Suryaa.co.in

Andhra Pradesh

గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం

– ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ ఛార్జీలను తగ్గించాలి
– పునరుత్పాదక ఇంధన యూనిట్లకు త్వరితగతిన అనుమతులివ్వాలి
– ఆంధ్రప్రదేశ్ కు ఐదు లక్షల పీఎం కుసుమ్ పంపు సెట్లు కేటాయించాలి
– విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో కేంద్రాన్ని కోరిన మంత్రి గొట్టిపాటి

అమరావతి : రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు కేంద్రం సహాయం చేయాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ఇంధన శాఖ కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షతన వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంధన శాఖ మంత్రులు లక్నోలో శనివారం సమావేశం అయ్యారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి., డిస్కంలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల్ని కేంద్ర సహాయ మంత్రికి వివరించారు. గడిచిన ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ రంగం సర్వనాశనం అయ్యిందని గొట్టిపాటి కేంద్రానికి వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.50,000 కోట్ల అప్పుల భారం డిస్కంలపై పడినట్లు తెలిపారు.

జగన్ ప్రభుత్వంలో డిస్కంలకు రావాల్సిన సబ్సిడీలను కూడా సకాలంలో చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 11,352 కోట్లు డిస్కంలకు చెల్లించి వాటికి పునర్జీవం పోసినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కూడా రూ.13,000 కోట్లకు పైగా విద్యుత్ రంగానికి కేటాయించామని తెలిపారు. డిస్కంలను అప్పుల ఊబిలో నుంచి బయట పడేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.

రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటవుతున్న పునరుత్పాదక ఇంధన యూనిట్లలో ఉత్పత్తి అయిన విద్యుత్ ను ఉత్తరాంధ్ర వరకు వాడుకునేలా సరఫరా చేసేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్ట్ లకూ ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ ను ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి కోరారు. అదే విధంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ (ISTN) ఛార్జీలను తగ్గించాలన్నారు. ISTN ఛార్జీల తగ్గింపుతో ట్రాన్స్ కో బలోపేతం అవుతుందని తద్వారా రాష్ట్ర ఇంధన రంగానికి పునర్వైభవం వస్తుందని గొట్టిపాటి తెలిపారు.

అదే విధంగా ఇంధన సర్దుబాటు ఛార్జీల అమలు నిర్ణీత సమయంలో అమలయ్యే విధానాలతో పాటు పలు అంశాలకు సంబంధించి… ఏపీ ఈఆర్సీ చట్టాన్ని ప్రజలకు ఇబ్బందులు లేకుండా సంస్కరించే చర్యలు చేపట్టాలని కేంద్ర సహాయ మంత్రిని కోరారు. దీనితో పాటు పునరుత్పాదక విద్యుత్ రంగానికి గేట్ వేగా నిలవాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… సోలార్, సీబీజీ వంటి పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు.

అన్నదాతకు ఇబ్బందులు తొలగించేందుకు పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు ఐదు లక్షల వ్యవసాయ పంపుసెట్లు కేటాయించాలని కేంద్ర సహాయం మంత్రి శ్రీపాద యశోనాయక్ కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపైనా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వ వినతులుపై కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల ఇంధన మంత్రులు తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంధన శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE