పాడి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం ఇటీవల జరిగిన మదర్ డెయిరీ పాలక వర్గం ఎన్నికలలో గెలుపొందిన చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, పలువురు డైరెక్టర్ లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. పాడి పరిశ్రమ అభివృద్ధి తో పాటు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూత అందిస్తుందని చెప్పారు. పాడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రిని వారు శాలువా, పూలమాలతో సత్కరించారు. నూతన పాలక వర్గ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో డైరెక్టర్ లు సురేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి, జయ శ్రీ, అలివేలు, MD అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు.