-దళిత ఎమ్మెల్యేలకే ట్రాన్స్ ఫర్లు.. నోరెత్తితే సీట్లు రద్దు
-ఈసీ కార్యాలయంలో డేటా చోరీపై సీబీఐ విచారణ జరపాలి
-ఊరూరా విధ్వంసమే రాష్ట్రంలో జగన్ మార్క్
-జె బ్రాండ్స్ తరిమేసి మద్యం ధరలు నియంత్రిస్తాం
-జగన్ కు పులివెందులలోనే దిక్కులేదు…కుప్పంలో వేలు పెడతాడా?
-జీడీ నెల్లూరు రా…కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు
జీడీనెల్లూరు :- పులివెందులలోనే జగన్ ఫ్యూజ్ కాలిపోయింది. వైసీపీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు ముక్కలవటం ఖాయం. చిత్తురు జిల్లాలో మీ మధ్యే పెరిగా..రాజకీయాల్లో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కిందంటే అది మీ వల్లే. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారిని, అవినీతికి పాల్పడే వారిని హెచ్చరిస్తున్నా..ఇక రెండు నెలలే మీ బాగోతం. తర్వాత మీ పరిస్ధితి ఏంటో ఆలోచించుకోండి.
నా చిన్నతనంలో గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. ఒక ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. సోలార్, గాలితో నేడు కరెంట్ ఉత్పత్తి అవుతోంది. నేడు డ్రైవర్ లెస్ కార్లొచ్చాయి. సంస్కరణల వల్ల సంపద పెరుగుతుంది. పెరిగిన సంపద పేదలకు అందాలి. పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా జీవిత లక్ష్యం. హైదరాబాద్ ను నాడు ఐటీ హబ్ గా అభివృద్ది చేశా. జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం. అందుకే రాతియుగం వైపు పోకుండా స్వర్ణయుగం వైపు రావాలని రా..కదలిరా అని పిలుపునిచ్చా.
వాలంటీర్లు ప్రజలకు సేవచేయాలి..వైసీపీకి సేవ చేస్తే వదిలిపెట్టం
ఓడిపోతాడని జగన్ రెడ్డి మానసిక రోగంతో బాధపడుతున్నారు. సిద్ధం అంటూ అవినీతి సొమ్ముతో పెద్దపెద్ద కటౌట్లు పెట్టాడు. కానీ జగన్ ని ఓడించి ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అని కటౌట్ చూసినప్పుడు ఉపాధి లేక వలసలు, పెరిగిన ధరలు, బడుగు బలహీనవర్గాలపై దాడులతో పాటు ప్రభుత్వం మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులన్నీ గుర్తుకు రావాలి. ఇతను మాకు వద్దు అని ఛీ కోట్టాలి. ఎన్నికల వరకు మీరంతా స్వర్ణయుగం కోసం కష్టపడండి. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అవ్వాలి. దానికి మీరు సిద్ధమా?
జగన్ ని నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకెళ్లక తప్పదు. టీడీపీ వస్తే వాలంటీర్లను తొలగిస్తామని జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే మేం వ్యతిరేకించం.. కానీ వైసీపీకి సేవ చేసేవారిని వదలిపెట్టం. వాలంటీర్లతో జగన్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. జగన్ వల్ల రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రతి ఇంటికి వెళ్లి మీరే వివరించాలి. మీరే నాకు స్టార్ క్యాంపెనయిర్లు. జగన్ మార్క్ అంటూ కొత్తగా ప్రచారం మెదలు పెట్టారు. టీడీపీ హయాంలో రూ.200 కరెంట్ బిల్లు వస్తే నేడు రూ.1000 వస్తోంది. ఇది జగన్ మార్క్.
టీడీపీ 5 ఏళ్లలో ఒక్కసారీ కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి జగన్ రెడ్డి ప్రజలపై రూ.64 వేల కోట్ల భారం మోపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తాం. రూ.60 ఉన్న మద్యం బాటిల్ ను జగన్ రూ.200లకు పెంచాడు. నాసిరకం బ్రాండ్లతో 30 లక్షల మందికి ఆరోగ్యం పాడై 30 వేల మంది చనిపోయినా జగన్ రెడ్డికి ధనదాహం తీరలేదు. రాబోయే రోజుల్లో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం విక్రయిస్తాం.
టీడీపీ హయాంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుతులతో 6 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. 11 డీఎస్సీలు నిర్వహించి 1.50 వేల మందికి టీచర్ ఉద్యోగాలిచ్చాం. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలి. నాడు ఉచితంగా ఇచ్చిన ఇసుక నేడు కిలోల లెక్కల కొనాల్సి వస్తోంది. నేడు ట్రాక్టర్ ఇసుక రూ.5 వేలు. ఈ డబ్బంతా ఎవరికి వెళ్తోంది? ఇసుక దొంగలు ఖబడ్దార్ జాగ్రత్త. ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజీ కట్టకపోవటం జగన్ మార్క్ టీడీపీ హయాంలో 25 వేల కి.మీ సీసీ రోడ్లు వేశాం, ఇది నా మార్క్. నేడు ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా? అన్ని రోడ్లు గుంతలు పెట్టడమే జగన్ మార్క్.
దళితులను చంపి డోర్ డెలివరీ చేయడమే జగన్ మార్క్
దళితుల్ని చంపి డోర్ డెలివరి చేయటమే జగన్ పాలన మార్క్, దళితుల్ని లోక్ సభ స్సీకర్ చేయటం టీడీపీ మార్క్. ప్రతి నెలా సక్రమంగా జీతాలివ్వలేకపోవటం జగన్ మార్క్, 43 శాతం పిట్ మెంట్ ఇవ్వటం టీడీపీ మార్క్. అన్ని వర్గాలకు అన్యాయం చేయటమే జగన్ పాలన మార్క్, అన్ని వర్గాలకు మేలు చేయటమే టీడీపీ మార్క్. ప్రభుత్వాలు ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావాలి, కానీ నేడు పాలకులే సమస్యగా మారారు.
ప్రభుత్వమే ప్రజల పట్ల శాపంగా మారింది. మద్యనిషేధం చేస్తేనే ఓట్లడగడుతా అన్నాడు చేశాడా? మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చారు. ఆడబిడ్డలు జగన్ కి ఓటేసే పరిస్థితి లేదు. తాను అర్జునుడినంటూ జగన్ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నాడు. ఆయన అర్జునుడు కాదు బస్మాసురుడు. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా ఈ బస్మాసురుడికి బుద్ధి చెప్పాలి. నవరత్నాల ద్వారా ఎవరి జీవితాల్లో అయినా మార్పు వచ్చిందా?
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఐదేళ్లయింది, ఎన్ని జ్యాబ్ క్యాలెండర్లు ఇచ్చాడు, ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు? టీడీపీ అధికారంలోకి రాగానే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. చిత్తూరు జిల్లాలో టీసీఎల్, హీరో, సెల్ కాన్, కార్బన్, డిక్సన్ వంటి వందలాది కంపెనీలు తెచ్చిన ఘనత టీడీపీదే. అన్ని కంపెనీలు తెస్తే…జగన్ రెడ్డి టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయాయి.
అమర్ రాజా బ్యాటరీస్ ని చిత్తురు జిల్లా నుంచి తరిమేశారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక గుంటూరు ఎంపీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? యువత 60 రోజులు సైకిలెక్కి టీడీపీ జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురండి. మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది.
ఉచితంగా యేడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు
ఆడబిడ్డలను అన్ని విధాల అభివృద్ధి చేసిన పార్టీ టీడీపీ. ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది మహిళలున్నా నెలకు రూ. 1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా…ఆంక్షలు లేకుండా మోసం చేయకుండా అందరికీ రూ.15 వేలు ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. నిత్యవసర సరుకుల ధరలు తగ్గిస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. సబ్సీడీకి పనిముట్లు, వ్యవసాయ పరికరాలు అందిస్తాం. వ్యవసాయాన్ని ఆధునీకరించి రైతుల్ని అన్ని విధాల ఆదుకుంటాం. బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరందిస్తాం. కేంద్రం ఇచ్చిన రూ.30 వేల కోట్లను ఉపయోగించుకోలేని అసమర్ధ ప్రభుత్వం వైసీపీ. వెంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తున్నారు. భక్తులకు నాణ్యమైన అన్నం అందించలేకపోతున్నారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయ పైరవీలకు వాడుకుంటున్నారు. వెంకటేశ్వరస్వామి అన్నీ చూస్తున్నాడు. తప్పు చేసిన వారిని తప్పక శిక్షిస్తాడు.
ఈసీ కార్యాలయంలో డేటా చోరీపై సీబీఐ విచారణ జరపాలి
ఐప్యాక్ ద్వారా ప్రజల ఓట్లు తొలగిస్తున్నారు. తిరుపతి ఈసీ కార్యాలయంలో డేటా చోరీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలి. ఎర్రచందనం స్మగ్లర్ కి చిత్తురు జిల్లాలో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో కానిస్టేబుల్ ని ఎర్రచందనం మాఫియా కారుతో గుద్ది చంపింది. పోలీసులకే రక్షణ కల్పించలేని వ్యవస్ధ ఎందుకు?
టీడీపీ ఐదేళ్లలో ఒక్క ఎర్రచందనం దుంగ స్మగ్లింగ్ కాకుండా కాపాడాం. నేడు మళ్లీ ఎర్రచందనం దొంగలు పడ్డారు. తమిళనాడు నుంచి తెస్తున్న రూ.50 కోట్లు దొంగలు ఎత్తుకెళ్లిపోతే దానిపై పోలీసు కంప్లైంట్ ఇస్తే అసలు విషయాలు బయటకొస్తాయన్న భయంతో తేలుకుట్టినా దొంగల్లా ఉండిపోయారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లలో అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ పాలనలో ప్రతి స్కీమ్, స్కామ్.
చిత్తూరు జిల్లాను దోచేసిన పాపాల పెద్దిరెడ్డి
పాపాల పెద్దిరెడ్డి అరాచకాలు పెరిగిపోయాయి. ఇసుక, మద్యం, గనులు, గ్రానైట్ అన్నీ దోచేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గుత్తేదారులు, స్మగ్లర్లంతా వైసీపీ నేతలే. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. శివశక్తి డెయిరీలో రైతులకు తక్కువ ధరకే పాలు పోయాలంట. పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాను దోచేశారు. మీ అక్రమాలన్నీ గుర్తుంచుకుంటా. అంగళ్లులో చేయనితప్పుకు 600 మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెడతారా? నేను తలచుకుంటే 6 వేల కేసులు పెట్టగలను నీ కథ తేలుస్తా. పులివెందుల పంచాయితీ నేడు బయటకొచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.42 వేల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. చనిపోయిన తండ్రిపైనే కేసు పెట్టాలని జగన్ అఫిడవిట్ వేశారు.
తాను జైలులో ఉన్నపుడు చెల్లి చేత పాదయాత్ర చేయించారు. అధికారంలోకి వచ్చాక గెంటేశారు. బాబాయిని చంపిన వ్యక్తి రోడ్లమీద తిరుగుతున్నాడు, కోడికత్తి శీను మాత్రం ఐదేళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. నేడు కుటుంబ కలహాలతో రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. ఆస్తుల పంపకం సరిగా జరగలేదని చెల్లి తిరగబడింది. అంతఃపుర రహస్యాలు వారే చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో ఢిల్లీకి రాయభారం నడిపి సోనియా గాంధీ కాళ్లు పట్టుకని బెయిల్ తెచ్చుకున్నాడు. కుటుంబ గొడవలను రాష్ట్ర వ్యవహారంగా మార్చారు. మీ బాబాయ్ ను మీరే చంపుకుని నాపై అపవాదు వేశారు.
నాపై అపవాదులు వేసి నిరూపణలో విఫలమయ్యారు. ఏ తప్పు చేయని పార్టీ టీడీపీ. ప్రపంచంలో తెలుగుజాతిని నెం.1 గా ఉండాలన్నదే నా ఆశయం. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నది ఎన్టీఆర్ ఆశయం. వీటికోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తా. రైతు కుటుంబంలో పుట్టిన నాకు రైతుల కష్టాలు తెలుసు. ఉమ్మడి ముఖ్యమంత్రిగా బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చా. నేడు మీ మద్య ఉన్న టీడీపీ ఇన్ చార్జ్ డా.ధామస్ బయెటెక్నాలజీ చదివి, 100 దేశాలు తిరిగి టెస్ట్ ట్యూబ్ పై పరిశోధనలు చేసి నిపుణుడిగా తయారయ్యాడు.
అందుకే పిలిచి ఇన్చార్జి భాద్యతలు అప్పగించా. దళిత ద్రోహి జగన్ రెడ్డి. ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. ఎస్సీలకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు నిర్వీర్యం చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిలిపేశారు. నేను కులాంతర వివాహాల్ని ప్రోత్సహించా. కానీ జగన్ రెడ్డి ఇవన్నీ రద్దు చేసి దళితులకు అన్యాయం చేశారు. నాలుగేళ్లలో దళితులపై 6 వేల కేసులు పెట్టారు, 188 మంది దళితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. లిక్కర్ మాఫియాను ప్రశ్నించిన ఓం ప్రకాష్ పుంగనూరులో శవమై తేలాడు. జడ్జి రామకృష్ణను వేధించారు.
పూతలపట్టు ఎమ్మెల్యేకు సీటివ్వలేదు. పాపాల పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల అవినీతి జగన్ కి కనిపించటం లేదా? సత్యవేడు నియోజకవర్గంలో రోజుకు 200 ట్రిప్పర్ల ఇసుక తమిళనాడుకు పాపాల పెద్దిరెడ్డి తరలిస్తున్నారని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే చెప్పాడు. చివరకు పెత్తందారీ వ్యవస్ధను భరించలేక వైసీపీకి బైబై చెప్పాడు. వైసీపీకి అభ్యర్థులు లేరు. ఆవులపల్లి రిజర్వాయర్ పనుల కోసం రూ.600 కోట్లు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టారు.
అయ్యప్ప లేఅవుట్ లో పోయిన డబ్బులపై నోరు మెదపని దొంగలు వీళ్లు. స్కూటర్ లో తిరిగే పెద్దిరెడ్డికి రూ.35 వేల కోట్లు ఎలా వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యేనే ప్రశ్నించాడు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం పెద్దిరెడ్డికి ఉందా? నగరిలో మంత్రి రోజా..మహిళల భద్రత గాలికొదిలి పొరుగు రాష్ట్రాల్లో చిందుల చేస్తోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని దళిత మహిళ వద్ద రూ.70 లక్షలు వసూలు చేశారు. నగరికి నలుగులు ఎమ్మెల్యేలు ఉండి వాటాలేసుకుని దోచుకుంటున్నారు.
దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ చెవిరెడ్డి…ఆయన ఒంగోలు ఎంపీ అభ్యర్ది అంటా? స్వర్ణముఖి నదిలో రోజుకు వందల ట్రక్కుల ఇసుక దోచుకుంటున్నారు. పలమనేరు ఎమ్మెల్యే గ్రానైట్ లో ఎక్కడిడక్కడ దోచేశాడు. జనార్థన్ నాయుడు అనే వ్యక్తికి చెందిన గ్రానైట్ లాక్కుని కరెంట్ బిల్లులు కూడా కట్టడం లేదు. పూతలపట్టు ఎమ్మెల్యే పెత్తందార్ల కాళ్ల కింద నలిగిపోయాడు. చిత్తూరు ఎమ్మెల్యే ఇసుక మాఫియా అంతా ఆయనదే.
కార్పోరేషన్ లో అవినీతి లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ కి సీటిచ్చారు. ఇలాంటి స్మగ్లర్ ని మీరు గెలిపిస్తారా? పులివెందులోనే జగన్ ఫ్యూజ్ కాలిపోయింది, పుంగనూరులో ఇంకు మారిపోయింది. మీరు గెలిచే పరిస్ధితి లేదు. టీడీపీ – జనసేన గాలి ఉదృతంగా వీస్తోంది. ఈ ప్రభంజనానికి వైసీపీ ప్యాన్ రెక్కలు విరిగిపోవటం ఖాయం.
చిత్తూరు జిల్లాకు ఈ హామీలు ఇస్తున్నా…
హంద్రీ నీవా పూర్తి చేస్తాం..కృష్ణాపురం రిజర్వాయర్ కి నీరిస్తాం. ఎన్టీఆర్ జలాయాశయం ద్వారా కరువు లేకుండా చేస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా నగరికి నీళ్లు తెస్తాం. జిల్లాలో ప్రతి చెరువుకి నీళ్లిస్తాం. పలమనేరులో టమోటా, మామిడి మార్కెట్ నిర్మాణాన్ని నిలిపేశారు.. దాన్ని పూర్తి చేస్తాం. కైగల్ రిజర్వాయర్ నిర్మిస్తాం. నిండ్రలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం. నగరిలో చేనేత కార్మికుల్ని ఆదుకుంటాం. పొలాల్లో రైతులకు సోలార్ పంపు సెంట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం సంపాదించేలా ప్రణాళిక రూపొందిస్తాం’’ అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.