Home » కోడి కత్తి డ్రామా 2కు జగన్‌ ప్లాన్‌

కోడి కత్తి డ్రామా 2కు జగన్‌ ప్లాన్‌

-నాడు దళిత బిడ్డ, నేడు బీసీ బిడ్డల బలికి కుట్ర
-బీసీ వడ్డెర బిడ్డలపై వెల్లంపల్లి హత్యాయత్నం కేసే నిదర్శనం
-అక్రమంగా ఇరికించి బలవంతంగా ఒప్పించే యత్నం
-వెంటనే వడ్డెర బిడ్డలను విడుదల చేయాలని సంఘ నేతల డిమాండ్‌
-లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరికలు

మంగళగిరి, మహానాడు: అధికార దాహం కోసం జగన్‌ జగన్నాటకంతో వడ్డెర బిడ్డలను బలిచేసి అధికారంలో వచ్చేందుకు గులకరాయి డ్రామాకు తెరలేపారని వడ్డెర సంఘం నాయకులు మండిపడ్డారు. బీసీ వడ్డెర బిడ్డలపై హత్యాయత్నం కేసు పెట్టి బలవంతంగా ఒప్పించి ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో రాష్ట్ర టీడీపీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి మాట్లాడారు.

కోడి కత్తి డ్రామా 2
వైసీపీ నేతలు నాడు ఆడిన కోడి కత్తి డ్రామాలాగే నేడు గులకరాయి నాటకానికి తెరలేపి వేముల సతీష్‌, వేముల దుర్గారావులను అక్రమ కేసులో ఇరికించారన్నారు. అక్రమ అరెస్టులతో ఆ బిడ్డల తల్లిదండ్రులు విలపిస్తున్నారన్నారు. బీసీ బిడ్డలపై వెల్లంపల్లి పెట్టిన కేసు వడ్డెరలను అవమానించడమే అన్నారు. ఏదో జరిగిపోయినట్లు పోలీసులు పరుగులు పెట్టించి సతీష్‌ను తీసుకెళ్లడం పెద్ద డ్రామాలా ఉందన్నారు. చీకట్లో వచ్చిన గులకరాయి అది ముఖ్యమంత్రి జగన్‌కు తగిలి అక్కడ నుంచి వెల్లంపల్లికి తగిలి గాల్లో ఎగిరిపోవడం కోడి కత్తి డ్రామా2లా ఉందన్నారు.

రాయి దాడి డ్రామాను చూసి నవ్వుకుంటున్న జనం
రాష్ట్రంలో చంద్రబాబు మీద నందిగామ, ఎర్రగొండపాలెంలలో జరిగిన దాడులలో చీఫ్‌ సెక్రటరీ మధుకు రక్తం కారిపోయేలా దెబ్బలు తగిలాయన్నారు.. సెక్యూరిటీ సిబ్బంది సంతోష్‌ కుమార్‌కు తల పగిలి రక్తం ఏరులైందన్నారు. చంద్రబాబుపై నాలుగుసార్లు దాడి జరిగినా.. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినా చర్యలు లేవన్నారు. చంద్రబాబు ఇంటిపైకి జోగిని దాడికి పంపిన జగన్‌… చంద్రబా బు నాయుడు చేసిన పనికి ఎవరికో బీపీ వచ్చిందని చెప్పలేదా అని ప్రశ్నించారు. ఏమయ్యా కొడాలి.. ఎవరైనా రాయిపెట్టి కొడితే చచ్చిపోవడానికి అది ఏదైనా పావురమా పిట్టనా అని ఆనాడు అన్నావు. ఈ రోజు రాయితో చంపడం ఏంటి? ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి రాయితో కుట్ర చేస్తారా? సిగ్గుండాలి మీకు అని మండిపడ్డారు.

ఐపీసీ సెక్షన్‌ అమలు చేయాలి… వైసీపీ సెక్షన్‌ కాదు
పోలీసులను అడుగుతున్నా… ఐదేళ్లుగా బీసీలు, దళితులు మీద ఎన్నో కేసులు పెట్టారు. నా వంటి వారు కూడా రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చాం. దయచేసి పోలీసులు ఐపీసీ సెక్షన్‌ అమలు చేయాలి… వైసీపీ సెక్షన్‌ కాదు. అమర్నాథ్‌గౌడ్‌ను నడిరోడ్డుపై కాళ్లు చేతులు కట్టేసి తగలబెడితే ఏం చేశారు? ఆ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు ఆదుకున్నారు. జై జగన్‌ అననందుకు చంద్రయ్య పీకను కోడిని కోసినట్లు కోస్తే ఏం న్యాయం చేశారు. సుబ్బయ్యను నడిరోడ్డుపై నరికారు. ఇవేం మీకు కనబడలేదా? గంజాయి మత్తులో ఎంతమంది బీసీ బిడ్డలపై అత్యాచారాలు జరిగాయి? ఎంతమంది ఆస్తులను ధ్వంసం చేశారు? ఎంతమంది బీసీ బిడ్డలు కనపించకుండా పోయారు? ఎంత మంది బీసీ బిడ్డలను హతమార్చారు? ఇవేం కనబడటం లేదా? పోలీసులు వైసీపీ తొత్తులుగా మారి బీసీలకు అన్యాయం చేస్తే మూల్యం చెల్లించుకుంటారని గురుమూర్తి హెచ్చరించారు.

