Suryaa.co.in

Andhra Pradesh

జగరోనా వైరస్ కి త్వరలోనే సీబీఎన్ వ్యాక్సిన్

-జగరోనా వైరస్ దెబ్బకి వ్యాపారాలు అన్ని దెబ్బతిన్నాయి
-చంద్రబాబు పాలనలో వ్యాపారస్తులకు రెడ్ కార్పెట్
-ఒక వేళ అరెస్ట్ చెయ్యాల్సి వస్తే ముందు జగన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాలి
-బెల్లం వ్యాపారస్తుల పై కక్షసాధింపు ధోరణి
-జగన్ రెడ్డి ఏపీని బీహార్ గా మార్చాడు
-వాణిజ్య విభాగం ఆత్మీయ సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

విజయవాడ : జగన్ రెడ్డి పాలనలో ప్రజలకి బాదుడే బాదుడు… వ్యాపారస్తులకు వీర బాదుడు.చంద్రబాబు పాలనలో వ్యాపారస్తులకు రెడ్ కార్పెట్… జగన్ రెడ్డి పాలన లో వ్యాపారస్తులకు వేధింపులు. కరోనా ని తట్టుకొని నిలబడ్డారు కానీ జగరోనాకి దొరికిపోయారు. జగ రోనా వైరస్ దెబ్బకి వ్యాపారాలు అన్ని దెబ్బతిన్నాయి.

జగన్ రెడ్డి పాలసీ ఏంటో తెలుసా? ఆయన మాత్రమే బాగుండాలి. ఆయన చుట్టూ ఉన్న నలుగురు బాగుపడాలి… విజయసాయి రెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, పెద్ది రెడ్డి బాగుంటే చాలు అనుకుంటున్నారు. టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు,వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు,ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయి అని వైసీపీ ప్రభుత్వమే శాసన మండలి లో అధికారికంగా చెప్పింది.

ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్, గోల్డ్ మెడల్ జగన్ రెడ్డి బ్రాండ్లు. ఐటీ కంపెనీలు, ఆటో మొబైల్ కంపెనీలు చంద్రబాబు బ్రాండ్లు. మేము బాగుండాలి…అందరూ బాగుండాలి అనేది మా పాలసీ. జగన్ రెడ్డి టెన్త్ పాస్…డిగ్రీ ఫెయిల్ ఆ తెలివితేటలు తట్టుకోలేక కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకి క్యూ కడుతున్నారు. వైసీపీ నేతల బెదిరింపులు, వేధింపులు, వాటాల దెబ్బకి వ్యాపారస్తులు అందరూ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు.

జగన్ రెడ్డి మొహం చూసి రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు ఆయన రిబ్బన్ కటింగ్ చేస్తున్నవన్నీ టిడిపి హయాంలో వచ్చినవే. విద్యుత్ ఛార్జీల పై వీర బాదుడు, చెత్త పన్ను వీర బాదుడు, బోర్డు పన్ను, బాత్ రూం పన్ను, పైగా వేధింపులు ఇక వ్యాపారాలు చేసేది ఎలా? వైసిపి పరిపాలన అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారులు, ఆక్వా, పౌల్ట్రీ, ఆటోనగర్లు, బెల్లం వ్యాపారస్తులు, నిర్మాణ రంగం ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు మిగలలేదు అందరూ జగన్ రెడ్డి బాధితులే.

ఇసుక పాల‌సీ మార్చి భ‌వ‌న‌నిర్మాణ‌రంగాన్ని, దానికి అనుబంధంగా వున్న 130కి పైగా వ్యవస్థల్ని అస్త‌వ్య‌స్తం చేసేశారు.అనాలోచిత విధానాల‌తో విద్యుత్ కోత‌లు ఆరంభించి ప‌రిశ్ర‌మ‌లకి ప‌వ‌ర్‌హాలీడే ప్ర‌క‌టించేలా చేశారు. టిడిపి హయాంలో ఆక్వా రంగం నంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పుడు వైసిపి పాలనలో ఆక్వా రంగం కూడా సంక్షోభంలో ప‌డింది. విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధ‌ర అధికం కావ‌డం, రొయ్య‌ల ధ‌ర త‌గ్గిపోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రకటించే దుస్థితి వచ్చింది.

ఫీడ్ కేజీకి రూ.20, మిన‌ర‌ల్స్‌, ఇత‌ర మందుల ధ‌ర‌లు 30 శాతం పెరిగిపోయాయి.రొయ్య‌ల రేటు మాత్రం ఏ కౌంటు అయినా కేజీ సుమారు 70 నుంచి 150 వ‌ర‌కూ త‌గ్గినా ప్రభుత్వం నుండి స్పందన లేదు.ఆక్వారంగానికి మేలు చేస్తాన‌ని హామీలు ఇచ్చిన మీరు అధికారంలోకి వ‌చ్చాక తెచ్చిన‌ తరువాత ఫీడ్-సీడ్ యాక్ట్ లతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు… ఆక్వారంగంలో డ‌బుల్ డిజిట్ గ్రోత్ వుండాల‌ని నిర్దేశించిన అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు గారు రెండు విడ‌త‌ల్లో (ఒక‌సారి 0.77పైస‌లు, మ‌రోసారి రూ. 1.86 పైస‌లు) యూనిట్ విద్యుత్‌పై రూ. 2.63 పైసలు తగ్గించ‌డంతో అప్ప‌టివ‌ర‌కూ ఆక్వా రైతులు 1 యూనిట్‌కి రూ. 4.63 పైసలు చెల్లించే విద్యుత్ చార్జీలు రూ.2కి తగ్గ‌డంతో భారం త‌గ్గి మేలు చేకూరింది.

ప్ర‌తిప‌క్ష‌నేత‌గా పాదయాత్రలో మీరు ఆక్వా రైతుల‌కి యూనిట్ విద్యుత్ ను రూ. 1.50 పైసలకే ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకొచ్చాక‌ 0.50 పైసలు తగ్గించి, మ‌ళ్లీ రూ. 2.36 పైసలు పెంచి దారుణంగా మోస‌గించారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి స‌బ్సిడీలు ఎత్తివేయ‌డం ముమ్మాటికీ ఆక్వారైతుల‌కు ద్రోహం చేయ‌డ‌మే. చంద్ర‌బాబు ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు విద్యుత్ స‌బ్సిడీలు ఇచ్చారు. ఉచితంగా ట్రాన్స్‌ఫార్మ‌ర్లు అంద‌జేశారు. రొయ్య‌ల ధ‌ర‌లు ప‌త‌న‌మైతే ఎగుమ‌తి దారుల‌తో మాట్లాడి ప్ర‌తి కౌంట్ కేజీకి అద‌నంగా రూ.20 పెంచేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.రొయ్య‌ల సాగులో ఉప‌యోగించే యంత్రాలు ఎస్సీఎస్టీల‌కు 90 శాతం, చిన్న‌స‌న్న‌కారు రైతుల‌కు 50 శాతం స‌బ్సిడీతో అంద‌జేశారు.టిడిపి ఇన్నిర‌కాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, మీరు స‌బ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కార‌కుల‌య్యారు.

మేము రైతుకు సబ్సిడీలో రూ.1,14,000కే 40 KVA ట్రాన్స్ఫార్మర్ అందిస్తే, అదే ట్రాన్స్‌ఫార్మ‌ర్‌కి రూ. 3,37,000 వ‌సూలు చేయ‌డం ఆక్వారంగానికి అద‌న‌పు భారం అయ్యింది.వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నుంచీ ఈ మూడేళ్ల‌లో ఆక్వా రంగానికి అత్యవసరమైనటువంటి ఐస్ ప్లాంట్స్ గాని, ప్రోసెసింగ్ ప్లాంట్స్ గాని, కోల్డ్ స్టోరేజులు కొత్త‌గా ఒక్క‌టి కూడా నిర్మించ‌లేదు. నిర్మించేవాళ్ల‌కు ప్రోత్సాహం అందించ‌లేదు.

టిడిపి ప్రభుత్వం రొయ్య‌ల పెంప‌కానికి స‌ర‌ఫ‌రా చేసే 1000 లీటర్ల నీటికి రూ.1.20 పైసలు వసూలు చేయగా, ఈ రోజున అదే నీటికి రూ. 120 వ‌సూలుచేయ‌డమేనా మీరిచ్చే ప్రోత్సాహం? రోజుకి ఐదారుగంట‌లు విద్యుత్ కోత వ‌ల్ల జ‌న‌రేట‌ర్లు న‌డిపించి ఆక్వా ఉత్ప‌త్తుల‌ను కాపాడుకోవాల్సి దుస్థితి నెల‌కొంది. ఆక్వారంగం ప‌ట్ల మీ ప్ర‌భుత్వం చూపిన నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా విద్యుత్ యూనిట్‌కి రూ. 1.50నేimage కొన‌సాగించాలి. క్వాలిటీ సీడ్ స‌ర‌ఫ‌రా చేయాలి. విప‌రీతంగా పెంచిన‌ ఫీడ్ ధ‌ర‌లు త‌గ్గించాలి.కనీసం 15 రోజుల‌పాటు రొయ్య‌ల రేటు ప‌డిపోకుండా నిల‌క‌డ‌గా వుండేలా చూడాలి.పెంచిన అగ్రిక‌ల్చ‌ర్ మార్కెట్ క‌మిటీ సెస్ ని తగ్గించాలి ధ‌ర‌లు ప‌డిపోతే ప్ర‌భుత్వం నుంచి మ‌ద్ద‌తు అందించాలి. వేలాది మందికి ఉపాధి కల్పించే ఆటోనగర్లను కొట్టేయడానికి వైసిపి నాయకులు స్కెచ్ వేశారు. దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ (పారిశ్రామిక వాడలు), ఆటోనగర్లు ప్రస్తుతం జనావాసాల మధ్యలోకి వచ్చి కాలుష్య కారకాలుగా మారాయని, వాటిని ఊరికి దూరంగా తరలిస్తామనడంలో పెద్ద కుట్ర ఉంది. ఆ భూములను ఉడా పరిధిలోకి తెచ్చి ఆవాస ప్రాంతాలుగా, వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేస్తామని, అందులో సగం తమకివ్వాలని ప్రభుత్వం ఏకంగా జి.ఓ నెంబర్ 5ను జారీ చేసింది. కోఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ (సిజిపి) పేరుతో ఆటోమొబైల్, అనుబంధ పరిశ్రమలకు చెందిన భూముల్లో 50శాతాన్ని ఎపిఐఐసికి అప్పగించాలని, ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ పేరుతో దోచుకునేందుకు ప్లాన్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 160కి పైగా ఆటోనగర్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉన్నాయి. ఇందులో వివిధ రకాల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆటోమొబైల్ యూనిట్ల ద్వారా వేలాదిమందికి ఉపాథి కల్పిస్తున్నారు. ఒక్క జీవోతో వేల కోట్లు కొట్టేయడానికే ఆటోనగర్ల పై పడ్డాడు జగన్ రెడ్డి. ఇటువంటి చెత్త నిర్ణయాలని వెంటనే వెనక్కి తీసుకోవాలి. బెల్లం అమ్మకాలు సాగించే వ్యాపారస్తులపై SEB అధికారులు అడ్డగోలుగా దాడులకు పాల్పడుతున్నారు. మద్యపాన నిషేధం అని అక్రమ మద్యం, విషపూరితమైన మద్యం అమ్ముతుంది జగన్ రెడ్డి గారు. ఒక వేళ అరెస్ట్ చెయ్యాల్సి వస్తే ముందు జగన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాలి. సారా వ్యాపారులకు బెల్లం అమ్మకాలు సాగిస్తున్నారనే నెపంతో తప్పుడు కేసులు, వేధింపులు తీవ్రమయ్యాయి. ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుని మార్కెట్ యార్డుల్లో అధికారుల సమక్షంలోనే బెల్లం అమ్మకాలు జరుగుతున్నాయి. బెల్లం వ్యాపారస్తుల పై కక్షసాధింపు ధోరణి తో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బెల్లం వ్యాపారస్తుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. వారి పై దాడులు ఆపాలి.

జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందక, పెట్టుబడి ఖర్చుల పెరుగుదలతో పౌల్డ్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనాతో దైబ్బతిన్న పౌల్డ్రీ రంగం మళ్లీ తిరిగి గాడిలో పడుతున్న కమ్రంలో జగన్ రెడ్డి విద్యుత్ చార్జీల నుంచి డీజీల్, పెట్రోల్ ఇలా అన్ని చార్జీలు పెంచి పౌల్డీ పరిశమ్రపై భారం మోపారు. కోళ్ల ఫారాలకు ప్రధాన ముడిసరుకు దాణా. ఈ దాణాలో మొక్క జొన్న, నూకలు, సోయా, తౌడు వాడుతారు. గతేడాది క్వింటాలు నూకల ధర రూ.800 ఉంటే ప్రస్తుతం రూ.1600కు పెరిగింది. రూ.1000 ఉన్న మెక్కజోన్న రూ.2500, కిలో రూ.18 ఉన్న సోయా రూ.36 అయింది, రూ.800 ఉన్న తౌడు ధర రూ.1600కు చేరింది. సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇసుకని బంగారం చేసారు. ఈ రోజుకి ఇసుక సమస్య అలానే ఉంది లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న వారంతా అప్పులపాలయ్యారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతియ్యడానికి ఇంపాక్ట్ ఫీజ్ విధించారు. లే అవుట్స్ వేసే వాళ్ళు 5 శాతం భూమికి మార్కెట్ రేటు ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాలని వీర బాదుడు బాదారు.

జగన్ రెడ్డి పాలనలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME లు) నరకయాతన పడుతున్నారు. ఒక పక్క విద్యుత్ కోతలు, మరోపక్క ఒక్క రూపాయి సబ్సిడీలు విడుదల కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అనేక (MSME లు) మూతబడ్డాయి. రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేసి వేధిస్తున్నారు. చేదోడు, తోడు పేరుతో జగన్ రెడ్డి చిరు వ్యాపారులను దగా చేస్తున్నారు చేస్తున్నారు.

10 వేలు చేతిలో పెట్టి ఏడాదికి లక్ష రూపాయిలు చిరు వ్యాపారుల నుండి కొట్టేస్తుంది వైసిపి ప్రభుత్వం. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు సహా ఇతర కుల వృత్తులపై ఆధారపడిన వారికి గతంలో(టీడీపీ ప్రభుత్వం) సబ్సిడీ రుణాలు, ఆదరణ పనిముట్లు అందించి అండగా నిలవడం జరిగింది.
కార్పొరేషన్ల ద్వారా ఒక్కో వ్యక్తికి సగటున రూ.2 లక్షలు, గ్రూపులకు రూ.10-30 లక్షల వరకు రుణాలిచ్చి స్వయం ఉపాధి పొందేలా, సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా అండగా నిలవడం జిరగింది. ఉన్న పధకాలు అన్ని రద్దు చేసి చిరు వ్యాపారులకు హ్యాండ్ ఇచ్చారు జగన్ రెడ్డి.

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో చేసి చూపించాం. రాయలసీమ ఐటీ అండ్ ఆటోమొబైల్ , విశాఖ ఐటీ, గోదావరి జిల్లాల్లో ఆక్వా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో జిల్లా లో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం. ఇప్పుడు జగన్ రెడ్డి పాలనలో అంతా హాలిడే నే… క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఆక్వా హాలిడే, బిజినెస్ హాలిడే ఆఖరికి జగన్ రెడ్డి హాలిడే తీసుకునే రోజు దగ్గర పడింది.

జగన్ రెడ్డి ఏపీని బీహార్ గా మార్చాడు.కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాదిస్తా అన్న జగన్ రెడ్డి మెడలు వంచుకొని మోదీ ముందు నిలబడుతున్నాడు.రాష్ట్రంలో ఉన్న చెత్త రోడ్ల కోసం పక్క రాష్ట్రంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. బ్రాండ్ గురించి మాట్లాడుతున్న మంత్రి అమర్నాథ్, జగన్ మొహం చూసి వచ్చిన కంపెనీల వివరాల పై శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. వ్యాపారస్తులు సమస్యలు అన్ని తెలుసుకున్నాను. అందరి తో చర్చించి మీరు ఆనందంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రణాళికలు, విధానాలు రూపొందిస్తాం. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను. జగరోనా వైరస్ కి త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది. వ్యాక్సిన్ పేరు సీబీఎన్.

LEAVE A RESPONSE