Suryaa.co.in

Andhra Pradesh

మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట

-రాష్ట్రప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు
-మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి

మంగళగిరి: రాష్ట్రప్రజల కోసం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్  కంపెనీని శనివారం ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళాకూలీలతో బ్రాహ్మణి మాట్లాడుతూ… మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబునాయుడు, లోకేష్ నిరంతరం పరితపిస్తారు. డ్వాక్రాసంఘాల్లో ప్రస్తుతం కోటిమంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, డ్వాక్రాగ్రూపులు ఈస్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్ గా ప్రతిభాభారతికి అవకాశం ఇచ్చింది చంద్రబాబే. ఆర్థిక ఇబ్బందులు మహిళల విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. దీనిద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకులద్వారా వడ్డీలేని రుణసౌకర్యం లభిస్తుంది. ఉమ్మడి ఎపిలో చంద్రబాబు పెద్దఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సుల ఏర్పాటుద్వారా యువతకు ఉపాధి కల్పించారు.

రాష్ట్రంలో గత అయిదేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుల బతుకు దుర్భరంగా మారింది. పేదప్రజలను కష్టాలనుంచి ఉపశమనం కలిగించేందుకే సూపర్-6 పథకాలను ప్రకటించారు. మహిళల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్థికంగా చేయూత నందించాలని నారా లోకేష్ మంగళగిరిలో స్త్రీశక్తి పథకాన్ని అమలుచేస్తూ వారి స్వావలంబనకు కృషిచేస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం సొంతనిధులతో 29సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మీరంతా ఆయనను ఆశీర్వదించే మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందిస్తారని బ్రాహ్మణి చెప్పారు.

అన్నా క్యాంటీన్లు ఎత్తేసి మా పొట్టగొట్టారు
యర్రబాలెం సంధ్య స్పైసెస్ లో పనిచేస్తున్న మహిళా కూలీలు నారా బ్రాహ్మణి ఎదుట తమ కష్టాలు చెప్పుకున్నారు. గతంలో అన్నాక్యాంటీన్ ద్వారా 5రూపాయలతో మా ఆకలి తీరేది. జగన్ ప్రభుత్వం వచ్చాక అన్నాక్యాంటీన్లు ఎత్తేసి మా పొట్టగొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్లన్నీ అస్తవ్యస్థంగా మారడంతో పని ప్రాంతానికి రావడానికి అవస్థలు పడుతున్నాం.

గత అయిదేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ బిల్లులు రెట్టింపు అయ్యాయి. చాలీచాలని ఆదాయంతో ఇంటిల్లిపాది పనిచేసినా ఇల్లుగడవడం కష్టంగా ఉంది. గతంలో రాజధాని పనులు జరిగే సమయంలో మా కుటుంబ ఆర్థిక స్థితగుతులు మెరుగ్గా ఉండేవి. వైసిపి అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు నిలిపివేయడమేగాక కౌలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు సైతం కూలీపనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు.

గతంలో ఈ ప్రాంతంలో 6వేల జనాభా ఉంటే ప్రస్తుతం 20వేలకు చేరింది. అయితే పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. నారా బ్రాహ్మణి స్పందిస్తూ… మీ అందరికీ అండగా నిలిచేందుకే సూపర్ -6 పథకాలను ప్రకటించారు. మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు చంద్రబాబు, లోకేష్ కృషిచేస్తారు. అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను పునరుద్దరించి, పేదల ఆకలి తీరుస్తారు, మంగళగిరి నియోజకవర్గంలో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారానికి లోకేష్ వద్ద సమగ్ర ప్రణాళిక ఉంది. అత్యధిక మెజారిటీతో లోకేష్ ను అసెంబ్లీకి పంపాలని నారా బ్రాహ్మణి విజ్ఞప్తిచేశారు.

LEAVE A RESPONSE