చాగంటి కోటేశ్వరరావు తనకు గురజాడ పురస్కారం ప్రదానం చేసిన వేళ తన సంస్కారాన్ని ఘనంగా చాటుకున్నారు..తాను కేవలం సంప్రదాయవాదినన్న అపప్రదను ప్రస్తావిస్తూ గురజాడ పురస్కారాన్ని తాను సన్మానంగా గాక మహాకవి ఆశీస్సుగా స్వీకరించినట్టు ఉద్ఘాటించారు..!
గురజాడ పురస్కారం చాగంటికా అన్న వివాదానికి సున్నితంగా ఖండిస్తూ తాను గురజాడ పురస్కారాన్ని చేతులతో స్వీకరించి తలపై గురజాడ అసీస్సుగా భావించినట్టు చాగంటి పేర్కొన్నారు. పురస్కార స్వీకరణ అనంతరం చాగంటి మాటాడుతూ గురజాడ గ్రాంధికానికి దూరంగా జరిగి వ్యావహారిక భాషలో రచనలు చేయడం ఆ రోజుల్లో అతి పెద్ద విప్లవమని కోటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అప్పారావును వాల్మీకితో పోలుస్తూ మహర్షి ఎలాగైతే ఆవేదన చెంది రక్తం నిండిన నయనాలతో రచనలు చేశారో గురజాడ కూడా అలాగే నాటి సమాజంలోని అవకరాల పట్ల గుండె రగిలిపోగా రచనలు చేశారని చాగంటి కొనియాడారు.
గురజాడ పురస్కారం తనకు అందజేయడంలో సమాఖ్య వారికి ఇబ్బందిగా ఉన్నట్టయితే రద్దు చేసుకోవచ్చని తాను సూచించినట్టు కోటేశ్వరరావు వివరించారు.ఎవరికి పురస్కారం ఇచ్చినా తాను కార్యక్రమానికి హాజరై గురజాడ పట్ల తన గౌరవాన్ని చాటుకుంటానని ఆయన చెప్పారు.
గురజాడ రచనల గురించి కోటేశ్వరరావు ప్రస్తావిస్తూ ఏదో రాత్రిళ్ళు నిద్రపట్టని సమయంలో వచ్చిన ఆలోచనల నుంచి మహాకవి రచనలు పుట్టలేదని.. సమాజాన్ని ఏకాగ్రతతో పరిశీలించి సమస్యలపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని రచనలు చేసినందునే అవి శాశ్వతత్వాన్ని పొందాయని ఆయన అభివర్ణించారు.
గురజాడ అత్యంత గంభీరంగా తన రచనల ద్వారా దేశభక్తిని ప్రకటన చేశారని చాగంటి ప్రస్తుతించారు.అలాగే ప్రకృతిని నిశితంగా పరిశీలించి రచనలు గావించారన్నారు..సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత విలియం వర్డ్స్ వర్త్ శైలి అలాగే సాగుతుందన్నారు. గురజాడ స్పృశించని అంశం లేదని..ఆయన కవిత్వాన్ని ఆస్వాదించని మనిషి ఉండడని అన్నారు.నిజానికి సాహిత్యంలో గురజాడకు నోబుల్ బహుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.
గురజాడ స్ఫూర్తిని ప్రకాశం పంతులు..ఘంటసాల వంటి వారు ప్రదర్శిస్తూ సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి సాయపడవోయ్ అన్న తీరున వ్యవహరించారన్నారు.
గురజాడ మొత్తం భరత జాతికి ముత్తాత వంటి వారన్నారు చాగంటి.. జాషువా కవితను ప్రస్తావిస్తూ సుకవి నిలిచి ఉండు ప్రజల నాల్కల యందు అన్న చందాన గురజాడ ఎప్పటికీ ప్రజలలో తన కవితల ద్వారా నిలిచి ఉంటారని కోటేశ్వరరావు అన్నారు.
గురజాడ రాసిన దేశభక్తి గేయాలను పిల్లలకు నేర్పిస్తే గొప్ప దేశభక్తులు తయారవుతారని ఆయన అన్నారు. తాను ఆయన దేశభక్తి గేయాలపై మాటాడి ఆయన పాదాలకు సమర్పించుకుంటానని అన్నారు.
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286