చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా?

-కొడుక్కి అబద్ధాలు, మోసాల్లో శిక్షణ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా?
– వారిని రాష్ట్ర ద్రోహులు అందామా.. దేశ ద్రోహులు అందామా?
– ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం
-పేదలను ఆదుకునేందుకు 32 పథకాలు
– వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి

తూ.గో.జిల్లా : మురమళ్ల: ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతాడని, కానీ, రాజకీయాల్లో 40ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకొనే చంద్రబాబునాయుడు మంగళగిరిలో ఓడిపోయిన సొంత పుత్రుడు..రెండు చోట్ల పోటీ చేసి, ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడిని నమ్ముకుని వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు సహా, మీడియా సంస్థలపైనా జగన్‌ తన అక్కసు వెళ్లగక్కారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. దుష్ట చతుష్టయం అంటూ, దేవుడే వాళ్లకు వైద్యం చేస్తాడంటూ తీవ్ర పదజాలంతో అసహనం వ్యక్తం చేశారు.

”ఈ ప్రాంతంలోనే మల్లాది సత్య లింగన్‌ నాయకర్‌ అనే ఒక మహానుభావుడు పుట్టాడు. ఆయన కూడా ఒక మత్స్యకారుడు. ఆ రోజుల్లో తాను చదువుకోలేకపోయాడు. సముద్రమంత కష్టాల్లో తన జీవితాన్ని ప్రారంభించి, అదే సముద్రాన్ని దాటి బర్మాకు చేరుకున్నారు. అక్కడ ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించి, అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. తన సొంత గడ్డ మీద మమకారంతో ఇక్కడ భూములు కొని, ఈ
jagan-fish1 ప్రాంతంలో మంచి జరగాలని ఒక ట్రస్టు పెట్టారు. ఆ ట్రస్టు ద్వారా దాదాపు 110 సంవత్సరాలుగా ఎన్నో వేలమంది పేదలకు మంచి చేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం జరిగిందంటే ఎంతోమందికి మేలు జరుగుతుంది. అటువంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి. దాని నుంచి ఇంకా మంచి చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. పేదలకు మనం ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకోవాలి. అలా లేనప్పుడు మంచి చేశామని చెప్పుకొనే అర్హత ఆ ప్రభుత్వానికి ఉండదు. పేదలకు అండగా ఉండేందుకు దాదాపు 32 పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మనది అని సగర్వంగా చెబుతున్నా”

”పాదయాత్ర సమయంలో మత్స్యకార కుటుంబాల సమస్యలు నేను విన్నాను. అలాంటి కుటుంబాలను ఆదుకునేందుకు నేను ఉన్నాను. అందుకే రూ.109కోట్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ మరే ప్రభుత్వం ఇంత గొప్ప సాయం అందించలేదు. ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ డ్రిల్లింగ్‌ చేస్తున్న సమయంలో 68 గ్రామాల్లో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు
jagan-fish3 నెలకు రూ.11,500 చొప్పున నాలుగు నెలల పాటు అందిస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితే వస్తే, వాళ్లు కనీసం పట్టించుకోలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు విడుదల చేశాం. చంద్రబాబు మొత్తం హయాంలో కేవలం రూ.104కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం. మత్స్యకారులకు రాయితీతో డీజిల్‌ అందిస్తున్నాం”

”ప్రభుత్వ పథకాల ద్వారా రూ.లక్షా 40వేల కోట్లు పేదలకు అందించాం. ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ‘మా చంద్రబాబు మంచి చేశాడు’ అని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి కూడా లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 95శాతం అమలు చేశాం. నిజాయతీ, నిబద్ధతతో మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ వద్దకే వస్తున్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఆ దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతోంది. ఈర్ష్య పుట్టుకొస్తోంది. ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా జగన్‌ అన్న వైద్యం చేయిస్తాడు కానీ, ఈర్ష్య, కడుపుమంటకు వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడు. పరీక్ష పేపర్లు వీళ్లే లీక్‌ చేయిస్తారు. లీక్‌ చేసిన వ్యక్తిని సమర్థించే ప్రతిపక్షాన్ని మీరు ఎక్కడైనా చూశారా? గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉంటూ ఉద్యోగులకు మంచి చేయాల్సింది పోయి, ఈఎస్‌ఐలో పౌడర్లు, స్నో, మందులు, టూత్‌పేస్ట్‌ల పేరిట డబ్బులు కొట్టేసిన ప్రతిపక్షాన్ని మీరెప్పుడైనా చూశారా?

కొడుక్కి అబద్ధాలు, మోసాల్లో శిక్షణ ఇస్తున్న చంద్రబాబులాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా? మంత్రిగా పనిచేసి, మంగళగిరిలో ఓడిపోయిన సొంత పుత్రుడు ఒకరు.. రెండు చోట్ల పోటీ చేసి, ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు. 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే రాజకీయనాయకుడు ఇలాంటి వారిని నమ్ముకుంటున్నారు. రాజకీయ నాయకుడు ప్రజలను నమ్ముకుంటారు. కానీ, వాళ్లను నమ్మకుండా సొంతపుత్రుడు, దత్తపుత్రుడును నమ్ముకుంటున్న వ్యక్తిని చూశారా? జగన్‌ ప్రభుత్వంలో మంచి జరుగుతుంటే రాబందులు చూసి తట్టుకోలేకపోతున్నాయి. అలాంటి వారిని ఏమనాలి? రాష్ట్ర ద్రోహులు అందామా.. దేశ ద్రోహులు అందామా? 27ఏళ్లు చంద్రబాబు అనే పెద్ద మనిషి కుప్పంకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏనాడూ అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన లేదు. ఈ రోజు మీ జగన్‌ మూడేళ్ల పరిపాలన చూసి, కుప్పంకు పరిగెత్తి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత ప్రభుత్వానికీ, ఈ ప్రభుత్వానికీ తేడా ప్రజలే గమనించాలి” అని సీఎం జగన్‌ అన్నారు.

Leave a Reply