Suryaa.co.in

Political News

దేశం గర్వించ తగిన నాయకుడు చంద్రబాబు

తాను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి చరిత్ర సృష్టించి చారిత్రక అవసరాలు తీర్చగలిగిన వారు కోటికొక్కరే వుంటారు.అటువంటి వారిలోనారా చంద్రబాబు ఒకరు.ప్రజాసంక్షేమమే పరమావధిగా అధికారంలో వున్నా,ప్రతిపక్షంలో వున్నా స్థిత ప్రజ్ఞతతో ఒక ప్రత్యేక జీవన సరళి అనుసరిస్తున్న వ్యక్తి చంద్రబాబు. సమస్యలను సానుకూలంగా,సవాళ్లని అవకాశాలుగా తీసుకొని అడ్డంకులను ఎదిరించి,అవరోధాలను ఎదుర్కొని ,ఆధునికతని పుణికి పుచ్చుకొని ముందుకు సాగుతున్న నాయకుడు.

నాలుగున్నర దశాబ్దాల నాడు తొణికసలాడిన ఉత్సాహమే, ఏడు పదులు దాటిన వయస్సులోను అదే ఉత్సాహం వురకలేస్తుంది ఆయనలో. ఈ వయస్సులోను విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన వుండదు.అధికారం అనుభవించడంకోసం కాకుండా, ప్రజలకోసం ఆహరహం శ్రమించడం కోసమని విశ్వసించే అరుదైన నాయకుడు.భావితరాల శ్రేయస్సు కోసం నిరంతర ఆలోచనలతో విన్నూత్న ప్రణాళికలను రూపొందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకొన్న కార్యదక్షుడు.

తన దార్శనికతతో తెలుగు జాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్యచరిత్రకు నాంది పలికి దేశరాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. సుస్పష్ట మైన ప్రణాళిక,దార్శనికత కలిగిన అతికొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. విద్యార్ధి దశనుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్నచంద్రబాబు విశ్వ విద్యాలయంలోసామాజిక న్యాయం కోసం పొరాడి తొలి విజయం సాధించారు.

1978 లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలుపొంది మార్చి15 న శాసనసభ్యుడిగా చట్టసభలోమొట్టమొదటి సారి అడుగు పెట్టారు. విద్యార్థి నాయకుడినుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు రాజకీయాల్లో ఎదగాలనుకొనే వారికి ఆదర్శ నాయకుడు చంద్రబాబు.ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారత రాజకీయాలలోఅందరికంటే అనుభవజ్ఞుడైన సీనియర్ రాజకీనాయకుడు కూడా చంద్రబాబు.

ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు దఫాలు మంత్రిగా,దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి గా,మరో పదేళ్లు ప్రతిపక్షనాయకుడుగా,విభజన అనంతరం నవ్యాంద్రకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా,ఇప్పుడు నవ్యాంద్రకి ప్రతిపక్షనాయకుడిగా సుదీర్ఘకాలం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్ననాయకుడు చంద్రబాబు.

ఆంధ్రాభ్యుదయం చంద్రబాబుకే సాధ్యం!
చంద్రబాబు దేశం గర్వించ తగిన నాయకుడు .భారత దేశపు గొప్ప క్రాంత దర్సుల్లో ఒకరు,గొప్ప క్రియా శీలిగా,ప్రగతి సాధకునిగా,ప్రేరణ శక్తిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహానాయకుడు చంద్రబాబు.పదవి అంటే భాధ్యత,మరింత వినయంతో కూడిన కర్తవ్య పాలన అని నమ్మే,చెప్పే,ఆచరించే నాయకులు ఎవరు వున్నారు?

ప్రజలే ముందు,ప్రజలే ముఖ్యం అని అధికారులకు పిలుపు ఇచ్చేవారు ఎవరున్నారు?పాలనలో నియమ నిబంధనల గురించి చెప్పే నాయకులే గాని, పాలనలో మానవీయత మరవొద్దని చెప్పిన ఆదర్శ నేత ఎవరు ?చంద్రబాబు తప్ప. నేడు ఎవరు అవునన్నా,కాదన్నా ఆంధ్రాభ్యుదయం చంద్రబాబుకే సాధ్యం.

దేశాభివృధ్ది కానీ,రాష్ట్రాభివృద్ధి కానీ స్వార్ద, సాధారణ, అల్పులు, అసమర్ధులతోసాధ్యం కాదు. వ్యక్తిత్వం, అంకితభావం, నిబద్దత, నిరంతర శ్రమ, పట్టుదల, ప్రజాదృక్పథం, దూరదృష్టిగల నాయకులతోనే ప్రజాభివృద్ది,రాష్ట్రాభివృద్ధి సాధ్యం.చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అత్యవసరం.పరిపాలన అంటే కేవలం ప్రజలకు తాయిలాలు పంచడం,బటన్లు నొక్కడం కాదని,వారికి బతుకు మార్గం చూపాలని చంద్రబాబు మనసా,వాచా,కర్మణా నమ్ముతారు.చేస్తారు.

ప్రజలకు చేపలు పట్టి ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పిస్తే వారు బతకడమే కాకుండా,రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపిస్తారు అనేది చంద్రబాబు సిద్దాంతం. కాబట్టి చంద్రబాబును రక్షించుకోవాల్సిన భాధ్యత ఆంధ్రులదే.తమ భాధ్యతను నిర్వర్తించే క్రమంలో అత్యంత అప్రమత్తంగా వుండాలి.అందరి కోసం ఒక్కడు చంద్రబాబు.నేడు ఆ ఒక్కడి కోసం అందరూ నిలవడమే పరస్పర భాధ్యత.

ఆనాడు విభజన గాయం మిగిల్చిన గందరగోళంలో కూడా ధైర్యం కోల్పోకుండా అయిదుకోట్ల ప్రజలకు చంద్రబాబు వెన్నంటే నిలిచారు. దిక్కు తోచక అనాధలా మిగిలిన అవశేషాంధ్రప్రదేశ్ ని అక్కున చేర్చుకొని పునాదులు సైతం నేలమట్టమైన నవ్యాంధ్రా నిర్మాణానికి నడుంకట్టి నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు.అన్నీ వ్యవస్థలను పునాదుల నుండి పునర్నిర్మించ వలసిన పరిస్థితులలో ఆ మహానిర్మాణానికి పునాది రాయి అయ్యారు ఆయన .

అందరి పునాదికోసం పునాది రాయి అయి ఒక్కడు గా నిలిచిన నాయకుడు.రాష్ట్ర విభజనతో రోడ్డున పడ్డ తెలుగుజాతికి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేందుకు అహో రాత్రులు శ్రమించారు ఆయన. నవ్యాంధ్రా ఏర్పడిన రెండేళ్ల వ్యవధిలోనే రెండంకెల సుస్థిర వృద్ది సాధించడం అపూర్వం.చంద్రబాబు దీర్ఘకాలం అదికారంలో కొనసాగి వుంటే హైదారాబాద్ వంటి నగరాన్ని నవ్యాంద్రలోను నిర్మించేవారు.విశాఖ పట్నాన్ని ఒక సిలికాన్ వ్యాలీగా,అమరావతిని సకల విద్యలకు కాణాచిగా, తిరుపతి శ్రీ సిటీని ఒక పారిశ్రామిక హబ్ గా మార్చే వారు.

దేశంలో అద్భుత అడ్మినిస్ట్రేషన్.. పాలనా దక్షుడు!
1995 సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రిగా చంద్రబాబు భాధ్యతలు చేపట్టిన తర్వాతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం ఆరంభమైంది.1995 నుండి 2004 వరకు పరిపాలనలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. పారిశ్రామికాభివృద్దికి ఉపాది అవకాశాలను విస్తారంగా కలిగించిన ఘనత చంద్రబాబుదే.పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాక అనేక రాయితీలు ప్రకటించారు.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆంద్రప్రదేశ్ ను ఒక ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దెందుకు 1998 లో స్పష్టమైన విజన్ 2020 డాక్యుమెంటు ను రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు.విజన్ 2020 డాక్యుమెంట్ కు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలు,కార్యక్రమాలు రూపొందించి సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిని పరుగులు తీయించారు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని స్వప్నించి పాలించిన నాయకుడు,దేశంలో అద్భుత అడ్మిని స్ట్రేషన్ కు అర్ధమించిన పాలనా దక్షుడు, రైతులకోసం రైతు బజార్ లను సృష్టించిన సృజన శీలుడు,మహిళా స్వావలంబన కై డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు.

ఐటీకి ఆద్యుడు. జన్మభూమి,ప్రజల వద్దకు పాలన,వివిధ వర్గాల ప్రజలకోసం ఎన్నో పధకాలు అమలు చేసిన నాయకుడు. ఎస్సీల కోసం ఎస్సీ వర్గీకరణ,ఎస్సీ కమిషన్ పునద్ధరణ,మహిళల కోసం రుణ మాపి ఇలా ఎన్నో పధకాలను అమలు చేసిన నాయకుడు చంద్రబాబు.అందరు భయపడే రోజుల్లో ఆర్దిక సంస్కరణలు బహిరంగంగా సమర్ధించి సంస్కరణలు అమలు చెసి సంపద సృష్టికి బీజం వేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్రాతి పదికగా ఎంచుకొన్నారు.ఐటీ రంగంలో చంద్రబాబు తీసుకొన్న సాహసోపేతమైన నిర్ణయానికి చొరవకు తార్కాణం మాదాపూర్ హైటెక్ సిటీ నిర్మాణం.

కేవలం ఏడాదిన్నరలోపే హైటెక్ భవన నిర్మాణం పూర్తి చేసి ఐటీ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.చంద్రబాబు కృషితో ఏర్పడిన హైటెక్ సిటీ వల్ల వచ్చిన సాప్ట్ వేర్ ఎగుమతులే ఈ రోజు తెలంగాణా రాష్ట్ర రెవెన్యూలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఏమి తెలియని రోజుల్లో హైదారాబాద్ లో ఐటి రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాద్యమైంది.

ఐటీ విప్లవ సాధకుడు,సైబరాబాద్ నగర నిర్మాణం
ఐటీ కేంద్రంగా హైదారాబాద్ ను అభివృద్ది చెయ్యడం వరకే ఆయన పరిమితం కాలేదు.ఐటీ ని ఉపయోగించుకొని పరిపాలనా రంగంలో సంస్కరణల వేగాన్ని పారదర్శకతను ఏ విధంగా తీసుకు రావచ్చునో చంద్రబాబు అమలు చేసి చూపారు.ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచపటంలో ఆయన గుర్తింపు తెచ్చారు.ఎలక్ట్రానిక్ పరిపాలన,సుపరిపాలన తో హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు జనంలో ముద్రపడింది.

1998 లో హైటెక్ సిటిని నిర్మించిన సౌధం ఫలితంగా హైదరాబాద్ ను సాప్ట్ వేర్ రంగానికే తలమానికంగా నిలిచింది. హైటెక్ సిటీ నిర్మాణంతో సైబరాబాద్ అనే ఒక శివారు నగరమే నిర్మితమైంది అంటే చంద్రబాబు పాలనా ఫలితమే అని చెప్పాలి. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలినీయంగా ప్రసిద్ధి పొందిన చంద్రబాబు ఖ్యాతి ఎలాంటిదో అర్ధం అవుతుంది. భారీ వేతనాలతో కూడిన లక్షలాది ఉద్యోగాలు,ఏటా వేలకోట్ల రూపాయల ఐ‌టి ఎగుమతులు సాధ్యమయ్యాయి అంటే ఆనాడు చంద్రబాబు కృషే కారణం.

హైదరాబాద్ ఐ‌టి హబ్ గా మారడానికి చంద్రబాబు కృషే బెంగుళూరు,ముంబై తో పోటీపడి ఐ‌టి రంగాన్ని హైదరాబాద్ ఆకర్షించడాన్ని చంద్రబాబు చూపిన చొరవే కారణం. చంద్రబాబు రాష్ట్రాభివృద్దికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నే కాక ప్రపంచ ఆర్ధిక నిపుణులను ఆకర్షించాయి. హైదరాబాదులో అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు,రోడ్ల విస్తరణ,కొత్త రోడ్ల నిర్మాణం,గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లకు రూపకల్పన వంటి కార్యక్రమాలతో రాష్ట్ర అభివృద్దిని పరుగులు పెట్టించారు.

ప్రాధమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య కొరకు ఎనలేని ప్రోత్సాహం అందించారు.చంద్రబాబు దేశం గర్వించ తగిన నాయకుడని,ఆయన వల్లే హైదరాబాద్‌లో సాంకేతిక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందిందని, ఆయన వల్లే తాము ఐటీ ఉద్యోగులుగా ఇప్పుడు సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నాం అని, ఇప్పుడు దేశ విదేశాల్లో మన ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే అది ఆయన విజన్‌ వల్లే జరిగిందని, తెలుగు రాష్ట్రాల్లో పేదరికం తగ్గి అనేక కుటుంబాలు ఆనందంగా బతకడానికి చంద్రబాబు ప్రధాన కారకుడని ,చంద్రబాబు విజన్‌తో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని,దాదాపు 32 వేల బిలియన్‌ డాలర్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయంటే,చంద్రబాబు విజన్‌ మూలంగానే సాధ్యమైందని, ఆయన తెచ్చిన సాంకేతిక విప్లవాన్ని ప్రపంచ దేశాలు కూడా అమలు చేస్తున్నాయి అంటున్నారు ఐటీ ఉద్యోగులు.

