-317 జీవో బాధితులకు న్యాయం చేయండి
-బదిలీలు, పదోన్నతుల కోసం ఒత్తిడి తెండి
-బండి సంజయ్ కు తపస్ వినతి
-ఉద్యోగుల పక్షాన పోరాడతామని భరోసా
-బీజేపీ అధికారంలోకి వస్తే ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని హామీ
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కోరారు. అందులో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ను రద్దు చేసేలా, వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టేలా, 317 జీవో బాధితులకు న్యాయం జరిగే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 30వ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను పాదయాత్ర శిబిరం వద్ద తపస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ సహా పలువురు రాష్ట్ర నాయకులు కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జూనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు, ఎంఈఓలు, డిప్యూటీ ఈవోలు, జీహెచ్ఎం, పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 తరువాత నుండి ఇప్పటి వరకు ఉద్యోగులకు బదిలీలు లేవని వాపోయారు. 317 జీవోతో అనేక మంది ఉపాధ్యాయులు నష్టపోయారని, స్పౌజ్ కేటగిరి కింద చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లేదని, పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిన జీవో అమలు కావడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు సైతం బండి సంజయ్ ను కలిసి సీపీఎస్ రద్దు కోసం పోరాడాలని కోరుతూ వినతి పత్రం అందించారు. వారి సమస్యలను సావధానంగా విన్న బండి సంజయ్ సీపీఎస్ రద్దు పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉద్యోగుల పక్షాన పోరాడతామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులతోపాటు 317 జీవో రద్దు కోసం ఇప్పటికే అనేక పోరాటాలు చేశామని, భవిష్యత్తులోనూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలు చేపడతామన్నారు. బీజేపీ అధికారంలోకొస్తే 317 జీవోను సవరించడంతోపాటు తక్షణమే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపడతామని హామీ ఇచ్చారు.