– జగన్‌పై నారా-నందమూరి కుటుంబయుద్ధం
– కుటుంబం మొత్తం యుద్ధక్షేత్రంలోనే
– ఢిల్లీ నుంచి గల్లీ వరకూ గళమెత్తుతున్న లోకేష్
– బాబుకు బాసటగా రంగంలోకి బ్రాహ్మణి, భువనేశ్వరి
– ర్యాలీలతో రోడ్డెక్కిన అత్త-కోడలు
– బావకు సంఘీభావంగా నందమూరి బాలకృష్ణ
– అండగా అన్నగారి కుటుంబం
– బాబు అరెస్టుతో రంగంలోకి నారా-నందమూరి ఫ్యామిలీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
సకుటుంబ.. సపరివారంగా నందమూరి-నారా కుటుంబాలు యుద్ధక్షేత్రంలోకి దిగిన సన్నివేశాలు తెలుగుప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకూ నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ ఒక్కరే, ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నారా కుటుంబం నుంచి చంద్రబాబునాయుడు-ఆయన తనయుడు లోకేష్ మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు.
వీరు తప్ప నారా-నందమూరి కుటుంబాల నుంచి.. ఇప్పటిదాకా ఎవరూ బయట కనిపించిన దాఖలాలు, భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ప్రధానంగా మహిళలయితే ఆ రెండుకుటుంబాల నుంచి తెరపైకొచ్చిన దాఖాలు లేవు. నందమూరి సుహాసిని కూకట్‌పల్లిలో ఓడిన తర్వాత, కనిపించడం మానేశారు.
అలాంటిది చంద్రబాబునాయుడును జైల్లో పెట్టిన అనంతర పరిణామాలు.. ఆ రెండు కుటుంబాలను ఏకకాలంలో యుద్ధక్షేత్రంలో నిలిపేలా చేశాయి. రాజమహేంద్రవరం వారి యుద్ధానికి వేదికగా మారింది. ఇప్పటివరకూ నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి తమ హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలకే పరిమితమయ్యారు.
భువనేశ్వరి మాత్రం, ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. ఎన్టీఆర్ స్కూల్‌లో విద్యార్థినులు అధిక మార్కులు సాధించిన సమయంలో, వారిని అభినందించే కార్యక్రమంలో కనిపిస్తుంటారు. బ్లడ్‌బ్యాంక్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇటీవల తనయుడు లోకేష్ పాదయాత్రలో, కన్నతల్లిగా పాల్గొన్న భువనేశ్వరి.. తనయుడు లోకేష్‌ను కంటికిరెప్పలా చూసుకుంటున్న, యువగళం సైనికులకు స్వయంగా భోజనం వడ్డించారు.
తన కొడుకు కోసం తమ కుటుంబాలను త్యాగం చేసిన యువగళం సైనికుల భార్యలకు, ఆమె కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా, భర్త పాదయాత్రలో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. భర్త యోగక్షేమాలు తెలుసుకుని, మళ్లీ హెరిటేజ్ వ్యాపారాల్లో బిజీ అయిపోతుంటారు. ఇదీ అత్తా కోడళ్లకు సంబంధించిన ముచ్చట్లు.
ఇక బాలకృష్ణ పేరుకు హిందూపురం ఎమ్మెల్యే అయినప్పటికీ, సినిమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. హిందూపురంలో తన అవసరం ఉన్నప్పుడు ఆయన అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. అయితే రోజువారీ సీరియస్ రాజకీయాల్లో బాలకృష్ణ పాల్గొనేది తక్కువేనని చెప్పాలి.
మొత్తంగా క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉండేది చంద్రబాబు-ఆయన తనయుడు లోకేష్ మాత్రమే. తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును జగన్ సర్కారు అరెస్టు చేసి, రాజమండ్రి జైల్లో ఉంచిన వైనం సంచలనం సృష్టించింది. బాబును అరెస్టు చేసిన వైనం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశ విదేశాల్లోనూ కలకలం సృష్టించింది. హైదరాబాద్-బెంగళూరుతోపాటు, విదేశాల్లోనూ ఐటీ ప్రొఫెషనల్స్ తమ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు.
