– బ్లూనోటీస్ జారీ
– అరెస్ట్ తప్పదా?
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, హైకోర్టు న్యాయమూర్తులను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడు పంచ్ ప్రభాకర్‌కు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ప్రభాకర్ అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసింది. పంచ్ ప్రభాకర్‌పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ బ్లూ నోటీసును జారీ చేసింది. దీంతో అతి త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీ జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో ఐదుగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, దరిస కిషోర్ రెడ్డి, అజయ్ అమృత్‌లపై విడివిడిగా సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఆయన్ను పది రోజుల్లో అరెస్టు చేయాలని సీబీఐకి హైకోర్టు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆలోగా అరెస్టు చేయకపోతే.. విచారణ కోసం సీబీఐకి సంబంధంలేని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది. ఆ డెడ్‌లైడ్ ముగియక ముందే పంచ్ పడింది!. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన విమర్శ ఎప్పుడూ ఆహ్వానించదగిందేనని హైకోర్టు గత విచారణ సందర్భంగా పేర్కొంది.
‘అయితే న్యాయమూర్తులను దూషించడం, నిందలు వేయడం కొందరికి టైం పాస్‌గా మారింది. ఇలాంటి వ్యాఖ్యలను కట్టడి చేస్తే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. దేశంలో సీబీఐ ఉత్తమ దర్యాప్తు సంస్థగా పేరు తెచ్చుకుంది. కానీ ఈ కేసులో న్యాయస్థానం పలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేదు. అభ్యంతరకర పోస్టుల తొలగింపునకు ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి అధికారి పర్యవేక్షణ ఉండాలని భావిస్తున్నాం. కేసులో పురోగతి, భవిష్యత్‌లో తీసుకోబోయే చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయండి’ అని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది.