సెంట్రల్ జి.ఎస్.టి కమీషనర్ సాధు నరసింహరెడ్డి కి ‘కార్ల్ లాండ్‌స్టీనర్ ‘ అవార్డు ప్రదానం
గుంటూరు: తలాసీమియా రోగుల కోసం 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 50 కి పైగా కేంద్రాల్లో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సెంట్రల్ జి.ఎస్.టి కమిషనర్ సాధు నరసింహారెడ్డి కి భారత రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిష్టాత్మకమైన ‘ కార్ల్ లాండ్‌స్టీనర్ ‘ అవార్డు అందచేసింది.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరం పాలెం లోని భారతీయ విద్యా భవన్ లో జరిగిన కార్యక్రమం లో కస్టమ్స్, జి.ఎస్.టి కమిషనర్ సాధు నరసింహారెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతుల మీదుగా ‘కార్ల్ లాండ్ స్టీనర్’ అవార్డు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ..నరసింహారెడ్డి నాయకత్వ నైపుణ్యం మరియు సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత కు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచిందన్నారు. రక్త దాన కార్యక్రమాల్లో ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
అవార్డు గ్రహీత ఐ.అర్ ఎస్ అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ..తమ సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా నెలకొల్పిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో 2023 లో 1440 యూనిట్లు 2024 లో 4100 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని,ఆ కృషికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తనకు గుర్తింపు కల్పించాయని తెలిపారు.
ఇప్పుడు ఈ అవార్డు అందుకోవటం రక్తదాన సేకరణలో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. తలాసీమియా రోగుల కోసం రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచడంలో క్రియాశీలంగా వ్యవహరించామన్నారు.
రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎ. కె. పరీద మాట్లాడుతూ..రక్తదానం మరియు సామాజిక సేవల్లో నరసింహారెడ్డి చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేశామన్నారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు పి. రామచంద్రరాజు, జి.ఎస్ టి అధికారులు ఎం.నాగరాజు, బి.రవికుమార్, చీదేళ్ళ ఈశ్వరరావు, అర్.పి.పి.కుమార్, గాదె శ్రీనివాసరెడ్డి, పూర్ణ సాయి, శాఖమూరి శ్రీనివాస్, బిల్లా ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.