– తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబుకు విరాళంగా అందజేత
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న అన్నక్యాంటీన్లకు విరాళం అందించేందుకు ప్రజలు, దాతలు విరివిగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు రూ.26.25 లక్షలను అన్నక్యాంటీన్లకు విరాళంగా అందించారు.
ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 అన్నక్యాంటీన్లలో భోజనం ఖర్చుకు ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. వేలమంది కడుపు నింపుతున్న ఈ కార్యక్రమంలో తన వంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు గురుస్వామి నాయుడు తెలిపారు. పేదలకు రూ.5లకే అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభించిన అన్నక్యాంటీన్ల నిర్వహణలో భాగస్వాములయ్యేందుకు వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారులు ముందుకు రావడం అభినందనీయమని సీఎం అన్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా అన్నక్యాంటీన్లలో ఒక రోజు భోజనానికి అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చిన గురుస్వామి నాయుడుని సీఎం చంద్రబాబు అభినందించారు. పేదల కడుపు నింపే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఎవరైనా తమకు తోచిన స్థాయిలో విరాళం అందించవచ్చని సీఎం అన్నారు.