Suryaa.co.in

Telangana

కులగణనను శాస్త్రీయంగా రీసర్వే చేపట్టాలి

– రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

హైదరాబాద్: తప్పులతడక సర్వేను బుట్టదాఖలు చేసి కులగణనలో ప్రజలందరిని భాగస్వాములను చేసి తాజాగా, శాస్త్రీయంగా రీసర్వే చేపట్టాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇటీవల జరిపించిన సర్వే,నిండు శాసనసభ సాక్షిగా వెల్లడించిన నివేదిక చిత్తు కాగితంతో సమానమన్నారు.

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం ఎంపీ రవిచంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రభుత్వం ఆషామాషీగా, తూతూమంత్రంగా సర్వే జరిపించిందని, చిత్తశుద్ధి లోపించిందన్న నిర్ణయానికి వచ్చిన బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు దానిని పూర్తిగా తిరస్కరించారన్నారు.రాష్ట్ర ఏర్పాటు జరిగిన తొలినాళ్లలోనే (2014 ఆగస్ట్ 17వతేదీన) మహానేత కేసీఆర్ గారు ఒక రోజులో జరిపించిన సమగ్ర కుటుంబ సర్వే (SKS)లో దేశవిదేశాల నుంచి వచ్చిన తెలంగాణ వాళ్లంతా పాల్గొన్న విషయాన్ని ఎంపీ రవిచంద్ర ఈ సందర్భంగా గుర్తు చేశారు.

SKS ప్రకారం బీసీల జనసంఖ్య కోటి 85లక్షల 61వేల 856 (1,85,61,856) కాగా (51%),10ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే కోటి 64లక్షల 9వేల 179 (1,64,09,179)(46.25%)అని పేర్కొనడం విడ్డూరంగా, బీసీ జనాభా 21లక్షల 52వేల 677 తగ్గినట్లు చూపడం అసంబద్ధంగా ఉందని ఎంపీ వద్దిరాజు తెలిపారు.

ప్రతి పదేళ్లకొకసారి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించే లెక్కల ప్రకారం జనాభా 13.5 శాతం పెరుగుతుందన్నారు.ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్లు 3 కోట్ల 35లక్షలు కాగా,18ఏళ్ల లోపు వాళ్లు 25% ఉంటారనే,3 కోట్ల 90 లక్షల మందికి పైగా ఉన్న ఆధార్ కార్డుల ప్రకారం జనాభా 4 కోట్ల 30 లక్షలకు మించుతుందన్నారు.

ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన సర్వేలో మొత్తం జనాభానే 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 (3,54,77,554)అని పేర్కొందని,ఇది SKS నివేదిక కంటే కూడా 9 లక్షల 18 వేల 242 (9,18,242) తక్కువ అని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ఈవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అణచివేసే, అన్యాయం చేయాలనే దురుద్దేశంతోనే సర్వే అశాస్త్రీయంగా జరిపించిందని ఆయన మండిపడ్డారు.సర్వేపై పాలకులు వితండవాదంతో కుల సంఘాలపై ఎదురుదాడికి దిగారని.. బీఆర్ఎస్,కుల సంఘాలు లెక్కలతో సహా అది బోగస్ అని నిరూపించడంతో,ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిగొచ్చిందన్నారు.

తిరిగి జరుపనున్న కులగణనను అందులో పాల్గొనని 3.1% మందికే పరిమితం చేయకుండా, ఎన్యూమరేటర్స్ ప్రతి ఇంటికి విధిగా వెళ్లి శాస్త్రీయ పద్ధతిలో మొత్తానికి మొత్తం చేపట్టాలని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.అర్థంపర్థం లేని కాలమ్స్,57 ప్రశ్నలతో ప్రజలను అయోమయానికి గురి చేయకుండా, సామాజిక వర్గం (కులం) తెలుసుకునేందుకు రెండు మూడు కాలమ్స్ తో సర్వేను సమగ్రంగా జరిపించాలని, వివరాలను చిత్తశుద్ధితో వెల్లడించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కోతి కిశోర్,వివేక్ రాజు,కొండపల్లి శ్రీనివాస్ యాదవ్,గోపగాని రఘు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE