Suryaa.co.in

Editorial

‘పువ్వు’కి ఎందుకీ ‘తపన’?

– దెందులూరు బీజేపీకి కావాలట
– అనపర్తి టీడీపీకి ఇస్తే దెందులూరు బీజేపీకి?
– అనపర్తిలో బీజేపీకి ధరావతు దక్కుతుందా?
– దెందులూరులో బీజేపీకి బలం ఉందా?
– రాజమండ్రి కోసం చింతమనేని బలిపశువు చేస్తారా?
– ప్రభాకర్‌ను మారిస్తే బీజేపీ గెలుస్తుందా?
– ఈ ‘తపన’ ఎవరి కోసం?
– ఆయనకున్న బలమేమిటి?
– గెలుపు గుర్రాలపై అంచనా లేదా?
– టీడీపీ-బీజేపీలో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీ ఎటు పోతోంది? ఆ ఒక్కరి కోసం ఎందుకీ ‘తపన’? ఈ తపన పార్టీలోకి వచ్చి ఎన్నాళ్లయింది? ‘సంఘ’జనుల ‘అవసరాలు’ తీరిస్తే టికెట్ ఇచ్చేస్తారా? రాజమండ్రి సీటు గెలుపు కోసం దెందులూరును బలి చేస్తారా? ధరావతు కూడా దక్కని వారి కోసం చేసే లాబీయింగ్ ఎవరి కోసం? ఇదీ.. ఇప్పుడు బీజేపీ-టీడీపీలో నడుస్తున్నన్న హాట్ టాపిక్..

బీజేపీ నాయకత్వం స్థానిక బలాబలాలు తెలియకుండానే 10 సీట్లు తీసుకుందా? ఇది వ్యక్తుల ప్రయోజనం కోసమా? పార్టీ ప్రయోజనం కోసమా? కుల ప్రయోజనం కోసమా? డిపాజిట్లు కూడా దక్కని నియోజకవర్గాలను ఏరికోరి ఎంపిక చేసుకోవడం వెనుక మతలబేమిటి? దానివల్ల ఏ పార్టీకి పరోక్షంగా లాభం కలిగించాలన్న అజెండా ఉంది? ముక్కూ మొహం తెలియని వారిని కూడా, తమను సంతృప్తి పరిచార’న్న ఏకైక కారణ ంతో టికెట్లు ఇస్తారా? సంఘ్ నేతలు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండానే నివేదికలిస్తారా? అని కమలనాధులు తమ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఏలూరు నియోజకవర్గంలో దెందులూరు కీలకం. అక్కడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాస్ లీడర్. ఏ గ్రామానికి వెళ్లినా ఆయనను హత్తుకునే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. చింతమనేని పేరు ఒక వైబ్రేషన్. పోరాటానికి మారు పేరు. ఎవరినీ లెక్క చేయని నైజం. అలాంటి నేతను మార్చి, దెందులూరు ఎల్లని తెలియని తపన చౌదరి అనే నాయకుడికి సీటివ్వాలన్నది బీజేపీ నాయకత్వ పట్టుదల.

సదరు తపన ఇప్పటిదాకా, మూడు కోట్లు పార్టీ కోసం ఖర్చు పెట్టారన్నది పార్టీ పెద్దల ఉవాచ. బీజేపీ కీలక నేత ఒకరు, ఢిల్లీ మీడియాతో ఆమధ్య పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. ఆయన పార్టీ కోసం మూడు కోట్లకు పైగా ఖర్చు పెట్టుకున్నారు. ఆయన మా పార్టీకి కీలక నాయకుడని సెలవిచ్చారట. మరి అది నిజమేనా అంటే.. అంత సీను లేదన్నది ఆ పార్టీ నేతల నుంచి వచ్చే జవాబు. ఆరెస్సెస్ ప్రముఖులను సంతృప్తి పరచడమే టికెట్‌కు అర్హతా? ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టడమే ఎమ్మెల్యే-ఎంపీ సీట్లకు అర్హతా? సంఘ జనులకు ఫైట్ టికెట్లు, హోటల్ బుక్కింగ్సు, మానసికోల్లాసం క ల్పించడమే టికెట్‌కు ప్రాతిపదికనా? అన్నది బీజేపీ వర్గాలలో వినిపిస్తున్న ప్రశ్న.

నిజానికి తపన చౌదరి అనే నే తకు ఏలూరు ఎంపి సీటివ్వాలని, పార్టీ కీలక నేత ఒకరు తొలి నుంచీ పట్టుదలతో ఉన్నారు. వాస్తవానికి ఆ సీటు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆశించారు. అయితే ‘సంఘ’జనులతోపాటు, బీజేపీ కీలక నేత ఒకరిని ప్రసన్నం చేసుకున్న ఆయన, తన పేరు ముందువరలో ఉండేలా చూసుకున్నారు. ‘అలసిపోయే’ సంఘ్ నేతల మనోవికావసం.. వారి దారి ఖర్చులతోపాటు… బీజేపీ కీలక నేత ఖర్చులు చూసుకున్న నేపథ్యంలో, అంతపెద్ద కేంద మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా రేసులో వెనుకబడిపోయారు.