బాబు జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ ఉత్తరాధికారి లోకేష్ భుజంపై బరువు బాధ్యతలు పెరిగాయి. అటు ఆందోళనలు సమీక్షించడం.. ఇటు న్యాయవాదులతో చర్చలు.. మరోవైపు జగన్ సర్కారు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించడటం.. ఇంకోవైపు స్థానిక-జాతీయ మీడియాతో భేటీలతో, లోకేష్ నిమిషం ఖాళీ లేకుండా బిజీగా మారిపోయారు.
ఎప్పుడూ పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి, అధ్యక్షత వహించే చంద్రబాబు స్థానంలో… తొలిసారిగా లోకేష్ కూర్చుని, పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాల్సి వచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలిసారి నిర్వహించిన పెద్ద బాధ్యత అది. ఢిల్లీ వెళ్లిన లోకేష్.. ఐదు జాతీయ చానెళ్ల ప్రతినిధులతో నదురు-బెదురు లేకుండా మాట్లాడిన తీరు… అప్పటి లోకేషేనా? అన్న అనుమానం-ఆశ్చర్యానికి కారణమైంది.
ప్రధానంగా రిపబ్లిక్ టీవీలో హేమాహేమీలను, ప్రశ్నలతో నీళ్లుతాగించే ఆర్నబ్ గోస్వామి సంధించిన ప్రశ్నాస్త్రాలకు.. తొణుకు-తొట్రుపాటు లేకుండా లోకేష్ ఇచ్చిన జవాబులు, అటు జాతీయ మీడియాను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ రకంగా తండ్రి అరెస్టు ఫలితంగా.. జాతీయ నేతగా ఢిల్లీకి పరిచయమవడంతోపాటు, తానేమిటో నిరూపించుకున్నారు.
బాబు అరెస్టు తర్వాత బాలకృష్ణ, పార్టీ ఆఫీసుకు వచ్చి క్యాడర్‌లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా కాపాడారు. అక్కడే కూర్చుని పార్టీ ఆందోళన కార్యక్రమాలు, సీనియర్లతో సమీక్షలు నిర్వహించడం ద్వారా, పార్టీకి నాయకుడు లేరన్న భావన తొలగించారు.
ఈ క్రమంలో నందమూరి మనుమరాలైన బ్రాహ్మణి రంగప్రవేశం చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజమండ్రిలో వేలాదిమంది మహిళలతో కలసి, అత్తగారితోపాటు ఆమె కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. నిజానికి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం ఆమెకు అదే తొలిసారి. గతంలో ఎప్పుడూ రోడ్డెక్కింది లేదు. మీడియా ముందుకొచ్చి, రాజకీయాల గురించి మాట్లాడిందీ లేదు. తన ఇల్లు, హెరిటేజ్ ఆఫీసూ. అంతే!
కానీ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు బాసటగా నిలిచేందుకు, బ్రాహ్మణి కూడా సమరనాదం చేయాల్సివచ్చింది. ఆ సమయంలో భర్త అక్కడ లేకున్నా.. మామ జైల్లో ఉన్నప్పటికీ.. మొక్కవోని ధైర్యంతో ఆమె వేసిన అడుగులు, మీడియాను విభ్రమపరిచాయి. తన మామ అరెస్టు అన్యాయమంటూ ఆమె చేసిన విశ్లేషణ, అందరినీ అబ్బురపరిచింది. అది ఆమెలోని ‘నయా నాయకురాలి’ని ఆవిష్కరించింది. భర్త లోకేష్‌ను అరెస్టు చేసినా భయపడేది లేదంటూ విసిరిన సవాలు, ఆమెలోని ధీరోదాత్తురాలిని తెరపైకి తెచ్చింది.
ఆవిధంగా బాబు భార్య భువనేశ్వరి.. కొడుకు లోకేష్.. కోడలు బ్రాహ్మణి.. బావమరిది బాలకృష్ణ, మరో బావమరిది రామకృష్ణ.. తమ్ముడి కొడుకు నారా రోహిత్.. ఇలా సకుటుంబ సపరివారంగా, జగన్‌పై యుద్ధానికి దిగిన దృశ్యం సహజంగానే అందరినీ ఆకట్టుకుంది.