వాట్ ఏ వండర్…సోము వీర్రాజుకు జ్ఞానోదయం అయ్యిందా?

ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారాన్ని ఖండించిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ”పేర్లను మార్చగలరు కానీ చరిత్రను కాదు” అంటూ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం పై వివాదం నడుస్తోంది. ప్రతి పక్షాలు వ్యతిరేకించినప్పటికీ జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. ఈ పేరు మార్పు కార్యక్రమాన్ని విపక్షాలన్నీ ఖండించాయి. జగన్ పై దుమ్మెత్తి పోశాయి. బీజేపీ కూడా ఈ పేరు మార్పును వ్యతిరేకించింది. అయితే ఆ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడిన మాటలే కొంత వింతగా…కొంత ఆశ్చర్యంగా…ఎక్కువ రాజకీయంగా ఉన్నాయి. ”పేర్లను మార్చగలరు కానీ చరిత్రను కాదు” అంటూ ఆణి ముత్యాలు జాలువార్చారు సోము వీర్రాజు గారు.

బీజేపీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా ముందు చేసే పని, నగరాలకు, పట్టణాలకు, వీధులకు, స్థలాలకు పేర్లు మార్చడం. పేర్లు మార్చడమే అతి పెద్ద అభివృద్ది కార్యక్రమంగా ఆ పార్టీ చేపడుతుంది. ఇక అధికారం లోకి రావాలనుకున్న రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ఇచ్చే వాగ్దానాల్లో పేర్ల మార్పే ముందుంటాయి. మహారాష్ట్ర లో ఔరంగాబాద్ ను శంభాజీ నగర్ గా , ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా మార్చారు. త్వరలో అహ్మదాబాద్ పేరును కర్నావతిగా మారుస్తారట. యూపీలో నైతే అనేక పట్టణాల్లో వీధుల పేర్లను మార్చి పడేశారు.ఇలా ప్రతీ చోటా పేర్లు మార్చిన చరిత్ర బీజేపీది.

తెలంగాణ లో అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా, కరీంనగర్ ను కరినగరంగా, హుస్సేన్ సాగర్ ను వినాయక్ సాగర్ గా …ఇలా పేర్లు మార్పు అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపడతామని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు బండి సంజయ్ లాంటి బీజేపీ నాయకులు. అసలు గుంటూరు లోని జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని గగ్గోలు పెట్టిన వాళ్ళెవరు ? సోము వీర్రాజు అండ్ బ్యాచ్ కాదా?

మరి సోము వీర్రాజు అన్నట్టు ఈ బీజేపీ ప్రభుత్వాలు మార్చిన పేర్ల వల్ల, మారుస్తామని ప్రకటించిన పేర్ల వల్ల గానీ చరిత్ర ఏమైనా మారిందా ? చరిత్రను మారుద్దామనే బీజేపీ నేతల ప్రయత్నం ఎక్కడైనా విజయవంతం అయ్యిందా ? అసలు ఏపీ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై వివాదాన్ని పక్కకుపెడితే .. పేరు మార్చినంత మాత్రాన చరిత్ర మారదన్న సోయి బీజేపీ నేతలకు రావడం ఆశ్చర్యమే కాదు శుభపరిణామం కూడా!

– పరాశరం గోపాల్

Leave a Reply