– అందుకే దటీజ్ చంద్రబాబు
అవి నేను డిగ్రీ చదువుకుంటున్న రోజులు… ఆడపిల్లకి ఎక్కువ చదువులు ఎందుకు.. పెళ్ళి చేసి పంపించేస్తే బావుంటుంది అనే తల్లితండ్రులు అధికంగా ఆలోచించే రోజులు. అప్పటికే నా స్నేహితురాళ్ళలో కొందరికి వివాహాలు జరిగిపోయాయి. అందరిలాగానే మా ఇంట్లో కూడా నా పెళ్ళి ప్రస్తావన మొదలు అయింది. ఆడపిల్ల ఎంత అయినా భారమే. త్వరగా పెళ్ళి చేసేస్తే మంచిది అని చుట్టుపక్కల నలుగురు సలహాలు ఇస్తున్నారు. నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. ఉద్యోగం చేయాలని ఉంది.. అప్పుడే పెళ్ళి వద్దు అని గట్టిగా అరవాలని ఉంది.
ఇలాంటి సమయంలోనే నాన్న దినపత్రికలో ప్రచురితమైన ఒక వార్త మోసుకు వచ్చారు. అమ్మా ఈరోజు వార్త చూడు.. ఈ మూడేళ్ళ పీజీ కోర్స్ చదువుకుంటే ముందు ముందు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయి అంట. మంచి జీతం కూడా వస్తుంది కంప్యూటర్ ఉద్యోగాలకు సరిపడా జనాలు లేరంట.. ఇది చదివితే నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నీవు నిలబడతావు. వాళ్ళు వీళ్ళు . ఏమనుకున్నా పర్లేదు.. నువ్వు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను. అని నాన్న చెప్తుంటే నా ఆనందానికి హద్దులు లేవు.
వెంటనే ప్రవేశ పరీక్ష రాయడం, పీజీలో చేరిపోవడం, ఆ వెంటనే ఒక పెద్ద ఐటీ సంస్థలో ఉద్యోగం రావడం, కొన్నాళ్ళకు విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం రావడం అన్నీ నాన్న, నేను కోరుకున్నట్లు జరిగిపోయాయి. మా ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగుపడింది. ఎంతో కష్టపడి చదివించిన నాన్న శ్రమకి తగిన ప్రతిఫలం దక్కింది. నాకే డిగ్రీ అవగానే పెళ్ళి అయి ఉంటే.. నా జీవితం ఎలా ఉండేది. అన్న ఊహే ఇప్పటికీ భయంకరంగా అనిపిస్తుంది.
నాన్నని చాలా రోజుల తర్వాత అడిగాను.. ఆరోజు పేపర్లో వచ్చిన వార్త నమ్ముకుని ఐటీ ఉద్యోగాలు వస్తాయని నీ జీతం కంటే మూడు రెట్లు అధికంగా ఉన్న నా ఫీజు మూడు సార్లు కట్టావు…. అందరి నోళ్ళు మూయించి నన్ను ఎంతో కష్టపడి చదివించావు… కానీ ఆ పత్రికలో వచ్చిన మాట.. ఒక ప్రభుత్వం చెప్పిన మాట. నిజం అవ్వాలని లేదు కదా… అలాంటి వార్తలు పొగడ్తల కోసం.. ప్రచార ఆర్భాటాల కోసం ఎన్నో వస్తాయి.. వాటిని నమ్మి భవిష్యత్ ఎలా నిర్దేశించుకుంటాము. నీకు ఆ వార్త మీద అంత నమ్మకం ఏంటి నాన్నా అని అడిగాను…
ఆయన అప్పుడు ఒకటే మాట అన్నారు. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమ్మా… చెప్పారు అంటే చేసి చూపెడతారు.. ఆయనని నేను పూర్తిగా విశ్వసిస్తాను.. అందుకే కష్టమైనా నిన్ను చదివించాలని నిశ్చయించుకున్నాను అన్నారు.
ఆరోజుల్లో నాకు తెలిసే మా ఊరి నుండే ఎంతోమంది. ఇంజనీరింగ్, ఎంసీఏ చదువుకున్నారు. ఐటీ ఉద్యోగాల ద్వారా ఎంతోమంది విదేశాలకి వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ఎంతో మంది లక్షలు, కోట్లు సంపాదించారు. అది కచ్చితంగా ఆ మహానుభావుడి చలవే… జీవితంలో మనం తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో ఈ పెద్దాయన ముందు వరసలో ఉంటారు.
హైదరాబాద్ ఈరోజు ఈ స్థితిలో ఉంది. అంటే కచ్చితంగా ఆయన వేసిన గట్టి పునాది వల్లనే… ఎవరు నమ్మినా నవ్వినా ఇదే నిజం. మన దేశంలోనే చంద్రబాబు గారి లాంటి ముందు చూపు ఉన్న మహా నేతలు చాలా అరుదు.. ఎవరు కాదన్నా ఇదే నిజం..
ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి, మీరు పరోక్షంగా నా జీవితాన్ని దిశానిర్దేశం చేసిన మహానుభావులు, మీకు సదా ఋణపడి ఉంటాను. మీరు క్షేమంగా తిరిగి రావాలి.. మీ ద్వారా అమరావతి నిర్మాణం సింగపూర్ తరహాలో జరగాలి. ఆంధ్ర ప్రజలు మళ్ళీ తలఎత్తుకొని జీవించాలి..
చదువు పూర్తయిన విద్యార్థులు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలు, దేశాల వైపు చూడని రోజులు త్వరలోనే రావాలి. ఆంధ్రకి పునర్వైభవం కచ్చితంగా మీ వల్లే సాధ్యం. మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళ ఆరోగ్యం ప్రసాదించాలి.
గాదిరెడ్డి సౌమ్య
కర్నూలు