నారని తెలిసి మహిళల సమస్యలు వివరిస్తారని అందరూ ఆశించారు. ఆ ఆశ నిరాశే అయింది.
వైసీపీకి చెందిన ఓ కార్యకర్త రెండవ సారి 6 సంవత్సరాల చిన్న బాలిక పై అఘాయిత్యానికి పాల్పడటం జరిగింది. ఈ సమస్యపై డీజీపీని కలిశారేమో అనుకుని భ్రమపడ్డారు. ప్రస్తుతం ఏపీలో నేషనల్ క్రైం రిపోర్టు ప్రకారం మహిళల పై ఈ ఒక్క సంవత్సరంలోనే 17 వేలకు పైగా అఘాయిత్యాలు, మానభంగాలు జరిగాయి. వీటన్నింటి మీద చర్చ జరపడానికి డీజీపీని కలుస్తున్నారేమో అనుకుని మహిళలు మోసపోయారు. ఇదంతా అపోహ ని తరువాత తెలిసింది.
వైసీపీ శాశ్వత అధ్యుక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సతీమణి వైయస్.భారతి రెడ్డిని సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని వాళ్ల మీద చర్యలు తీసుకోమని ఫిర్యాదు ఇవ్వడానికి డీజీపీ కార్యాలయానికి వెళ్లారని తెలిసింది. మహిళా కమీషన్ అంటే మహిళల రక్షణార్ధం ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకు మధ్య వారధిగా ఉండి కౌన్సిలింగ్ లు ఇచ్చి మంచి నడవడికలో ఉండాల్సిన వ్యవస్ధ. మహిళా కమీషన్ ఒక అటానమస్ బాడి. అటానమస్ అనడానికి కారణం రాజకీయాలతో సంబంధం లేకుండా మహిళల రక్షణ కోసం పని చేసే అటానమస్ బాడి.
అటువంటి అటానమస్ బాడికి చైర్ పర్సన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ.. సిఎం సతీమణి రక్షణ కోసం డిజిపిని కలవడం ఆశ్చర్యం. వైసీపీ అధినేత భార్య ఒక్కరేనా ఆడవారు? ప్రతిపక్ష నేత భువనేశ్వరి ఆడవారు కాదా? వైయస్.భారతి రెడ్డి లేదా జగన్ రెడ్డి లు వెళ్లి మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేయలేదు. ఎవరి ఫిర్యాదు మేరకు వాసిరెడ్డి పద్మ సీఎం భార్యకు న్యాయం చేయమని డిజిపిని కోరారు? ఏదైనా కేసు విషయంలో ఎస్పీకి, డిజిపికి నోటిసు పంపించేంత సర్వాధికారాలు మహిళా కమీషన్ కు ఉంటాయి. అటువంటి చర్యలు ఏమి తీసుకోకపోగా స్వయంగా ఆమె వెళ్ళి సీఎం భార్యకు న్యాయం చేయమని డిజిపి ఆఫీసులో కూర్చోవడం సిగ్గుచేటు. దీన్ని బట్టి మహిళా కమీషన్ ఆశాఖను ఎలా నిర్వీర్యం చేస్తున్నారో అర్ధం అవుతుంది.
వైసీపీ అథినేత భార్య గురించి సాయంత్రం 6 గంటల సమయంలో డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి పద్మకు ప్రతిపక్ష పార్టీ నాయుకుడు భార్య ఆడదానిలా కనిపించలేదా? టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ, గౌతు శిరీష లను అనేక విధాలుగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారో వాసిరెడ్డి పద్మకు కనిపించలేదా? ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని దిశ పోలిస్టేషన్ లో ఫిర్యాదు చేస్తే నేటికి ఆ కేసుకు దిక్కులేదు. మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా ఉన్న వాసిరెడ్డి పద్మ సోషల్ మీడియాలో టీడీపీ మహిళలపై రెచ్చిపోతున్న వారి గురించి ఎందుకు స్పందించరు.
రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన మహిళా చైర్ పర్సన్ ఒక పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారు. వైసీపీపట్ల విధేయతగా ఉంటున్నారు అందుకే మీ పార్టీ అని అంటున్నాం. మీ పార్టీ వ్యక్తులు, మీ పార్టీ కండువా వేసుకొని, మీ పార్టీ ఆఫీసులో కూర్చొండి. ఆడవాళ్ల గురించి నోటికొచ్చినట్లు ఊరకుక్కలు మాట్లాడితే ఊరుకునేదిలేదు. వైసీపీ నాయకులు అనేకసార్లు అసభ్యకరంగా మాట్లాడితే వాళ్ల గురించి నేటికి డిజిపిని కలిసి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? యన్.టి.రామారావు కుమార్తె భువనేశ్వరి గురించి నిండు అసెంబ్లీలో ఒక ఊరకుక్క నోటికొచ్చినట్టు వాగారు. అప్పుడు వాసిరెడ్డి పద్మ నోరు ఏమైంది. ఫిర్యాదు చేయకపోగ కనీసం ఆ విషయాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతుంటే అతని మీద ఫిర్యాదు చేసే దమ్ము లేని వాసిరెడ్డి పద్మ భారతి రెడ్డి కోసం డిజిపికి ఫిర్యాదు చేస్తారా?
రమ్య అనే మహిళను పొడిచి చంపితే, అనూషని తొక్కి చంపితే, తేజస్విని గొంతు కోసి చంపితే, స్నేహలతని నడిరోడ్డు పై కాల్చి చంపితే మహిళా కమీషన్ ఏ మూలన కూర్చొంది? ఇన్ని దారుణాలు జరుగుతుంటే డిజిపి ఆఫీసు గుమ్మాన్ని మహిళా కమీషన్ ఎందుకు తొక్క లేకపోయింది. చిన్న చిన్న పిల్లల పై అఘాయిత్యాలు జరగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. విజయవాడలో వికలాంగురాలు పై మూడు రోజులు అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీద నోటిసులు పంపించడానికి వాసిరెడ్డి పద్యకు సర్వాధికారాలు ఉన్నాయి .
కానీ అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఏ ఒక్కరికి నోటిసు పంపించే పరిస్ధితి లేదు. ఇదేనా సమన్యాయం, రాజకీయాలకు అతీతంగా మాట్లాడటం అంటే ఇదేనా? పోలీసు శాఖపై గౌరవంతో టీడీపీ తరపున అనేకసార్లు, అనేక అన్యాయాలపై ఫిర్యాదు చేశాం. వాటికి ఇంతవరకు ఒక్కదానికి సమాధానం లేదు. ఢిల్లీలో రాష్ట్రపతి మహిళలు అపాయింట్ మెంట్ ఇస్తారు రాష్ట్ర మహిళలు డీజీపీ కార్యాలయానికి వెళ్లి అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వరు. కేవలం మహిళా కమిషన్ కే అపాయింట్ మెంట్ ఇస్తారు. సీఎం భార్యను సోషల్ మీడియాలో ఏదో మాట్లాడరని .. సీఎం మెప్పు కోసం, భారతీరెడ్డి రక్షణ కోసమే మహిళా కమిషన్, డీజీపీ కార్యాలయం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మహిళలు ఎవరు ఏమైనా ప్రభుత్వానికి సంబంధంలేదు.
గట్టిగా మాట్లాడితే వైసీపీ ఊరకుక్కలను బయటికి తెచ్చి మాపై మాట్లాడిస్తారు. కొడాలి నానీ నీచంగా మాట్లాడితే సుమోటోగా తీసుకొని… రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తే ఈరోజు వరకు ఒక్క చోట ఒక్క ఎఫ్ఐఆర్ ని నమోదు చేయలేదు. భారతీరెడ్డి ఏం తప్పుగా మాట్లాడారో, ఆమె ఏ స్క్యామ్ లో ఉన్నారో మా వద్ద వీడియోలు ఉన్నాయి. బయటపెడతాం. ఇంతమంది మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఎందుకు వాసిరెడ్డి పద్మ డీజీపీ ఆఫీసు గుమ్మం తొక్కలేదో తెలపాలి. మద్యం స్క్యామ్ లో ఇరుకున్న సీఎం భార్య భారతిని రక్షించడానికి రాష్ట్ర యంత్రాంగం తాపత్రయ పడుతోంది. కొందరు నీచులతో భువనేశ్వరి, బ్రాహ్మణి ల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నారు.
మేం ఊరుకునేదిలేదు. మహిళలను కించపరచి మాట్లాడేవారు పశువులకన్నా హీనులు. ఒకటిన్నర సంవత్సరాలు ఆగితే ఎవరి వెంట్రుకలు ఎవరు పీకుతారో జనాలే చెబుతారు. సీఎం, వైసీపీ నాయకులు రోడ్లమీదకు వస్తే తంతారని దాక్కొని, పరదాలు కట్టుకొని ఇరవై అడుగులకు ఇద్దరు పోలీసుల పహరా పెట్టి బయటికి వస్తున్నారు. గ్రామాల్లో రాబోయే కాలంలో వైసీపీ వాలంటీర్లు రోడ్లపైకి రాలేరు. మహిళలే రోడ్లపైకి రానీయకుండా చేయగల కాలం దగ్గర్లోనే ఉంది. దమ్మున్నొళ్లు వస్తే కలిసి డీజీపీ ఆఫీసుకు వెళ్లి అక్కడ చర్చ పెడదాం’ అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సవాల్ విసిరారు.