Suryaa.co.in

Telangana

హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రం

– స్వరూపానందేంద్ర స్వామి
– శేష జీవితాన్ని అక్కడే గడుపుతానన్న స్వామీజీ
– విశాఖ ప్రాంతంలో ఇదే చివరి జన్మోత్సవమని ప్రకటన
– వేడుకగా విశాఖ శారదా పీఠాధిపతుల జన్మోత్సవం

హైదరాబాద్‌ కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఆ అధ్యయన కేంద్రంలోనే ఉంటూ ఆదిశంకరుల వారి అద్వైత తత్త్వంపై పరిశోధనలు చేపడతానని స్పష్టం చేసారు. రానున్న జన్మోత్సవం కూడా అక్కడే జరుపుకుంటానని తెలిపారు.

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి జన్మోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి గురువులకు పాద పూజ చేసి భిక్షావందనం సమర్పించారు. పలు ఆలయాల నుండి వచ్చిన పండితులు, అధికారులు పీఠాధిపతులకు మహా ప్రసాదాన్ని అందించారు.

ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు. తాను సన్యాసం స్వీకరించి 30 సంవత్సరాలు పూర్తయిందని, తెలుగునాట కీర్తి కాంక్ష లేకుండా శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శ్రీ శారదాపీఠాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. భారతావని హిందూత్వానికి మాత్రమే వేదిక కాదని, ప్రపంచానికి ఆధ్యాత్మిక వర్శిటీలాంటిదని అన్నారు.

సమాజంలో లౌకిక జ్ఞానం పెరుగుతున్నా ధార్మికమైన ఆధ్యాత్మిక జ్ఞానం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ధార్మిక తత్త్వం కనుమరుగు కాకుండా కొందరు బ్రాహ్మణోత్తములు వైదిక సదాచారాల ద్వారా కాపాడుతున్నారని ప్రశంసించారు. ఆదిశంకరుల వారి అద్వైత తత్త్వంపై విదేశాల్లో సైతం అధ్యయనం జరుగుతోందని, దేశంలోను లోతైన అధ్యయనం చేసేందుకు వీలుగా హైదరాబాద్‌ కోకాపేటలో రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తర్కం, మీమాంస, వ్యాకరణాల్లో పాల్గొంటూ అధ్యయనం చేసే పండితులకు వసతి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

కులం, మతం, జాతి చూడకుండా అద్వైత బోధనలు సాగిస్తామని చెప్పారు. తాను అధ్యయన కేంద్రంలోనే ఉంటూ పరిశోధనల్లో పాల్గొంటానని స్పష్టం చేసారు. ఇందుకోసం పీఠం బాధ్యతలను వచ్చే ఏడాది జన్మోత్సవంలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి అప్పగిస్తానని చెప్పారు. విద్యాధికుడు అయిన స్వాత్మానందేంద్ర స్వామి ధర్మ పరిరక్షణ బాధ్యతలను చూసుకుంటారని వివరించారు. విశాఖ ప్రాంతంలో తనకు ఇదే ఆఖరి జన్మోత్సవం అవుతుందని, వచ్చే ఏడాది షష్టిపూర్తి కార్యక్రమాన్ని అధ్యయన కేంద్రం వేదికగానే చేసుకుంటానని అన్నారు

LEAVE A RESPONSE