వైసీపీకి గుణపాఠం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల శవాల పునాధుల మీద జగన్‌ రెడ్డి వ్యాపారం చేస్తున్నాడని… ఎస్సీ, బీసీల ను అడ్డు పెట్టుకుని జగన్‌ అధికారం కోసం మరోసారి వడ్డెర బిడ్డలను కూనీ కోరులుగా మార్చి అవమానిస్తున్నాడని గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను అవమానిస్తున్న జగన్‌కు గుణ పాఠం చెబుతామన్నారు. బీసీలు కళ్లు తెరిచారని..జగన్‌ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయడం ఖాయమన్నారు. జగన్‌ పాలన అంతా విధ్వంసం, గూండాయిజమే అన్నారు. టీడీపీ పాలనంతా అభివృద్ధి, సంక్షేమమేనని పేర్కొన్నారు. జగన్‌ ది కన్నింగ్‌ టీమ్‌ అని.. మాది విన్నింగ్‌ టీమ్‌ అని, కూటమి ఊహించని మెజార్టీతో గెలుస్తుందని, బీసీ బిడ్డలతో ఆడుకున్న జగన్‌ రెడ్డిని సింగిల్‌ డిజిట్‌ లో కూర్చోబెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.

అధికారం కోసం వడ్డెర్లపై జగన్‌ కుట్ర
రాష్ట్ర టీటీపీ బీసీ విభాగ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వడ్డెర సేవా సంఘం అధ్యక్షుడు మల్లెల ఈశ్వరరావు మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కాడని.. చేతివృత్తులపై ఆధారపడే శ్రామికులు వడ్డెరలని… దుర్మార్గం గా రాయి విసిరారని వడ్డెర కులస్తులను ఇరికించడం దారుణమన్నారు. పసిబిడ్డలతో కోర్టు దగ్గర దుర్గారావు భార్య విలపిస్తుంటే తనకు కన్నీళ్లు ఆగలేదన్నారు. జగన్‌కు మా వడ్డెర్లే కనిపించారా అని ఈశ్వరరావు ప్రశ్నించారు. వాస్తవాలు లేకుండా మైనర్‌ బాలురను తీసుకు వెళ్లి హింసించడం దారుణ మన్నారు. వడ్డెర్లను నేరస్తులుగా చిత్రీకరించడం బాధాకరమన్నారు.

వడ్డెర బిడ్డలపై దుర్మార్గంగా హత్యాయత్నం కేసు
శ్రమనే ఆధారం చేసుకుని బతికే వడ్డెర్లను అక్రమ కేసుల్లో ఇరికిండం ఎంతవరకు న్యాయమో చెప్పాలన్నారు. వడ్డె ఓబన్న ఆశయాల కోసం పనిచేసే వ్యక్తులు వడ్డెర్లు అన్నారు. ఏ వ్యక్తుల మీదకు దాడులు, ఏ వ్యక్తిని అగౌరవ పరచడం మా వడ్డెర్ల బ్లడ్‌లో లేదన్నారు. వడ్డెర బిడ్డలపై దుర్మార్గంగా వెల్లంపల్లి హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. వడ్డెర్లు హత్యలు చేసేవారా? అని ప్రశ్నించారు.

కనిపించని దూర్గారావు జాడ.. ఉద్యమిస్తామంటున్న వడ్డెర నేతలు
ఈనాటికి దుర్గారావు ఎక్కడ ఉన్నాడో చూపించడం లేదని…వెంటనే దుర్గారావును విడిచిపెట్టాలని ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఇకనైనా బీసీల పట్ల పోలీసుల తీరు మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లు అంతా ఏకమై ఈ సైకో ముఖ్యమంత్రి, పాలకులకు బుద్ధి చెబుతామన్నారు. తప్పు వెంటనే సరిదిద్దుకుని దుర్గారావు, సతీష్‌లను తక్షణమే విడిచి పెట్టాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో విజయవాడ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల దుర్గారావు, గుంటూరు నగర వడ్డెర సంఘం అధ్యక్షుడు ఒరుసు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా వడ్డెర యువత అధ్యక్షుడు తిరుమల కొండ వెంకటేష్‌, మంగళగిరి పట్టణ వడ్డెర అధ్యక్షుడు వేముల శివ, విజయవాడ వడ్డెర యువత అధ్యక్షుడు దేవెళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Leave a Reply