Suryaa.co.in

Andhra Pradesh

గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారు

– రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి వ్యక్తిగత అజెండాతో సర్వనాశం చేస్తున్నారు
– పార్టీ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగం

విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో జగన్ రెడ్డి ప్రకటించి అందుకు విరుద్ధంగా, అసాధారణంగా మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం నాడు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యుత్ రేట్లు చూసి పరిశ్రమలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. పరిశ్రమలు లేకపోతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. కరోనా కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇసుక, సిమెంట్, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా క్రుంగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలను మరోసారి పెంచి ప్రజలపై పెనుభారం మోపడాన్ని నేతలు ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. విద్యుత్ చార్జీలు పెంచుతూ, పన్నులు వేస్తూ జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారాలు విధించి సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తోంది. 400 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగం చేసే సంపన్న వర్గాలపై 6 శాతం పెంచి 125 యూనిట్ల లోపు వాడే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలపై 57 శాతం ఛార్జీలు పెంచడమే ఇందుకు సాక్ష్యం అన్నారు.

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చార్జీలు పెంచేది లేదని సగర్వంగా ప్రకటించిందని, పైగా పది వేల మెగావాట్ల అధనపు విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవడం ద్వారా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది. కరెంట్ కోతలు ఎత్తివేసి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసింది. వ్యవసాయ మోటార్లకు 9 గంటల పాటు కోతలు లేకుండా కరెంట్ ఇచ్చింది. 2014, నవంబర్ 30 నాటికి రాష్ట్రంలో 14.81 లక్షలు ఉన్న వ్యవసాయ కనెక్షన్లను 2019, మార్చి 31 నాటికి 18.07 లక్షల కనెక్షన్లకు పెంచడం జరిగింది.

టిడిపి 5 ఏళ్ల పాలనలో 3.26 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షలు ఇవ్వడం జరిగింది. సరాసరి ఏడాదికి 65,200 కనెక్షన్లు ఇచ్చాం. జగన్ మూడేళ్లలో ఇచ్చిన వ్యవసాయ కనెక్షన్లు కేవలం 1.17 లక్షలు మాత్రమే. టిడిపి ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ కనెక్షన్లలో సగం కూడా జగన్ రెడ్డి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ అంకెలు వ్యవసాయదారులపై జగన్ రెడ్డి చిత్తశుద్ధి తెలియజేస్తున్నాయి.

సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం 2018-19లో ఉత్పత్తి సామర్ధ్యం 19,160 మెగావాట్లు ఉండగా.. 2020-21 నాటికి 18,811 మెగావాట్లకు పడిపోయింది. SDSTPSలో స్టేజ్-2 లోని ఎనిమిదో యూనిట్ మరో 800 మెగావాట్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసినా జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.2019 లో చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోయేది లేదు అని బహిరంగంగా.. సగర్వంగా ప్రకటించాం.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. సౌర, పవన విద్యుత్ రంగాన్ని దెబ్బతీశారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబధించి కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేశారు. 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచడంతో ఇళ్లల్లో స్విచ్ వేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు తెచ్చారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ప్రారంభమైనా 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించాం. జగన్ రెడ్డి అసమర్థత, చేతకానితనంతో మిగులు విద్యుత్ తో ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా మార్చారు. అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రంలో చీకట్లు కమ్మేలా చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను ప్రభుత్వం వదులుకోవడం విద్యుత్ చార్జీల పెరుగుదలకు దారి తీస్తుంది.

960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి వ్యక్తిగత అజెండాతో, నిరాధారమైన ఆరోపణలతో నిర్వీర్యం చేశారు. నాడు దూర దృష్టితో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేస్తే.. నేడు పక్షపాత ధోరణితో వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారు.

LEAVE A RESPONSE