చంద్రబాబు హయాంలో హైదరాబాద్ లో ఎంసీ హెచ్ ఆర్ సి,హైటెక్ సిటీ,హైటెక్స్ వంటి ప్రగతి పాదుకలతో పాటు,నెక్ల్ స్రోడ్,శిల్పారామం,తారామతి,బారాదరి,కేబీఆర్ పార్క్,సంజీవయ్య పార్క్,ఎన్ఠీఆర్ పార్క్,లుంబిని పార్క్,జలవిహార్,వంటి ఎన్నో అధునాతన పర్యాటక ప్రదేశాలు ఏర్పాటు అయ్యాయి. హైదరాబాద్ దేశంలో ప్రధాన విద్యా కేంద్రమైంది.వైద్యరంగం అభివృద్ధి చెందింది.

శిధిలమైన నవ్యాంధ్రను శిఖరాగ్రానికి చేర్చిన ఘనత చంద్రబాబుదే!
కారు చీకట్ల లోనూ కర్తవ్య పాలన చేసి శిధిలమైన నవ్యాంధ్రను అయిదేళ్లలో శిఖరాగ్రానికి చేర్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తానె మొదటి కూలీనంటూ పరిపాలన ప్రారంభించిన చంద్రబాబు ఒక్క రోజు కూడా విశ్రమించ కుండా దార్శనికతతో భవ్య భవితకు బలమైన పునాది వేశారు. కష్టాల సుడిగుండంలో వున్న రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చడానికి ఒక కర్మ యోగిలా కార్యాచరణకు శ్రీ కారం చుట్టారు. కూర్చోవడానికి కుర్చీ లేదు,సమావేశాలకు వేదికలు లేవు.హోటళ్ల లో సమావేశాలు, బస్సులో పడుకొని పరిపాలన సాగించి కూడా ఐదేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాట పట్టించారు.

బలవంతంగా సమస్యల సుడిగుండంలోకి నెట్టబడిన రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం కోసం, ప్రజలు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఐదేళ్లు అవిశ్రాంతంగా శ్రమించారు చంద్రబాబు. రాజధాని లేదు, ఆర్ధిక వనరులు లేవు, కేంద్ర సాయంలేదు. ప్రతిపక్షాల అడ్డంకులు, ప్రకృతి విధ్వంసాన్ని ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో పొరాడి రాష్ట్రాన్ని వెలుగుబాట పట్టించారు.

సామాజిక, ఆర్ధిక మనవాభివృద్ది చూచికల ప్రాతిపదికన 2020నాటికి రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపి, ఆ తర్వాత 2029నాటికి భారత్ లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలపాలన్న లక్ష్యంతో అభివృద్ది ప్రణాళికలు రచించారు. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా సంక్షేమ పథకాలు అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా నిలిపారు.నిరుపేదలు, రైతులు, మహిళలు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చేందుకు బృహత్తర లక్ష్య సాధన కోసం విలక్షణమైన ఎన్నోసామాజిక పథకాలకు శ్రీకారం చుట్టారు.

బడుగుల బతుకుల్లో భాగ్యోదయం కల్పించేందుకు 100కి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రానికి కరువు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ధృఢ సంకల్పంతో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిగత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగాదాదాపు రూ.67వేల కోట్లు ఖర్చు చేశారు. దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేశారు.

ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి గోదావరినీళ్లు నవ్యాంధ్ర నలుమూలలకు పారించి నల్ల రాయిని కూడా నల్ల రేగడిగా మార్చాలని కలలు కన్నారు.అచేతనంగా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారో లేదో అన్న సందేహాలు ఉన్న పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ను మొదటిస్థానంలో నిలిపారు.

ఏపీ ఇన్వెస్ట్ మెంట్ అండ్ డెవెలప్ మెంట్ చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి!
చంద్రబాబు నాయుడు ప్రజా హితానికి సంభంధించి రేపటి ఆలోచన ఏదైనా నిన్ననే స్వప్నిoచి నేడే అంది పుచ్చుకొనే నాయకుడు,దార్శనికుడు.అటువంటి ఆదరవంత మైన నాయకుడు.ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐఎస్ బి మొదలుకొని ఎన్నో సంస్థలను ఆంద్రప్రదేశ్ వైపు మళ్లించిన చాతుర్యం చంద్రబాబుది. ఆయన హయాంలో సాధించిన గ్రోత్ ని, చూపించిన ఫలితాలు ఏ కొలతతో కొలవగలం?

ఎక్కడికక్కడ ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు కళ్లు తెరిచే లోపే చేతిలో లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలతో వాటికి అందనంత దూరంలో అవకాశాలను అందిపుచ్చుకొన్నది ఆంధ్రప్రదేశ్. పెట్టుబడుల ఫలితాల వెనక చంద్రబాబు కునుకులేని కఠోర శ్రమ ఉంది.ఇండియన్స్ మనసు పెట్టి 18 గంటలు కూడా కష్టపడతారని తెలుసు.కానీ ఓ స్టేట్ కి సీఎంగా ఉన్న వ్యక్తి కూడా అంతకంటే ఎక్కువ శ్రమపడతారని ఊహించలేదంటూ ఏర్ బస్ ఛైర్మన్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఒక్కటి చాలు ఏపీలో చంద్రబాబు పనితీరు ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతోందో చెప్పడానికి.

కరువు జిల్లా అనంతపురంలో ని పెనుగొండలో పరిశ్రమ పెట్టేలా ఒప్పించారు చంద్రబాబు.కియా మోటార్స్ ను తమిళ నాడులో పెట్టమని ఒప్పించడానికి రెండేళ్లు పడితే దానిని తిరిగి ఆంధ్రప్రదేశ్ కి మళ్లించడానికి చంద్రబాబు రెండు గంటల్లో సాధించారని మేనేజింగ్ డైరెక్టర్ కన్నన్ రామ స్వామి అన్నారు. కొత్త రాష్ట్రంలో ఏపీలో పరిస్థితులు కుదురుకోలేదు. ఇటు పాతుకుపోయిన హైద్రాబాద్ తోనూ అటు ప్రపంచస్థాయి సౌకర్యాలున్న కర్ణాటక, తమిళనాడులతోనూ పోటీ అంత సులభం కాదు.

ధార్వాడ్, మైసూర్, మంగుళూరు లాంటి ఎకనామిక్ జోన్స్ తో పోలిస్తే ఏపీ ప్రయాణించాల్సిన దూరం చాలా వుంది. ఆ పరిష్టితుల్లో కొత్తగా పెట్టుబడుల్ని ఆకర్షించడమే కాదు,ఆ రాష్ట్రాల కన్నా ఏపీ ఏ రకంగా మెరుగో నిరూపిస్తూ చాతుర్యం చూపించారు చంద్రబాబు.

జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర!.
నేషనల్ ప్రoట్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ కేంద్ర పెత్తనానికి ఎలా కళ్ళెం వేశారో యునైటెడ్ ప్రంట్ ఏర్పాటు,ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పాటుకు అంకురార్పణ చేసినవారిలో చంద్రబాబుదే కీలక పాత్ర. కాంగ్రెస్, బి జె పి లకు ప్రత్యామ్నాయంగా అది రెండు సార్లు అధికారంలోకి రావడానికి చంద్రబాబు అంతే కృషి చేశారు. ఇద్దరు ప్రధాన మంత్రులు ,రాష్ట్ర పతి,ఉప రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులకు అభ్యర్ధుల ఎంపిక లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.

కావునా ఎవరు ఏమన్నా ఆంధ్రాభ్యుదయం చంద్రబాబుకే సాధ్యం. గడిచిన అయిదేళ్లుగా వైసిపి ప్రభుత్వం అసమర్ధ, ప్రజావ్యతిరేక విధానాలపై గాంధేయ మార్గంలో ఏడు పదులు దాటిన వయస్సు లోనూ ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు ఆయన.జాతికోసం,ప్రగతి కోసం 46 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నఆ మహా నాయకుడు చంద్రబాబు గార్కి తెలుగు ప్రజల తరపున,ప్రపంచ వ్యాప్తంగా వున్న కోట్లాది అభిమానుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నీరుకొండ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్,
9849625610

LEAVE A RESPONSE