Suryaa.co.in

Telangana

కేంద్రమంత్రిగా ఉండి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా?

– చంద్రశేఖర్ రావు కంటే గొప్ప హిందువు ఎవరు లేరు
– ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమే
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 

ధరలను పెంచి పేద, మద్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపిన పాపం కేంద్రంలోని BJP ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అంబర్ నియోజకవర్గ పరిధిలోని బాగ్ అంబర్ పేట డివిజన్ BRS పార్టీ ఆత్మీయ సమావేశం క్రౌన్ ఫంక్షన్ హాల్ లో MLA కాలేరు వెంకటేష్ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఇంచార్జి దాసోజు శ్రవణ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, BC కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మహిళలు బోనాల తో, పోతురాజుల నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. BJP పార్టీ నుండి BRS పార్టీలో చేరిన పలువురికి మంత్రి పార్టీ కండువా లను కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ UPA ప్రభుత్వ హయాంలో 400 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధర BJP అధికారంలోకి వచ్చిన తర్వాత 1100 రూపాయలకు పైగా పెరిగిందని విమర్శించారు. నాడు 400 రూపాయలు ఉంటేనే గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి ఓటేయాలని చెప్పిన ప్రధాని మోడీ, 1100 రూపాయలకు పైగా గ్యాస్ ధర ఉందని, ఇప్పుడు ఎవరికీ దండం పెట్టాలో చెప్పాలని ప్రశ్నించారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగానే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద, మద్య తరగతి ప్రజలపై ఆర్ధికంగా ఎంతో పెనుభారం పడిందని అన్నారు.

అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల కోట్ల రూపాయల ఖర్చుతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలు అనేకం పరిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. అంబర్ పేట కు 15 సంవత్సరాలు MLA గా ఉండి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా 4 సంవత్సరాల నుండి కేంద్రమంత్రి గా ఉండి తనను ఓట్లేసి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులకోసం డిల్లీ నుండి ఎన్ని నిధులు తీసుకోచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి గా ఉన్నాడంటే అది అంబర్ పేట నియోజకవర్గ ప్రజల చలువేనని పేర్కొన్నారు. MLA గా ఓడినందు వల్లనే MP గా గెలిచి కేంద్రమంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తుచేశారు.

కాలేరు వెంకటేష్ MLA గా గెలిచిన తర్వాతనే అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్ వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజల సమస్యలను అనేకం పరిష్కారం అయ్యాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రణాలికాబద్దంగా అభివృద్ధి పనులతో కాలేరు వెంకటేష్ ముందుకు వెళుతున్నారని వివరించారు. అభివృద్ధి పనుల విషయంలో BJP నేతలు చర్చకు వచ్చే దమ్ముందా అని మంత్రి ప్రశ్నించారు. పని చేసే వారిని ఆదరించాలని, అప్పుడే అభివృద్ధి పనులు జరుగుతాయని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు.

BJP నేతలు కుల, మతాల పేరుతో ప్రజల మద్య విబేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నాలు చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంటే గొప్ప హిందువు ఎవరు లేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని, పండుగలను ప్రజలు ఎంతో సంతోషంగా గొప్పగా జరుపుకుంటున్నారని వివరించారు.

1200 కోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామీ ఆలయాన్ని ఎంతో గొప్పగా నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమే అని చెప్పారు. ఆసరా పెన్షన్ క్రింద వృద్దులకు 2016, వికలాంగులకు ౩౦16 రూపాయలు చొప్పున ప్రతినెల ఆర్ధిక సహాయం అందించి వారి గౌరవాన్ని మరింత పెంచిన ఘనత ముఖ్యమంత్రి KCR కే దక్కుతుందని చెప్పారు.

పేదింటి ఆడపడుచు పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యదావిధిగా కొనసాగాలంటే BRS పార్టీని ఆదరించాలని, రానున్న ఎన్నికలలో ప్రతిపక్షాలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE