ఆయన ప్రవచనమే కాదు..
వచనమూ ప్రియమే..
వివాదాన్ని సంవాదం లేకుండా స్పృశించి..
ప్రజామోదం పొందిన
చాగంటి..
కోపమే ఎరుగని ముక్కంటి!
చూసాను నేను..
అఖండ తేజస్సుతో వెలిగిపోయే మూర్తిని..
అటు సాక్షాత్తు
వాగ్దేవి ఆలయం..
ఇటు పశుపతి సన్నిధి..
ఆ నడుమ
ఆ ఇద్దరి స్వరూపమై..
వేదికపై తానే బహురూపమై..
చూపులకు అపురూపమై..
విజ్ఞానం మోములో..
ప్రజ్ఞానం పలుకులో..!
తన విద్వత్తుకు
అమ్మ స్తన్యం కారణమైతే..
తన విభవంలో
అర్ధభాగం అర్ధాంగి..
ఆమె చేయి పట్టి
ఎక్కితే విజయనగరం వేదిక..
ఆ క్షణాన అదయింది
చదువుల తల్లి పీఠిక..
ప్రతి ఒక్కరిలో
దైవాన్ని దర్శించిన ప్రీతి..
కళ్ళెదుట నడచి వస్తున్న
చదువుల తల్లిని గని
పులకించిన అనుభూతి..
ఇదంతా చూసి అవాక్కయింది
నిరసనల అషాఢభూతి!
ఆధ్యాత్మికతకు
ఆధునికతను జోడిస్తూ..
వాల్మీకిని గురజాడలో
చూపిస్తూ..
తానొవ్వక..
అన్యుల నొప్పింపక..
సాగిన కోటేశ్వరుని ప్రసంగంతో
అస్తమించిన
విమర్శల దోషం..
ముగిసిన నిరసనల విద్వేషం..
పులకించింది చల్లని
ఆ ప్రదోషం..!
వేనవేల పద్యాలు
ఆ నోట రసరమ్యాలు..
అనన్యసామాన్య ఆకళింపు
బూతభవిష్యత్ వర్తమానాల
మేళవింపు..
చెడు పోకడలకు తాళింపు..
ఉగాది పచ్చడిలా
షడ్రుచుల కలగలపు..!
గురజాడ వేదికపై
మహాకవికి అభివందనం..
తన వైఖరిపై సవివరణం..
సుతిమెత్తగా..
ప్రతి గుండెకు హత్తగా..!
కిట్టయ్య గీత మాత్రమే కాదు
గురజాడ రాత ఎరుకేనని..
రామయ్య ధర్మమే గాక
మహాకవి రచనల్లోని
మర్మమూ అవగతమేనని
చెప్పకనే చెప్పిన చాగంటిలో
ఆ క్షణాన ఆధునిక
ఋషినే నే గంటి..!
గురజాడకు ప్రణామాలతో..
చాగంటికి నమస్సులతో..
నిర్వాహకులకు అభినందనలతో…
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286