ఆ తర్వాత నర్సాపురం ఎంపీ సీటు దక్కకపోతే రఘురామకృష్ణంరాజు, ఏలూరు సీటు ఆశించారు. ఆ మేరకు చేసిన సర్వేలో ఆయనకు 73 శాతం వచ్చింది. ఈ ‘ఉనికికోసం పోరాటమ’నే గేమ్‌లో, అసలు నర్సాపురం సీటుకు రఘురామకృష్ణంరాజు పేరే సిఫార్సు చేయలేదు. అది వేరే విషయం. అది కమలంలో ‘మిధున’ం. దాని కథే వేరు.

తాజాగా రాజమండ్రి పార్లమెంటు పరిథిలోని అనపర్తి సీటును బీజేపీ నుంచి టీడీపీకి ఇవ్వాలంటే, ఏలూరు లోని దెందులూరు టీడీపీ సీటు బీజేపీకి ఇవ్వాలన్నది కొత్తగా వినిపిస్తున్న ప్రతిపాదన. నిజానికి అటు అనపర్తి, ఇటు దెందులూరు అసెంబ్లీలో బీజేపీకి నోటా కంటే తక్కువ బలమన్నది బీజేపీ వర్గాలే అంగీకరించే వాస్తవం. ఇంకా సూటిగా చెప్పాలంటే.. అనపర్తి సీటు టీడీపీకి ఇవ్వకపోతే రాజమండ్రి బీజేపీ ఎంపీ గె లవడం దుర్లభం.

అనపర్తి రెడ్లకు కంచుకోట. పైగా పార్టీ అభ్యర్ధి తండ్రి టీడీపీ వ్యవస్థాపక కాలం నాటి నేత తనయుడు. పార్టీ కోసం ఇప్పటికే జైలుకు సైతం వెళ్లొచ్చిన నేత. అక్కడ క్షత్రియుల బలం నామమాత్రం. కానీ బీజేపీ అనపర్తిని ఎంపిక చేసుకోవడమే వింత. అలాంటి సీటును బీజేపీకి కేటాయించడంతో తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఆ తీవ్రత తెలిసిన సంఘ్ నేతలు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలసి.. మీరు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయమని అడ గడం.. అందుకాయన ససేమిరా అనడం జరిగిపోయింది.

ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏమిటంటే.. అనపర్తి సీటు టీడీపీకి ఇవ్వకపోతే, వైసీపీ 70 వేల మెజారిటీతో గెలుస్తుందన్నది, బుర్ర-బుద్ధి ఉన్న ఎవరికైనా అర్ధమవుతుందన్నది, బీజేపీ-టీడీపీ శ్రేణుల ఉవాచ. అసలు ఎవరీ తపనా చౌదరి? ఆయన కోసం ఎందుకీ తపన? ఆయన పార్టీలోకి వచ్చి ఎన్నాళ్లయింది? ఆయన కోసం గెలిచే దెందులూరు సీటును, రాజమండ్రి సీటు గెలుపు కోసం ఎందుకు బలి చేస్తున్నారు? కేవలం ఒక వ్యక్తి కోసం ఏమిటీ తపన? అసలు బీజేపీలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? అన్నది ఇప్పుడు ఇరు పార్టీల్లో నడుస్తున్న చర్చ.

దెందులూరులో పోరాటయోధుడు ప్రభాకర్‌ను మార్చి, ఆ సీటు బీజేపీకి ఇస్తే, ఏలూరు ఎంపీ సీటు వైసీపీ ఖాతాలో కలవడం ఖాయమన్నది బీజేపీ-టీడీపీ శ్రేణుల్లో ఉన్న బలమైన అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితిలో అనపర్తి,దెందులూరు సీట్లను టీడీపీకి ఇవ్వకపోతే.. ఆ ప్రభావం అటు రాజమండ్రి, ఇటు ఏలూరు ఎంపీ సీట్లపై ప్రభావం కచ్చితంగా చూపిస్తున్నది కూటమి నిశ్చితాభిప్రాయం.

ఇప్పటికే ఏమాత్రం బలం లేని ఎచ్చెర్ల సీటును, సొంత సామాజికవర్గం కోసం తీసుకుని అప్రతిష్టపాలయిన బీజేపీ కీలక నేత, ఇప్పుడు మరొకరి కోసం దెందులూరు సీటు అడగడం.. అది కూడా రెండుచోట్లా సొంత సామజికవర్గ నేతల కోసమే పట్టుపట్టడం వల్ల.. సదరు నేత పార్టీ కోసం కాకుండా, సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్న విమర్శలకు, బలం చేకూరుతోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE